Thursday, January 1, 2026
E-PAPER
Homeజాతీయంమోడీ పాలనలో కార్మిక హక్కుల హననం

మోడీ పాలనలో కార్మిక హక్కుల హననం

- Advertisement -

అదే స్థాయిలో ఐక్య పోరాటాలు హర్షణీయం
ఇందులో సీఐటీయూదే కీలక పాత్ర
ఐక్యతే ఆయుధంగా ఆధిపత్య వర్గాలపై పోరుసల్పుదాం సీఐటీయూ అఖిల భారత మహాసభలో డబ్ల్యూఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి పాంబిస్‌ కిరిట్సిస్‌ పిలుపు
ప్రతిఘటనోద్యమాలకు సంపూర్ణ మద్దతునిస్తామని హామీ
ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు
విశాఖపట్నంలో ఉత్తేజభరితంగా సీఐటీయూ అఖిల భారత మహాసభ ప్రారంభం
అరుణ పతాకాన్ని ఆవిష్కరించిన అధ్యక్షులు డాక్టర్‌ కె.హేమలత

విశాఖపట్నం నుంచి ఎస్‌.వెంకన్న

నయా – ఉదారవాద చట్రంలో అంతర్భాగమైన భారతదేశాన్ని పాలిస్తున్న మోడీ సర్కార్‌ కార్మికుల హక్కుల హననానికి పాల్పడుతోందని ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌టీయూ) ప్రధాన కార్యదర్శి పాంబిస్‌ కిరిట్సిస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అదే స్థాయిలో కార్మిక వ్యతిరేక, ప్రజా కంటక విధానాలను తిప్పికొడుతూ ఇక్కడి కార్మిక-కర్షకవర్గం ఐక్య పోరాటాలు నిర్వహించటం హర్షణీయమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పోరాటాల్లో సీఐటీయూ కీలకంగా వ్యవహరించటం అభినం దనీయమని అన్నారు. ఐదు రోజులపాటు కొనసాగే సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభ బుధవారం విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో ఉత్తేజభరిత వాతావరణంలో ప్రారంభమైంది.

కార్మిక ఉద్యమ నేతల, ప్రతినిధుల నినాదాల నడుమ ఆ సంఘం అఖిల భారత అధ్యక్షులు డాక్టర్‌ కే.హేమలత మహాసభ ఆరంభ సూచికగా అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభ సభలో పాంబిస్‌ కిరిట్సిస్‌ ప్రసంగిస్తూ… ప్రపంచంలో ప్రస్తుతం సామ్రాజ్యవాద ప్రేరేపిత యుద్ధ ఆర్థిక సిద్ధాంతం అమల్లో ఉందని ఆయన గుర్తు చేశారు. దాని వల్ల ఉత్పత్తిలో నిజంగా భాగస్వాములైన శ్రామికులు బాధితులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ ఆధిపత్య వర్గాలు తమ దోపిడీని తీవ్రతరం చేసేందుకు కార్మికుల హక్కులపై పాశవిక దాడులు జరుపుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రపంచ కార్మికులు తమ ఐక్యతతో శత్రువులను ప్రతిఘటించాలని పిలుపు నిచ్చారు. ప్రపంచ భౌగోళిక ఆర్థిక రాజకీయ ఆధిపత్య పోరు ప్రపంచ శాంతి, భద్రతలకు ప్రత్యక్ష ముప్పుగా పరిణమించిన నేపథ్యంలో, అణు విధ్వంస భయాల సమయంలో సీఐటీయూ మహాసభ జరుగుతోందని కిరిట్సిస్‌ వ్యాఖ్యానించారు.

సామ్రాజ్యవాద యుద్ధాలు, జోక్యాలు, ఆంక్షలు, దిగ్బంధనాలు మరింత తీవ్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారీ సంక్షోభ తీవ్రతను కార్మికులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారి హక్కులపై, వారు పోరాడి సాధించుకున్న విజయాలపై కొత్తగా జరుగుతున్న దాడులు విచ్చలవిడి రూపం దాల్చాయని చెప్పారు. వారిని మరింతగా దోపిడీ చేసేందుకు వీలుగా పెట్టుబడిదారులు విధానాలను రూపొందిస్తున్నారని వివరించారు. ఫలితంగా రాజకీయ, సామాజిక, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం పెరిగిపోతున్నాయని వివరించారు. సహజ వనరుల దోపిడీకి, పర్యావరణ క్షీణతకు ప్రభుత్వాల చర్యలు యదేచ్ఛగా ఊతమిస్తున్నాయని తెలిపారు. కార్మికవర్గంపై ఆధిపత్యవర్గ, మితవాద పాలకుల నియంతృత్వం తీవ్రమైందన్నారు. క్యూబా, వెనిజులా, లాటిన్‌ అమెరికాలో కార్మికుల పోరాటాలను సామ్రాజ్యవాద దేశాలు తమ జోక్యంతో నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నాయని చెప్పారు. ఇదే సమయంలో కార్మికులు చేతులు కట్టుకొని కూర్చోలేదని, పలుదేశాల్లో ప్రతిఘటనోద్యమాలు ఉధృతమయ్యాయని గుర్తు చేశారు.

సీఐటీయూది ఘనమైన చరిత్ర
సీఐటీయూకు భూగోళం పైనున్న 133 దేశాలకు చెందిన 10.5 కోట్ల మంది సభ్యులు కలిగిన కార్మిక సంఘాల తరఫున కిరిట్సిస్‌ సమరశీల శుభాకాంక్షలు తెలిపారు. తమ డబ్ల్యూఎఫ్‌టీయూలో సీఐటీయూ ప్రధాన సభ్యత్వం కలిగి ఉందని చెప్పారు. సామ్రాజ్యవాదానికి, నయా ఉదారవాద, మితవాద రాజకీయాలకు వ్యతిరేకంగా ఆ సంఘం నికరంగా నిలబడి పోరాడుతోందని ప్రశంసించారు. భారతదేశంలో సరళీకరణ విధానాలు, కార్మిక చట్టాల్లో మార్పులు, దూకుడుగా ప్రయివేటీకరణ, కార్మికులు, పెన్షనర్లపై ప్రతికూల ప్రభావం కలిగిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఉద్యోగ భద్రత, ట్రేడ్‌ యూనియన్ల రక్షణ, ప్రజాస్వామ్య హక్కులపై దాడులను తీవ్రంగా పరిగణించిన కార్మిక వర్గం ఐక్య ఉద్యమాలు నిర్వహించటం అభినందనీయమన్నారు.

2025 నవంబర్‌ 26 నాటి దేశవ్యాప్త సమ్మెలో కోట్లాది మంది పాల్గొనటంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇదే విధంగా లేబర్‌ కోడ్‌ల ఉపసంహరణ కోసం ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయపద్రం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మెకు డబ్ల్యూఎఫ్‌టీయూ తరపున ఆయన పూర్తి మద్దతు తెలిపారు. డబ్ల్యూఎఫ్‌టీయూ అంతర్జాతీయ మహాసభ 2027లో శ్రీలంక రాజధాని కొలంబోలో జరగనుందని తెలిపారు. 2000లో ఢిల్లీలో 13వ కాన్ఫరెన్సు తర్వాత మళ్లీ ఇన్నేండ్లకు ఆసియా ఖండంలో తమ సంఘం మహాసభ జరగబోతోందని తెలిపారు. పారిస్‌లో అక్టోబర్‌ 3న సీఐటీయూ సహా వివిధ దేశాల నుంచి 350 మంది ప్రతినిధులు ఒక వేదికపైకి వచ్చి 80 ఏండ్ల ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ గొప్పతనంపై చర్చించారని వివరించారు.

భారతదేశంలో తమ ఫెడరేషన్‌ ఇతర సంఘాలతో కలిసి కార్మిక పోరాటాలను ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని విధాలా అండదండలని స్తుందని కిరిట్సిస్‌ ఈ సందర్భంగా హామీనిచ్చారు. ప్రభుత్వరంగంలోనే విశాఖ ఉక్కును కొనసాగించేలా సమరశీల పోరాటాలు నిర్వహించాలనే రెండు తీర్మానాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రారంభ సభలో పాల్గొన్న ఇతర ట్రేడ్‌ యూనియన్‌ నేతలు సౌహార్ద సందేశాలిచ్చారు. తొలుత మహాసభ ఆహ్వానసంఘం చైర్మెన్‌ సిహెచ్‌ నర్సింగరావు స్వాగతోపన్యాసం చేశారు. ప్రజానాట్యమండలి కళాకారులు విప్లవగీతాలు ఆలపించారు. మహాసభ జరుగుతున్న ఏయూ కన్వెన్షన్‌ హాల్‌కు కామ్రేడ్‌ అనతలవొట్టం ఆనందన్‌ నగర్‌గా, మహాసభ ప్రధాన వేదికకు వాసుదేవ ఆచార్య-ఎంఎం లారెన్స్‌ మంచ్‌గా నామకరణం చేశారు.

శ్రామికవర్గంపై తీవ్ర దాడి : తపన్‌సేన్‌
సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌-మతతత్వ విధానాలను అమలు చేస్తోందన్నారు. కార్మిక వర్గంపై అది ఎడా దాడులు చేస్తోందని చెప్పారు. ఈ క్రమంలో జాతి రక్షణ- ప్రజల రక్షణ నినాదాలతో కార్మికవర్గ నాయకత్వంలో పోరాటాలను ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న నిర్వహించతలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.

పాలస్తీనాకు సంఘీభావం
గాజాపై ఇజ్రాయిల్‌ యుద్ధం పాలస్తీనా జాతిని తుడిచిపెట్టే మహా మారణహోమంగా మారిందని కిరిట్సిస్‌ పేర్కొన్నారు. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, నాటో మిత్ర దేశాల ప్రోద్బలంతోనే గాజాపై ఇజ్రాయిల్‌ ఈ దురాక్రమణపూరిత దాడికి తెగబడుతోందని తెలిపారు. సామ్రాజ్యవాద అమెరికా, ఈయూ నియంత్రణలు, ఆంక్షలు, వాటి పర్యవేక్షణలోని కాల్పుల విరమణ వల్ల శాశ్వత శాంతి స్థాపన జరగబోదని తేల్చి చెప్పారు.. తూర్పు జెరూసలెం రాజధానిగా 1967కి ముందున్న సరిహద్దులతో పాలస్తీనా దేశం ఏర్పాటే సమస్యకు పరిష్కారమని స్పష్టం చేశారు. అది సాకారమయ్యే వరకు పాలస్తీనీయులకు డబ్ల్యూ ఎఫ్‌టీయూ అండగా ఉంటుందని హామీనిచ్చారు. పాలస్తీనీయుల న్యాయసమ్మతమైన పోరాటానికి ప్రపంచ కార్మిక వర్గం మద్దతు నివ్వాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -