Tuesday, September 30, 2025
E-PAPER
Homeజాతీయంఉద్దేశపూర్వకంగానే విజయ్‌ ఆలస్యంగా వచ్చారు

ఉద్దేశపూర్వకంగానే విజయ్‌ ఆలస్యంగా వచ్చారు

- Advertisement -

ఎఫ్‌ఐఆర్‌లో అభియోగాలు
41కి పెరిగిన మృతులు
తిరుచ్చి :
కరూర్‌లో శనివారం జరిగిన ర్యాలీకి టివికె వ్యవస్థాపకుడు, హీరో విజయ్‌ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యంగా వచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో అభియోగాలు మోపారు. శనివారం కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆ పట్టణ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ర్యాలీ నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా ప్లాన్‌ చేసి విజయ్‌ రాకను ఆలస్యం చేశారని ఎఫ్‌ఐఆర్‌ ఆరోపించింది. నీరు, ఇతర సౌకర్యాలు లేకుండా ప్రజలు గంటల తరబడి వేచి ఉన్నారని, ఉక్కబోత, రద్దీ కారణంగా అలసిపోయారని, దీని ఫలితంగా తొక్కిసలాట జరిగి అనేక మంది మరణించారని ఎఫ్‌ఐఆర్‌ పేర్కొంది. కరూర్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.మణివన్నన్‌ సుమోటోగా ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. టివికె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్‌, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సిటిఆర్‌ నిర్మల్‌ కుమార్‌, పార్టీ జిల్లా కార్యదర్శి మతిమఝుగన్‌లను నిందితులుగా పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కరూర్‌కు విజయ్‌ వస్తారనే సమాచారంతో ఉదయం 10 గంటల నుంచే ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడారు. బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ కోసం 500 మంది పోలీసులు, హోమ్‌గార్డులను నియమించారు. విజరు సమావేశానికి పోలీసులు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకూ మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ.. నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా ప్రణాళిక వేసుకుని, తమ రాజకీయ బలాన్ని ప్రదర్శించే ఉద్దేశంతో విజయ్‌ రాకను నాలుగు గంటలు ఆలస్యం చేశారని ఎఫ్‌ఐఆర్‌ తెలిపింది. పోలీసు అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా నిర్వాహకులు పట్టించుకోలేదని ఎఫ్‌ఐఆర్‌ ఆరోపించింది.

41కి చేరిన మరణాలు
కరూర్‌ తొక్కిసలాట మృతుల సంఖ్య సోమవారం నాటికి 41కి పెరిగింది. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన 60 ఏళ్ల మహిళ సుగుణ కరూర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజి ఇంటెన్సివ్‌ యూనిట్‌లో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మరణించారు. దీంతో మరణించిన మహిళల సంఖ్య 18కి పెరిగింది. మరో తొమ్మిదిమంది చిన్నారులు, 14 మంది పురుషులు మరణించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -