Sunday, May 25, 2025
Homeజోష్నాట‌కం - న‌ట‌న ఫిల్మ్ అకాడ‌మి వినోద్

నాట‌కం – న‌ట‌న ఫిల్మ్ అకాడ‌మి వినోద్

- Advertisement -

గాడ్‌ఫాదర్లు లేరు.. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం అంతకన్నా కాదు. తెరపై కనపడితే చాలన్న కసి ఉంది. అందుకు థియేటర్‌ ఆర్ట్స్‌ దారి చూపింది.. నటనలో రాటు దేల్చింది. సీన్‌ కట్‌ చేస్తే… లక్ష్మి, యమదొంగ, ఐఐటి కష్ణమూర్తి, సర్కిల్‌, నేనే ముఖ్యమంత్రి, అన్‌స్పెటెడ్‌ గెస్ట్‌, కీచక, టక్‌ జగదీష్‌, లవర్‌ బారు గా తన నటనతో మెప్పించి.. చంద్రోదయం, లాంప్‌, ఇది నా సెల్ఫీ, తెలుగోడు, మా తల్లి సినిమాల్లో హిరోగా జనంతో చప్పట్లు కొట్టించుకున్నారు. ఆ సాదాసీదా కథానాయకుడే వినోద్‌ కుమార్‌ నువ్వుల. నాటకం, నటన, ఫిల్మ్‌ ఇన్స్టిట్యూట్‌ తన జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయో, ఈ స్థాయికి చేరడానికి చేసిన ప్రయాణాన్ని ‘జోష్‌’తో పంచుకున్నారు.


ఒక గాఢమైన కోరిక మనిషిని ఎంతవరకైనా తీసుకెళ్తుంది. ఏదైనా వదులుకునేలా చేస్తుంది. దానికి సాక్ష్యం వినోద్‌ కుమార్‌ నువ్వుల. పుట్టిపెరిగింది గుంటూరు జిల్లా నాగభైరువారిపాలెంలో. చదివింది పక్కనే ఉన్న చిలకలూరిపేటలో. చాలామందిలాగే చిన్నప్పట్నుంచే తనకి నటనంటే బాగా ఇష్టం. ఇది ఎంత లోతుగా ఉండేదంటే.. 7వతరగతిలోనే నాటకాలు వేయడం ప్రారంభించిన వినోద్‌ 10వ తరగతిలో ఉండగానే నాటకానికి దర్శకత్వం వహించే స్థాయికి చేరుకున్నాడు. పైగా చిన్నతనంలో నాన్న, బాబారు, మామయ్య నాటకాలు ఆడుతుంటే దగ్గర్నుంచి చూడటం.. అలాగే ఊర్లో కాకతీయ కళాపరిషత్‌ నాటకాలు పోటీలను బాగా దగ్గర నుంచి గమనించాడు. అక్కడికి వచ్చిన సెలబ్రిటీలను చూడటం వాళ్లకు జనం కొట్టిన చప్పట్లు ఇవన్నీ చూసిన తర్వాత నేను కూడా నటుడిని అయితే బాగుంటుంది అని బాగా మనసులో పడిపోయింది. నటన మీద ఆసక్తి కలిగింది. ఆ ఆశ కుదురుగా ఉండనిస్తుందా? చుట్టుపక్కల ఎక్కడ నాటక ప్రదర్శనలు జరిగినా వాలిపోయేవాడు. ప్రతిదీ ఆసక్తిగా గమనించేవాడు. ఇంట్లో అందరిని ఇమిటేట్‌ చేయడం.. వాళ్లలా నటించడం నిత్యకత్యం అయ్యాయి. కొడుకు ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు విజయలక్ష్మి, నాగేశ్వరరావులు ప్రోత్సహించారు. మొదట తన శ్రీమతి రత్నకుమారి సహకారం లేకపోయినా తర్వాత చాలా సపోర్ట్‌గా నిలిచింది. తిదిక్ష, సుప్రీత్‌ కార్తికేయ వీరి పిల్లలు. చిలకలూరు పేటలో బీకాం వరకు చదివిన వినోద్‌ హైదరాబాద్‌ వచ్చి సాఫ్ట్‌ వేర్‌ కోర్సులు చేసినా, ఎంబీఏ చేశారు. అయినా నటన మీద ఆసక్తి అంతకంతకూ పెరుగుతూనే వచ్చింది.
నాటకాలతోపాటు సినిమా ప్రయత్నాలూ జోరుగా సాగుతుండేవి. ‘చేద్దాం’, ‘చూద్దాం’ అనేవాళ్లేగానీ అవకాశం ఇచ్చినవాళ్లు లేరు. ఇలాగైతే లాభం లేదనుకొని తన మిత్రుడితో కలిసి ఫొటోలు పట్టుకొని అన్ని స్టూడియోల చుట్టూ తిరిగి పోటోలు ఇచ్చారు. ఆ మరుసటి రోజే వివి వినాయక్‌ ఆఫీస్‌ నుంచి కాల్‌ రావడం…విక్టరీ వెంకటేష్‌ నటించిన ‘లక్ష్మి’ సినిమాలో ఒక సీన్‌లో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ‘యమదొంగ’ సినిమాలో విలన్‌ అసిస్టెంట్‌గా అవకాశం వచ్చింది. ఆ తరువాత మరికొన్ని సినిమాల్లో సైడ్‌ క్యారేటర్స్‌ చేశాను. చంద్రోదయం, లాంప్‌, ఇది నా సెల్ఫీ, తెలుగోడు, మా తల్లి సినిమాల్లో హిరోగా చేస్తూ పరిశ్రమ దష్టిలో పడ్డా. అప్పటి నుంచి వరుసగా పెద్ద సినిమాల్లో టక్‌ జగదీష్‌, ఆచార్య, అల వైకుంటపురం దాకా ఎన్నో అవకాశాలు వచ్చాయి. వస్తున్నాయి. అయితే ఇండిస్టీలోకి ఎలా అడుగుపెట్టాలో తెలియని నాకు దారి చూపించి.. సినీ మిత్రులు, ఎంతోమంది ఆత్మీయులను పరిచయం చేసింది మాత్రం నాటకమేనని గర్వంగా చెప్పారు.

వినోద్‌ ఫిల్మ్‌ అకాడమీ గురించి తన మాటల్లోనే…
నేనూ రాజశేఖర్‌ పాండే గారి దగ్గర నటనలో మెలుకువలు నేర్చుకున్నాను. నన్ను చాలామంది మీరు మంచి నటులు కదా మీరు ట్రైనింగ్‌ ఇస్తే బాగుంటుందని అడుగుతూ ఉండేవారు. కానీ నాకు ఇన్స్టిట్యూట్‌ లేనందువల్ల నేను ఇవ్వలేకపోయేవాడిని. అది కాక చాలామంది కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు చాలామందిని నమ్మి డబ్బులు పోగొట్టుకోవటం నేను ప్రత్యక్షంగా చూశాను. అది నాకు మనసులో చాలా బాధగా అనిపించేది. అదిగాక కరోనా టైంలో షూటింగ్స్‌ ఆగిపోవటం వల్ల ఏదో మనకి తెలిసిన పని చేస్తే నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు అలాగే నలుగురికి ఉపయోగపడవచ్చు అని ఉద్దేశంతో మిత్రుల సలహా మేరకు నేను వినోద్‌ ఫిలిం అకాడమీని ప్రారంభించాను.
‘తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్టు నేర్చుకోవాలి. కాబట్టి ప్రతి క్షణాన్ని బాగా వినియోగించుకోండి’ అని మా అకాడమి విద్యార్థులకు చెబుతాను. మంచి అనుభవజ్ఞులైన నలుగురు ఫ్యాకల్టీ ఉన్నారు. వారు నటనలో మంచి మెలుకువలు నేర్పుతున్నారు. ప్రస్తుతం నటులకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. సినిమాలు, సీరియల్స్‌, ఓటీటీలు, వెబ్‌ సిరీస్‌లు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అందుకు తగ్గ కాంపిటేషన్‌ కూడా ఉంది. కాంపిటీషన్‌ కి తగ్గట్టుగా మనం ప్రిపేర్‌ అయ్యి ఉండకపోతే ఆడిషన్స్‌లో సెలెక్ట్‌ అవటం చాలా చాలా కష్టం. కాబట్టి షూటింగ్‌కి వెళ్ళిన తర్వాత నీకు నటన నేర్పుకునేంత టైం డైరెక్టర్లకు ఉండదు కాబట్టి మాలాంటి ట్రైనింగ్‌ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకొని వెళ్లేయితే షూటింగ్‌లో ఈజీగా యాక్టింగ్‌ చేయగలుగుతారు. కోర్స్‌ కంప్లీట్‌ అయిపోయిన తర్వాత వాళ్ళని అలా వదిలేయకుండా ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో ప్రొడక్షన్‌ హౌసులతో మాట్లాడి వాళ్ళకి అవకాశాలు కూడా ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కోర్స్‌ కంప్లీట్‌ అయిపోయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్‌ ఇస్తాము ఫొటోషూట్‌ చేపిస్తాము. షార్ట్‌ వీడియోస్‌ చేపిస్తాము. ఆడిషన్స్‌ కూడా మా దగ్గర పెట్టిస్తుంటాం. ఇంత మంచి సబ్జెక్టు ఇంత సపోర్టు ఇన్ని సౌకర్యాలు కావాలంటే చాలా ఎక్కువ ఫీజు ఉంటుంది బయట. కానీ మా దగ్గర మాత్రం చాలా తక్కువ ఫీజులోనే ఎంతో సర్వీసు ఓరియెంటెడ్‌గా మేము ఈ ట్రైనింగ్‌ ఇస్తున్నాం. యాక్టింగ్‌లో యంగ్‌ జనరేషన్‌ రావాలి. అందుకు మా వినోద్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఒక వేదికగా నిలుస్తుంది. ఆసక్తి వున్నవాళ్లు 7386667989 నెంబరుకు సంప్రదించవచ్చు.
ఓటిటి వేదికలు ప్రజెంట్‌ కొత్త నటీనటులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఇప్పుడు సినిమా తీస్తే కంపల్సరీ సినిమా థియేటర్లోనే రిలీజ్‌ చేయాలి అన్న ఆలోచన లేకుండా ఓటీటీల కోసం కూడా సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. అలాగే వెబ్‌ సిరీస్‌, షార్ట్‌ ఫిలింలు ఇలా ఎన్నో రకాలుగా ఓటీటీలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఇంకా కొత్త కొత్త ఓటీటీలు కూడా రావాలి. ఇప్పటివరకు వరకు నేను చేసిన పాత్రల్లో నాకు బాగా త్రిల్లింగ్‌ అనిపించినా పాత్ర మాత్రం మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌ లతో కలిసి నటించిన ఆచార్య నటించడం ఒక పెద్ద అచీవ్మెంట్‌. నేను హీరోగా నటించిన ల్యాంప్‌ సినిమా నాకు నటుడుగా చాలా సంతప్తినిచ్చింది. విభిన్నమైన పాత్రలో నేను నటించాను.


భవిష్యత్తు ప్రణాళికలు
ఒక లక్ష్యం అనుకుంటే దానికి బోలెడన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అయినా మనసు పెట్టి పని చేస్తుంటే అన్నీ కలిసొస్తాయి. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. నా భవిష్యత్తు లక్ష్యం మంచి యాక్టర్‌ గా పేరు తెచ్చుకోవాలనేది నా లక్ష్యం. కానీ ఈ క్రమంలో కొంతమంది మంచి నటీనటులను కూడా ఇండిస్టీకి అందించి వారు కూడా భవిష్యత్తులో నా పేరు చెప్పుకునేలాగా వాళ్ళని తయారు చేయాలనేది నా ఆశయం. చిన్న ప్రొడక్షన్‌ అయితే చేస్తూ ఉన్నాను అంటే షార్ట్‌ ఫిలింలు వెబ్‌ సిరీస్లు మాత్రం నిర్మించాను నిర్మాతగా .భవిష్యత్తులో కూడా పెద్ద సినిమా ఒకటి నిర్మించాలని నా కోరిక .అలాగే ఫ్యూచర్లో దర్శకత్వం చేస్తే కూడా చేయవచ్చు.
నేను చేసిన ప్రాజెక్టులు రిలీజ్‌ అవ్వటానికి రెడీగా అమర్దీప్‌ చౌదరి హీరోగా మహేంద్ర గారు ప్రొడ్యూసర్‌ గా చేస్తున్న సినిమా ఒకటి రెడీగా ఉంది. అలాగే శాసనమా చట్టమా అనే సినిమాలో మెయిన్‌ రోల్‌ చేస్తున్నాను. హీరో సుమన్‌ కొడుకు క్యారెక్టర్‌. అలాగే ఇంకొక రెండు ప్రాజెక్టులు కూడా రెడీగా ఉన్నాయి రిలీజ్‌ కి సిద్ధంగా ఉన్నాయి. భవిష్యత్తులో నేను దశావతారంలో కమలహాసన్‌ లాగా ఒకే సినిమాలో పది క్యారెక్టర్లు చేయాలనేది నా అభిలాష.

అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -