Monday, March 2, 2026
E-PAPER
Homeదర్వాజతొలి తెలంగాణ నవలాకారుడు విద్వాన్‌ నాగం

తొలి తెలంగాణ నవలాకారుడు విద్వాన్‌ నాగం

- Advertisement -

విద్వాన్‌ నాగం పేరుతో రచనలు చేసిన నాగం మల్లారెడ్డి నల్లగొండ జిల్లా నూతన్‌కల్‌లో 15 జనవరి 1933 న జన్మించారు. నిజాం వ్యతిరేక ప్రజా విముక్తి పోరాటంలో తానూ ఒక క్రియాశీల కార్యకర్త అయిన మల్లారెడ్డి 1951లో వాల్తేరు నుండి మెట్రిక్‌ పాసై, కొంతకాలం ప్రభుత్వ సహకార శాఖలో ఉద్యోగం చేశాడు. 1952లో ఉపాధ్యాయుడిగా చేరిన మల్లారెడ్డి హిందీ విద్వాన్‌, హిందీ పండిత శిక్షణ పూర్తి చేసి ప్రథమ శ్రేణి హిందీ పండిట్‌ గా పదోన్నతి పొందాడు. తర్వాత ప్రయాగ హిందీ విశ్వవిద్యాలయం వారి సాహిత్య రత్న, హైదరాబాద్‌ నుండి ఉస్మానియా ఎం ఏ పట్టా పొందారు. 1987లో మెదక్‌ బాలికల జూనియర్‌ కళాశాలకు అధ్యాపకుడిగా వెళ్లి, 1991లో సూర్యాపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు వచ్చి అక్కడే ఉద్యోగ విరమణ చేశారు.

మొదటి నుండి విప్లవ భావాలు కలిగిన నాగం మల్లారెడ్డి కులరహిత సమాజం కోసం, సమ సమాజ స్థాపన కోసం ఎంతగానో కషి చేశారు. తన పేరులోని కుల వాచకమైన రెడ్డి పేరును త్యజించి విద్వాన్‌ నాగం పేరుతో చలామణి అయ్యారు. తన సంతానానికి కూడా రెడ్డి పేర్లు చేర్చలేదు. సూర్యాపేటలో నాస్తిక కేంద్రం నెలకొల్పి దాని ద్వారా అధ్యయన శిబిరాలు, తదితర కార్యక్రమాలు కొనసాగించారు. చివరి వరకు ప్రజాసేవ కార్యక్రమాల్లో తిరిగిన నాగం మల్లారెడ్డి 11 సెప్టెంబర్‌ 2000 న కన్నుమూశారు. వారి భార్య సుశీలమ్మ గారు కూడా స్వయం శక్తితో విద్యనభ్యసించారు. 1965 లో గ్రామ పంచాయితీ సర్పంచ్‌ గా ఏకగ్రీవంగా ఎన్నికై ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలను చేపట్టారు. 1972 లో అసోసియేట్‌ వుమెన్‌ వర్కర్‌ ట్రైనింగ్‌, గ్రామ సేవిక ట్రైనింగ్‌ సెంటర్ల ఏర్పాట్ల లోను, శిక్షణలోనూ పాల్గొని స్త్రీల అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు.

ప్రవృత్తి రీత్యా భావుకుడైన నాగ మల్లారెడ్డి కవిత్వం రాశారు. ” విద్వాన్‌ నాగం కథలు” పేరిట వెలువరించిన కథా సంపుటంతో పాటు ” వలయాలు, తెలంగాణ పోరాట యోధులు” అనే నవలలను కూడా రాశారు. ”గొబ్బూరి కృష్ణుడు, చంద్రశేఖర్‌ ఆజాద్‌ చరిత్ర” పేరుతో జీవిత చరిత్రలను రాశారు. ఇవి గాక ఇంకా కొన్ని తెలుగు, హిందీ రచనలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడినాయి. కులవాచకమైన పేరు మీద అయిష్టతతో వీరు ” నామర్‌ , ఎం ఆర్‌ నాగం, విద్వాన్‌ నాగం” అనే కలం పేర్లతోనే తమ రచనలు వెలువరించడం గమనించదగ్గ విషయం. భారతదేశపు చరిత్రలో 1946- 51 కాలంలో జరిగిన తెలంగాణలోని రైతాంగ సాయుధ పోరాటం ఒక అపూర్వ ఘట్టం. ఇది నికృష్టమైన దోపిడీ, పీడన, అణచివేతలను కొనసాగిస్తున్న ఫ్యూడల్‌ జమీందారీ, జాగిర్దారి విధానాన్ని కాపాడుతున్న రాజ్యాంగ యంత్రాన్ని కూల్చడం ద్వారా రైతాంగానికి, పీడిత ప్రజానీకానికి విముక్తి కలిగించటం కోసం చైతన్యవంతమైన ప్రజలు జరిపిన సాయుధ పోరాటం. తెలంగాణ సాయుధ పోరాటాన్ని చిత్రీకరిస్తూ వివిధ రూపాల్లో బోలెడంత సాహిత్యం వెలువడింది.

పోరాటం సాగుతున్న కాలంలోనే వెలువడిన నవలలు రెండే. మిలటరీ యాక్షన్‌కి ముందు బొల్లిముంత శివరామకృష్ణ రాసిన ‘మృత్యుంజయులు’ 1947లో వెలువడింది. అలాగే పమిడిముక్కల లక్ష్మీకాంత మోహన్‌ రాసిన ‘సింహగర్జన’ 1951లో వచ్చింది. ఇప్పటివరకు తెలంగాణ రచయిత రాసిన మొదటి పోరాట నవల వట్టికోట ఆళ్వారు స్వామి ”ప్రజల మనిషి” అని చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఆయన కంటే ముందే విద్వాన్‌ నాగం ‘తెలంగాణ పోరాట యోధులు’ పేరిట 1953లోనే సాయుధ పోరాట నవల రాసినా, అది విస్మృతిలోకి జారుకోవడం వలన ఎవరికి తెలియకుండా పోయింది. సినీ విమర్శకుడు హెచ్‌ రమేష్‌ బాబు పూనిక వల్ల, ప్రస్తుతం ఈ నవల వెలుగు చూడటం సంతోషదాయకం. మత ప్రాతిపదిక కలిగి, ఆర్థిక అసమానత్వం నిండిన నిజాం పరిపాలనలో విసుగెత్తిన ప్రజల విజృంభణయే ఈ ”తెలంగాణ విప్లవ యోధులు” నవలకు ప్రాతిపదిక. పార్టీ భేదాల కతీతంగా సాగించిన ఆ ప్రజా ఉద్యమంలో నేను భాగస్వామి అయినందుకు గర్విస్తున్నా. ఆనాటి ఉత్సాహమే ఈ పుస్తక రచనకు పురిగోలిపింది అని రచయిత ఎంఆర్‌ నాగం తెలియజేశారు.

పన్నుల పేరుతో జుర్మానాల పేరుతో లంచాల రూపంగా నైజాం ప్రజల రక్తాన్ని ప్రాణమానాల్ని మధ్య దళారీలైన దేశ్‌ ముఖ్‌ దేశపాండ్యాలు, జాగీర్ధార్‌ జమీందార్లు, పటేల్‌ పట్వారిలు, పంజు సర్పంజులు, గుమాస్తాలు సర్వనాశనం చేసి వేశారు. ఎవర్ని చూసినా సామాన్య ప్రజానీకం భయపడాల్సిందే. అందరికీ సలాములు పలుకాల్సిందే. కాల్మొక్త దొరా, నీ బాంచని దొరా అనవలసిందే. ఏమిటీ బానిసత్వం. తాము గాకపోయినా ముందు తరాల వారైనా దాస్య శృంఖలాల నుండి బయటపడాలంటే, వీరందరికీ తాము దాసోహం అనవలసిన పనిలేదని భావించిన నైజాం ప్రజా సామాన్యం లో చైతన్యం చోటుచేసుకుంది. జమీందారీ పరిపాలనకు స్వస్తి చెప్పాలనుకున్నారు. వ్యతిరేక ఉద్యమాన్ని లేవదీశారు. జమీందారీ వ్యతిరేక పోరాటం తలెత్తింది. దాంతో రైతుల ఇబ్బందులు మరి తీవ్ర రూపాన్ని దాల్చినయ్. నైజాం పాలకుల దమననీతి నృత్య మాడింది. ప్రభుత్వ కుటిలనీతిని ఎదిరించుటకు ప్రజలు సంఘాలుగా ఏర్పాటు అయ్యారు. కార్యకర్తలు రంగంలోకి దూకారు. క్రూర పరిపాలనను కూల ద్రోయుటకు హింసాయుత విప్లవమే సరైన మార్గమని తమకు ప్రజాపార్టీ అని పేరు పెట్టుకున్నారు.

శాంతి అహింసల నాదర్శంగా కొని మరికొందరు యోధులు జాతీయ సభను ఏర్పాటు చేశారు. జాతీయవాదుల సత్యాగ్రహ పోరాటం, ప్రజాపార్టీ హింసాయుత విప్లవం వారి ఉద్రేకపూరిత కార్య కౌశలానికి ప్రభుత్వం హడలెత్తింది. సర్కారు వారు క్రోధంతో సాముదాయిక జుర్మానాల పేరుతో గ్రామాలను నాశనం చేయ తలపెట్టింది. జమీందారులకు రక్షణగా మిలటరీని పంపించి ప్రజాసామాన్యాన్ని గిరి గీసి నిలుపుటకు శుష్క ప్రయత్నాలు గావించింది. ప్రజాపార్టీ గెరిల్లా పోరాటానికి పునాదులు వేసింది. ఆత్మరక్షణ పేరుతో జాతీయవాదులు ఆయుధ పోరాటంలోకి దిగారు. వీటన్నిటిని కనిపెడుతున్న ముస్లింలు ప్రభుత్వమే ఇక పడిపోయే దశలో ఉన్నదని భావించి దానిని రక్షించి తమ మతరాజరీకమును సుప్రసిద్ధముగా మనచేయడమే తమ లక్ష్యంగా రజాకార్‌ సంస్థను నెలకొల్పారు.
నైజాం సైనికుల వల్ల, రజాకార్‌ దుండగుల వల్ల హైదరాబాదు మారణ హోమగుండంగా తయారయింది. ప్రభుత్వ సిబ్బంది కొందరు ప్రజాసేవకులను పట్టుకొని చిత్రహింసలకు గురి చేశారు.

పార్టీలు క్రోధావేశాలతో ప్రభుత్వ అభిమానులైన గ్రామ ఉద్యోగుల ఇండ్లను కూలగొట్టి కొందరి ప్రాణాల్ని సైతం బలిగావించారు. పల్లెలు వదిలేసి పట్వారి పటేండ్లు పేరు మోసిన గ్రామ పెద్దలు పట్టణాల్లో మకాం పెట్టారు. పోలీసు బందాలతో కలిసి పల్లె ప్రజానీకంపై కనివినలేని అఘాయిత్యాల్ని జరిపించారు. పారిపోయిన ప్రజల ఇండ్లను లూటీ చేసి అక్కడి ధాన్యము సంపద కొల్లగొట్టుకుపోయారు. సత్యాగ్రహ విధానం అవలంబించి చెరసాలకు ఏగిన వారు పోగా, తక్కిన జాతీయ నాయకులు యూనియన్‌ సరిహద్దు ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పరిచి కార్యకర్తలను సమీకరించడానికి పూనుకున్నారు. ఆత్మ రక్షణ పేరుతో ఆయుధాలను కలిగియుండి వీరోచిత విప్లవానికి బలాన్ని చేకూర్చారు. గ్రామ గ్రామానికి త్రివర్ణ పతాకాన్ని ప్రతిష్టింపజేశారు. గ్రామోద్యోగులు పల్లెలు వదలగానే పల్లెపట్టులోని ప్రభుత్వ యంత్రాంగం నిలిచిపోయింది. వార్తలు తెలుపుటకైనా అక్కడ ప్రభుత్వం వారు ఎవ్వరూ లేరు.

అందువలన ప్రభుత్వం మిలటరీ క్యాంపులను ఎక్కువ చేసి దాంతో పాటు అరబ్బులను, రజాకార్లను విచ్చలవిడిగా గ్రామ సముదాయాలపై పంపింది. వారికి దోహదకారులుగా నిలిచిన మిలిటరీ వారు ఘోర మారణకాండ జరిపారు. దాన్ని చూసిన విప్లవకారులు ఆగ్రహాన్ని పట్టలేక గ్రామాలలోని నాటు తుపాకుల్ని పార్టీలు వసూలు చేయడం ప్రారంభించి, దళాలుగా గుంపులు గుంపులుగా ఏర్పడి ప్రభుత్వానికి ఎదురు దాడులు జరిపి, బుద్ధి చెప్ప సిద్ధపడినారు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది నైజాం. ప్రభుత్వం భారతదేశంలో విలీనం కాకుండా స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. తన రాజ్యాన్ని పటిష్ట పరచుకునే ఉద్దేశంతో ప్రజా పార్టీకి తోడు జాతీయ సభ మీద కూడా నిషేధాన్ని విధించి తన చాందసపోకడలను రుజువు చేసుకుంది దాంతో యూనియన్‌ సరిహద్దు ప్రాంతాలలో జాతీయ సభల కార్యాలయాలు నెలకొల్పబడినాయి. ఒకవైపు జాతీయ పార్టీ సభలు ఇంకొక వైపు ప్రజా పార్టీ సభలు ప్రజలను చైతన్య పరుస్తూ వారి భావజాలాన్ని ప్రచారం చేస్తూ కొనసాగినాయి.

ఈ నవలలో నాయికా నాయకులైన లీల, భగవానులు ప్రజాపార్టీలో చేరి, పార్టీ ఆదేశాల మేరకు పోరాటం సాగిస్తుంటారు. భగవాన్‌ మిత్రుడైన కవిరాజు జాతీయ పార్టీలో చేరి కార్యకర్తగా పనిచేస్తుంటాడు. అతను ప్రజాపార్టీలో చేరిన భగవానును నిలదీస్తాడు. అహింసాయుత ఉద్యమ కార్యకర్త కావడానికి బదులుగా, హింసాత్మక ధోరణిలో ఉన్న ప్రజా పార్టీలో చేరినందుకు అతనిని ఆక్షేపిస్తాడు. ఎంత సన్నిహిత మిత్రులైనా తమ భావజాలాలకు విరుద్ధమైన పార్టీలలో చేరడం వలన వారు విడిపోవాల్సి వస్తుంది. రెండు పార్టీలలో శత్రుపూరిత వైఖరులు చోటుచేసుకొనడం వలన ఒకరినొకరు చాటుమాటుగా దెబ్బ తీసుకోవడానికి కూడా వెనుకాడని పరిస్థితిని ఈ నవలలో చిత్రీకరించారు.

తెలంగాణ సాయుధ పోరాటాన్ని చిత్రీకరించిన ఇతర నవలల కంటే, ఈ నవల స్వతంత్రం వచ్చిన తర్వాత పోరాటం విరమించని కమ్యూనిస్టులు, జాతీయవాద కాంగ్రెస్తో కలిసి ఉమ్మడి పోరాటాన్ని చేయడాన్ని ప్రస్తావించారు. రెండు పార్టీల మధ్య ఆదిపత్య పోరాటాల వల్ల జరిగిన మారణకాండను కూడా ఈ నవలలో చిత్రీకరించడం జరిగింది. రచయిత కమ్యూనిస్టు పార్టీలో ఉన్నప్పటికీ అప్పటి చారిత్రికాంశాలను యథాతకంగా చిత్రీకరించడంలో చూపిన నిజాయితీని అభినందించకుండా ఉండలేం. విస్మృతికి గురైన ఈ నవలను సేకరించిన సినీ విమర్శకుడు హెచ్‌ రమేష్‌ బాబును, ఈ పుస్తకాన్ని వెలుగులోకి తెస్తున్న విద్వాన్‌ నాగం కుటుంబీకులకు, నా అభినందనలు తెలియజేస్తున్నాను.

  • కె. పి అశోక్‌ కుమార్‌, 9700000948
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -