ప్రారంభమైన వియత్నాం కమ్యూనిస్టు పార్టీ 14వ జాతీయ మహాసభలు
హనోయ్ : వియత్నాం కమ్యూనిస్టు పార్టీ (సీపీవీ) 14వ జాతీయ మహాసభలు హనోరులోని నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం ప్రారంభమయ్యాయి. ప్రతి ఐదేండ్లకోసారి సీపీవీ జాతీయ మహాసభలను నిర్వహిస్తుంది. 2030లో పార్టీ శతాబ్ది ఉత్సవాలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ ఏడాది దేశానికి కీలకమైన మలుపు కానుంది. అలాగే 2045లో వియత్నాం సోషలిస్టు రిపబ్లిక్ శతాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి.
అధ్యక్షుడు లూయాంగ్ కుయాంగ్ ప్రారంభోపన్యాసం చేస్తూ, 14వ జాతీయ మహాసభలను ఒక చారిత్రక మలుపుగా అభివర్ణిస్తూ, యావత్ పార్టీ, ప్రజలు, సాయుధ బలగాలు తమ సంకల్పాన్ని, ఆకాంక్షలను దీనిపై కేంద్రీకరించారన్నారు. ప్రధానమైన చారిత్రక మైలురాళ్ళకు దేశం సమాయత్త మవుతున్న తరుణంలో, నూతన అభివృద్ధి దశలో ప్రవేశిస్తున్న సమయంలో ఈ మహాసభలు జరుగుతు న్నాయన్నారు. అంతర్జాతీయంగా, ప్రాంతీయంగా పరిస్థితులు అత్యంత వేగంగా, అనూహ్యంగా మారిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అగ్ర దేశాల మధ్య వ్యూహాత్మక పోటీ ఉధృతమవుతోందన్నారు,. వాతావరణ మార్పులు, అంటువ్యాధులు, సైబర్ సెక్యూరిటీ ముప్పులతో సహా పలు సాంప్రదాయేతర భద్రతా సవాళ్ళను ఎదుర్కొనాల్సి వస్తోందన్నారు. నాల్గవ పారిశ్రామిక విప్లవం ముఖ్యంగా కృత్రిమ మేథస్సులో, డిజిటల్ సాంకేతికతలో, క్వాంటమ్ టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కుతోందని, ఇవన్నీ కలిసి అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక వ్యవస్థలకు కొత్త రూపునిస్తున్నాయన్నారు. కొత్త అభివృద్ధి నమూనాలను వియత్నాం అందిపుచ్చుకోవడానికి, కార్మిక ఉత్పాదకతను పెంచడానికి, జాతీయ పోటీతత్వాన్ని పెంచుకోవడానికి, పాలనను, దేశరక్షణను, భద్రతను బలోపేతం చేసుకోవడానికి ఈ పరివర్తనలు చాలా అవసరమని అన్నారు.
40ఏండ్లుగా అమలు చేస్తున్న దోయి మాయి (పునరుద్ధరణ) విధానాన్ని ఈ మహాసభలో సమీక్షించనున్నారు. ఈ కాలంలో దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధించారు. అంతర్జాతీయంగా దేశం స్థాయి పెరుగుతోంది. మొత్తంగా సమగ్రంగా అనేక గణనీయమైన విజయాలు సాధించారు. జాతీ యాభివృద్ధిలో నూతన శకాన్ని ఆవిష్కరించడానికి ఈ మహాసభలను ఒక నాందీ ప్రస్తావనగా చూస్తున్నారు. పటిష్టమైన, సంపద్వంతమైన, ఆధునిక వియత్నాంను నిర్మించాలన్న కమ్యూనిస్టు పార్టీ కృతనిశ్చయాన్ని ఈ మహాసభలు పునరుద్ఘాటించనున్నాయి. అధ్యక్షుడు హోచిమిన్ దార్శనికతను, వియత్నాం ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించనున్నాయి.
1586 మంది ప్రతినిధులు హాజరు
దేశవ్యాప్తంగా 56లక్షల మంది పార్టీ సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ 1586మంది ప్రతినిధులు మహాసభలకు హాజరయ్యారు. పార్టీ, ప్రభుత్వ సీనియర్ నేతలు, ప్రజా సంఘాల నాయకులు, మేథావులు, మత పెద్దలు, దౌత్య సిబ్బంది ఇలా అన్ని వర్గాలకు చెందినవారు మహాసభల ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాన కార్యదర్శి టో లామ్ అధ్యక్షతన 16మంది పొలిట్‌బ్యూరో సభ్యులతో కూడిన అధ్యక్షవర్గాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఐదుగురు సభ్యుల కార్యదర్శివర్గం, 13మంది సభ్యుల కమిటీలు ప్రతినిధుల క్రెడెన్షియల్స్‌ను పరిశీలించి, నిర్ధారించారు.
కీలక డాక్యుమెంట్లపై చర్చలు
13వ కేంద్ర కమిటీ రాజకీయ నివేదికను మహాసభల్లో చర్చించనున్నారు. గత 40ఏండ్లలో వియత్నాం సోషలిస్టు దృక్పథంతో కూడిన సంస్కరణలకు సంబంధించిన సైద్ధాంతిక, ఆచరణాత్మక అంశాలన్నింటినీ క్రోడీకరించిన నివేదికపై కూడా చర్చలు జరగనున్నాయి. 15ఏండ్ల పార్టీ నిబంధనావళి అమలు, ప్రతిపాదిత సవరణలను కూడా సమీక్షించనున్నారు. ఈ పత్రాలన్నీ కూడా 2026-2030 కాలానికి దేశ అభివృద్ధికి ఒక రూపునిస్తాయని, 2045వరకు దీర్ఘకాలిక వ్యూహాలకు పునాది వేస్తాయని భావిస్తున్నారు.
నూతన సామాజికాభివృద్ధి దిశగా వియత్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



