కాంగ్రేస్ నాయకుల డిమాండ్..
నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద మార్చి వరకు పూర్తి అయిన సీసీరోడ్లపై విజిలెన్స్ విచారణ జరపాలని మాజీ ఎంపీపీ ఎజాజోద్దిన్, మండల కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముధోల్ మండలానికి ఉపాధి పథకం కింద సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి సుమారు రూ.3 కోట్ల 50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అయితే ఇందులో సుమారు రూ.50 లక్షల వరకు అవినీతి చోటుచేసుకుందని వారు ఆరోపించారు. ఒకే గ్రామంలో ఉన్న సీసీరోడ్లకు క్యూబిక్ మీటర్ కు రూ.6096, అదే గ్రామంలో మరో సీసీరోడ్ కు క్యూబిక్ మీటర్కు రూ.7060 పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు ఎంబిలో రికార్డు చేయడం జరిగిందన్నారు. ఇలా వ్యత్యాసం చేయడం వల్ల ఆ కాంట్రాక్టర్ కు లాభం తప్ప ఏమి లేదన్నారు .
నిబంధన ప్రకారం చేయాల్సిన అధికారులు ఇష్టానుసారంగా ఒకరి, ఇద్దరి చేసిన పనులకే రేట్లు పెంచడం సరికాదన్నారు. దీనిపై విచారణ జరిగేంతవరకు సీసీ రోడ్డు, డ్రైనేజీ బిల్లులను చెల్లించవద్దని వారు ప్రభుత్వాన్ని కోరారు. తప్పుడు బిల్లులు చేసిన అధికారులను సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని సహించదన్నారు.ఈ బిల్లుల వ్యత్యాసంపై జిల్లా కలెక్టర్ కు, పంచాయతీరాజ్ కమిషనర్ కు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని వారు పేర్కొన్నారు. కొంతమంది నాయకులు తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు మండల కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి తెలిపారు.
తాను పిఎసిఎస్ చైర్మన్ గా ఏడు సంవత్సరాలు, మా తల్లి సరోజన రెడ్డి గత ఐదు సంవత్సరాలు జడ్పిటిసిగా పనిచేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సహకారంతో ముధోల్ మండలాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేశామన్నారు. తమ పదవి కాలంలో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ లు రాంరేడ్డి,రాజేందర్ రెడ్డి, సాయినాథ్,మాజీ ఎంపిటిసి పోతన్న యాదవ్, సయ్యద్ ఖాలిద్,నాయకులు రవింధర్ రెడ్డి,సమీ,నరెష్,బషిర్, కిష్టయ్య,మైసాజీ,గౌతం,విఠల్ రేడ్డి , ప్రవీణ్ రెడ్డి,రాజారెడ్డి,దిగంబర్, తదితరులు పాల్గొన్నారు.