కస్టమ్ మిల్లింగ్ రైస్ లెక్కల్లో గోల్‌మాల్
ఖమ్మంలో ఎటూతేలని రూ.82 కోట్ల బకాయి
చర్చనీయాంశంగా మారిన మహిళా పారిశ్రామికవేత్త చర్యలు
రాష్ట్రంలో పలుచోట్ల సీఎంఆర్ బకాయిలదీ ఇదే తీరు
గత ఖరీఫ్, రబీ సీఎంఆర్ నిల్వల్లోనూ తేడాలు
ధాన్యం గల్లంతవుతుండటంపై దాడులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలోని వివిధ రైస్‌మిల్లుల్లో ధాన్యం నిల్వల గల్లంతుపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దృష్టి సారించారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) లెక్కల్లో తేడాలు చోటుచేసుకుంటుండటంపై ఆరా తీస్తున్నారు. గతంలో చోటుచేసుకున్న అవకతవకలను దృష్టిలో పెట్టుకొని ఏకంగా విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలేశాపూర్ గ్రామ పరిధిలోని పీవీఆర్ ఆగ్రో ఇండిస్టీస్ రైస్‌మిల్లులో సోదాలు చేపట్టి రూ.1.48 కోట్ల విలువైన ధాన్యం గల్లంతు అయినట్టు తేల్చారు. సోదాల్లో మొత్తం 6,250.23 క్వింటాళ్ల ధాన్యం లోటు ఉన్నట్టు గుర్తించి పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోనూ ఇలాగే దాడులు చేపట్టారు. రబీ సీజన్ ధాన్యం దారిమళ్లుతున్న వ్యవహారాన్ని ఇటు తాడికల్‌లోనూ గుర్తించారు.
రూ.కోట్ల విలువైన ధాన్యాన్ని దారిమళ్లిస్తున్న మిల్లర్లపౖౖె చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు అందుతున్నాయి. పదేండ్లుగా 360 మందికి పైగా రైస్‌మిల్లర్లు రూ.3వేల కోట్లకు పైగా విలువైన సీఎంఆర్ బియ్యం ఇవ్వకుండా ప్రభుత్వానికి ఎగవేస్తున్నారు. కేవలం 20 మంది మిల్లర్లు ఏకంగా రూ. 600 కోట్ల విలువైన బియ్యాన్ని ప్రభుత్వానికి సఫ్లరు చేయలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలతో సివిల్ సఫ్లరు ఆఫీసర్లు రైస్ మిల్లులకు వెళ్లి తనిఖీలు చేపట్టారు. కానీ అక్కడ వడ్ల బస్తాలు కనిపించలేదు. బియ్యం కూడా లేవు. మొదట్లో ప్రభుత్వం కేటాయించిన వడ్లను మిల్లర్లు బయట అమ్ముకొని లెవీ పెట్టేవారు కాదు. ఈ నేపథ్యంలో అధికారులు రైస్‌మిల్లులకు నోటీసులు ఇవ్వటంతో పాటు కొన్ని చోట్ల సీజ్ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు తీసుకున్న స్టీఫెన్ రవీంద్ర సీఎంఆర్ బియ్యం ఇవ్వని రైస్‌మిల్లుల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలకు ఆదేశించారు.
సీఎంఆర్ గోల్‌మాల్ మిల్లర్లలో వణుకు
గత వానాకాలం, యాసంగి సీజన్‌లో కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం సేకరించిన ధాన్యం, మిల్లర్లకు అప్పగించగా వారు మరపట్టి కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను తిరిగి భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), పౌరసరఫరాల శాఖకు అప్పగించాల్సి ఉంది. ఖరీఫ్ బియ్యానికి మే 31వ తేదీ, రబీ రైస్‌కు సెప్టెంబర్ 30వ తేదీ వరకు ప్రభుత్వం గడువు విధించింది. కానీ చాలా వరకు మిల్లులు నిర్దేశిత గడువులోగా ఇచ్చిన లక్ష్యం మేరకు సీఎంఆర్ అప్పగించలేదు. గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఎఫ్‌సీఐ, పౌరసరఫరాలశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేసి నివేదికలు ప్రభుత్వానికి సమర్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా సీఎంఆర్ లక్ష్యం చేరని మిల్లులన్నింటిలోనూ ఈ తనిఖీలు సాగాయి. మిల్లుల్లో బియ్యానికి సరిపడా నిల్వలు ఉన్నాయా? లేవా? అనేది పరిశీలించారు. ఇప్పుడు ఏకంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తుండటంతో మిల్లర్లలో వణుకు మొదలైంది. గతంలోనూ అవకతవకలు చోటుచేసుకున్న మిల్లుల వ్యవహారం ఈ సందర్భంగా చర్చకు వస్తోంది. కొణిజర్ల మండలం లాలాపురంలోని ఓ మహిళా పారిశ్రామికవేత్త ఉదంతం ఈ సందర్భంగా చర్చనీయాంశంగా మారింది.
సీఎంఆర్ బకాయిలు రూ.82 కోట్ల ఎగవేతకు యత్నాలు!
ఖమ్మం జిల్లాలో ఓ మహిళా పారిశ్రామికవేత్త రూ.82 కోట్ల సీఎంఆర్ బకాయిల ఎగవేతకు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలపై రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సఫ్లయిస్, టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులు కొనసాగాయి. జిల్లాలో 80కి పైగా మిల్లులు ఉండగా కొణిజర్ల మండలంలోని ఈ పారిశ్రామికవేత్త మిల్లు సీఎంఆర్‌లో 25వేల టన్నుల ధాన్యం వ్యత్యాసం ఉన్నట్టు బయటపడింది. ఈ ధాన్యం విలువ రూ.82 కోట్లుగా అధికారులు నిర్ధారించారు. పారిశ్రామికవేత్తపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు విచారణలో ఉంది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మిల్లును తెరిచి నిర్వహిస్తున్నారు. మిల్లు నిర్వహణపై ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. కోర్టు తీర్పు జాప్యం అవుతుండటం ఈ పారిశ్రామికవేత్తకు కలిసి వస్తోంది.
ఎంచక్కా సీఎంఆర్ బకాయిని పక్కకు పెట్టి తనకు చెందిన ఓ ఆస్పత్రిని శాఖోపశాఖలుగా విస్తరిస్తున్నారు. ఖమ్మంలోని తన ఆస్పత్రికి అనుసంధానంగా ఇటీవలే హైదరాబాద్‌లో మరో బ్రాంచ్‌ని ఓపెన్ చేశారు. ఇలా రూ.కోట్లు వెచ్చించి ఆస్పత్రులు, వివిధ బిజినెస్ సంస్థలను స్థాపించుకుంటూ పోతున్న ఈ మహిళా పారిశ్రామికవేత్త.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్ బకాయి డబ్బులను మాత్రం పెండింగ్‌లోనే పెడుతుండటం గమనార్హం. వ్యవస్థలను మేనేజ్ చేయటంలో ఆరితేరిన ఈ పారిశ్రామికవేత్తకు ఓ మంత్రి సహాయ సహకారాలు పుష్కలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇలా సీఎంఆర్ బకాయిలు ఎగవేస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకునే దిశగా పౌరసరఫరాల శాఖ తీవ్రంగా దృష్టి సారించటంతో పలువురు మిల్లర్లలో ఆందోళన మొదలైంది.