Sunday, November 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవినయకుమార్‌ జీవిత ప్రస్థానం నేటి తరానికి ఆదర్శం

వినయకుమార్‌ జీవిత ప్రస్థానం నేటి తరానికి ఆదర్శం

- Advertisement -

ఆయన చేసే ప్రతి పనిలో నిబద్ధత: రచయిత, బీసీ కమిషన్‌ మాజీ అధ్యక్షులు జి. రాములు
”పేపర్‌ బాయ్ టు ఎడిటర్‌” పుస్తక పరిచయ సభ

నవతెలంగాణ-కాప్రా
వినయకుమార్‌ జీవిత ప్రస్థానం నేటి తరానికి ఆదర్శమని, ఆయన చేసే ప్రతి పనిలో నిబద్ధత కనిపిస్తుందని రచయిత, బీసీ కమిషన్‌ మాజీ అధ్యక్షులు జి. రాములు అన్నారు. టీపీఎస్‌కే- స్ఫూర్తి గ్రూప్‌ ఆధ్వర్యంలో ప్రజాశక్తి పూర్వ సంపాదకులు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్‌. వినయకుమార్‌ రచించిన ”పేపర్‌ బాయ్ టు ఎడిటర్‌” పుస్తక పరిచయ సభ శనివారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కమలానగర్‌లోని సీఐటీయూ ఆఫీసులో నిర్వహించారు. స్ఫూర్తి గ్రూప్‌ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో ఆయన మాట్లాడారు. వినయకుమార్‌ రాసిన ఈ పుస్తకం ఒక వ్యక్తి జీవితమే కాకుండా ఆ కాలం ‘సామాజిక-ఆర్థిక-రాజకీయ’ చిత్రాన్ని కండ్లకు కట్టినట్టు చూపిస్తుందన్నారు.

ఆయన జీవితాన్ని సీపీఐ(ఎం) దార్శనికతే సరైన దారిలో నడిపిందని తెలిపారు. రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ పద్మావతి పుస్తక పరిచయం చేస్తూ వినయకుమార్‌ తన తండ్రి ప్రోత్సాహంతో విద్యను హక్కుగా స్వీకరించి, ఎన్నో వివక్షలను ఎదుర్కొంటూ విద్యాభ్యాసాన్ని కొనసాగించి నేటి స్థాయికి చేరుకున్నారని అన్నారు. ప్రముఖ జర్నలిస్టు కంబాలపల్లి కృష్ణ మాట్లాడుతూ.. వినయకుమార్‌ వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. టీపీఎస్‌కే గౌరవాధ్యక్షులు జి. రాములు మాట్లాడుతూ.. వినయకుమార్‌ జీవిత ప్రయాణం రచయితలు, యువకవులు, జర్నలిస్టులకు మార్గదర్శకమని అన్నారు.
వినయకుమార్‌ మాట్లాడుతూ.. తన జీవితంలో తండ్రి ప్రోత్సాహం, సతీమణి సుజావతి నిస్వార్థ సహకారం వల్లే నిరంతరంగా ముందుకు సాగగలిగానని చెప్పారు. పిల్లలు కులాంతర వివాహాలు చేసుకోగా కుటుంబం అద్భుతంగా నిలబడిందని తెలిపారు.

ఈనాడు పత్రికలో తన రచనలను రామోజీరావు ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. జర్నలిస్టుగా మన్మోహన్‌సింగ్‌ అమెరికా పర్యటనలో పాల్గొనడం ఒక ప్రత్యేక అనుభవమని తెలిపారు. నాటి పత్రికారంగంలో ప్రశ్నించే స్వేచ్ఛ ఉండేదని, నేడు పాలకులను ప్రశ్నించే పరిస్థితి చాలా కష్టం అయిందన్నారు. అనంతరం వినయ్ కుమార్‌ జీవితప్రస్థానంపై ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. స్ఫూర్తి గ్రూప్‌ నాయకులు వెంకటసుబ్బయ్య రచయితను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి గ్రూప్‌ నాయకులు శివన్నారాయణ, ఫూలే ఇంగ్లీష్‌ కోచింగ్‌ వ్యవస్థాపకులు కర్రే మల్లేశం, నాయకులు శ్రీనివాసరావు, బాలు, వెంకట సుబ్బయ్య, వెంకటేశ్వరరావు, శారద, రోజారాణి, గుమ్మడి హరిప్రసాద్‌, కరుణాకర్‌ రెడ్డి, పి.బి. చారి, భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -