Sunday, March 8, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమోడీ పాలనలో హక్కుల హననం

మోడీ పాలనలో హక్కుల హననం

- Advertisement -

మార్చి’8′ వేడుక కాదు.. పోరాట స్ఫూర్తి
మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో వక్తలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘మోడీ పాలనలో పోరాడి సాధించుకున్న హక్కుల హననం జరుగుతున్నది. శ్రామిక మహిళలకు పనిభద్రత, వేతనాల పెంపు, వేధింపుల మొర ఆలకించేవారు లేరు. మహిళలు వంటింటికే పరిమితమవ్వాలనీ, రెండో తరగతి పౌరురాలుగా మాత్రమే ఉండాలనీ, భర్తకు సేవలు చేసే పని మనిషిగా, విలాస వస్తువుగా ఉండాలనే మనుధర్మ నీతిని, దాని భావాజాలాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విస్తృత పరుస్తున్నది. ఈ కోవలోనే మహిళలపై లైంగిక దాడులు, దౌర్జన్యాలు పెరిగాయి. దాడులకు పాల్పడిన ముద్దాయిల పట్ల ప్రభుత్వం, చట్టం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. మరీ ముఖ్యంగా బాధ్యత కలిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం మహిళల పట్ల చులకన భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయినా ఆయా ప్రభుత్వాలు వారిపై చర్యలు తీసుకోవటం లేదు. మరో పక్క వ్యవసాయ కూలీల ఉపాధిని దెబ్బతీసి పేదల నోట్లో మట్టికొట్టే చర్యలకు పాల్పడుతున్నది. ఇది క్షంతవ్యం కాదు. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా సుశీలా గోపాలన్‌, విమలా రణదివేతో పాటు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో జాగీర్దార్‌, జమిందారీ విధానానికి మట్టి, ఎట్టి మనుషులే తిరుగుబాటు బావుటాను ఎగురవేశారు. వారి పోరాట స్ఫూర్తితో ఐక్య పోరాటాలకు శ్రీకారం చుడదాం. మార్చి 8ని వేడుకలాగాకుండా పోరాట స్ఫూర్తి దినంగా నిర్వహిద్దాం’ అంటూ వక్తలు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లో ఐద్వా, సీఐటీయూ, ఏఐకేఎస్‌, ఏఐఏడబ్ల్యూయూ, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో హైదరాబా ద్‌లోని ఆర్టీసీ కళామండపం నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ అరుణజ్యోతి, సీఐటీయూ హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా అధ్యక్షులు ఎం మీనా అధ్యక్షతన జరిగిన సభలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్‌ ఎస్వీ రమ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్‌ బి పద్మ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ గల్స్‌ కన్వీనర్‌ మమత, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్‌, సీఐటీయూ నగర కార్యదర్శి జె కుమారస్వామి మాట్లాడారు.
19వ శతాబ్దం చివరిలో 20వ శతాబ్దం మొదట్లో మహిళలు ఎక్కువ గంటలు పనిచేయాల్సి వచ్చేదని చెప్పారు. ఫ్యాక్టరీల్లో పని పరిస్థితులు దారుణంగా ఉండేవని వివరించారు. 1908లో సరైన సౌకర్యాలు లేక గాలి, వెలుతురు లేని ఫ్యాక్టరీల్లో పని చేస్తున్న 146 మంది మహిళలు మృతి చెందారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆకలితో చచ్చేకంటే పోరాడి చావడం మేలని మహిళలు వీధుల్లోకి వచ్చారని వివరించారు. సోషలిస్టు నాయకురాలు క్లారాజట్కిన్‌ ఆధ్వర్యంలో మార్చి ఎనిమిదో తేదీని మహిళా హక్కుల పోరాట దినంగా నిర్ణయించారని తెలిపారు. ఓటు హక్కు, జీవించే హక్కు, పని గంటల తగ్గింపు డిమాండ్లతో అన్ని దేశాల్లో ఈ కార్యక్రమాన్ని పోరాట స్ఫూర్తి దినంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మహిళల స్వేచ్ఛ, సమానత్వం, పోరాటాలను గుర్తు చేసుకునే రోజు మహిళా దినోత్సవమని తెలిపారు. స్వీట్లు, బహుమతులు తీసుకుని ఆనందపడి అంతటితో మరిచిపోయే వేడుక కాదని చెప్పారు. సాధించుకున్న హక్కులు, చట్టాలు మామూలుగా రాలేదన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్‌లు తెచ్చి ఉన్న కొద్దిపాటి అనుకూల చట్టాలను హననం చేసిందని విమర్శించారు.

పని గంటల నియంత్రణ, కనీస వేతనంతో పాటు, సమ్మె చేసే హక్కు, యూనియన్‌ పెట్టుకునే హక్కు, పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ, సౌకర్యాలు అన్ని మన పోరాట ఫలితమేనని చెప్పారు. ఏ ఉద్యమాలైనా సమిష్టి పోరాటాల వల్లనే విజయం సాధించాయని గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80ఏండ్లు కావస్తున్నా స్త్రీల అక్షరాస్యత చాలా తక్కువగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మన కంటే వెనుక స్వాతంత్య్రం వచ్చిన చైనా పదేండ్లకే సంపూర్ణ అక్షరాస్యత సాధించిందని గుర్తు చేశారు. పీరియడ్స్‌ టైంలో 3 రోజులు స్కూళ్లు, కాలేజీలు, పరిశ్రమల్లో స్త్రీలకు సెలవు ప్రకటించిన ఏకైక రాష్ట్రం కేరళ అని చెప్పారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించి దేశానికి దిక్సూచిగా నిలబడిందని గుర్తు చేశారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలుకు 30 ఏండ్లుగా పోరాడుతున్నా..అమలు నోచుకోవటం లేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని మార్చి వీబీజీ ఆర్‌ఏఎంజీ చట్టాన్ని తెచ్చిందనీ, ఇది గ్రామీణ మహిళలకు తీవ్ర నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. నేటికీ మన కుటుంబాల్లో చాలా మంది ఆడ, మగ పిల్లలను సమానంగా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం అని గాంధీ చెప్పిన రోజులు రావాలంటే మనువాద ఆలోచనలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐద్వా హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎమ్‌. లక్ష్మమ్మ, పి. శశికళ, సెంట్రల్‌ సిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.పద్మ, వై. వరలక్ష్మి, మేడ్చల్‌ జిల్లా కార్యదర్శి ఎమ్‌. వినోధ, రాష్ట్ర నాయకులు ఎన్‌. స్వరూప, షబానా బేగం, పి. మంగ, ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ నాయకుడు అతీక్‌ అహ్మద్‌, రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్‌, నాయకులు కిరణ్‌, సీఐటీయూ నాయకురాలు సునిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -