అసమానతలను పెంచే కేంద్ర బడ్జెట్
0.0286 శాతం నిధులతో వికలాంగుల అభివృద్ధి ఎలా సాధ్యం?
నేడు జిల్లా కేంద్రాల్లో బడ్జెట్ పత్రాల దగ్ధం: ఎన్పీఆర్డీ రాష్ట్ర కమిటీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర బడ్జెట్ వికలాంగుల హక్కులను ఉల్లంఘిస్తుందనీ, అసమానతను పెంపొందిస్తుందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు ఆదివారం ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. మోడీ సర్కార్ 2026-27 ఏడాదికి ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్, ధనవంతులకు అనుకూలంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగుల హక్కుల చట్టం, 2016 ప్రకారం చట్టబద్ధంగా సమానత్వం, వివక్షత లేని, వికలాంగులకు పూర్తి భాగస్వామ్యం, సమ్మిళిత విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి, సామాజిక భద్రత, అందుబాటులో హౌజింగ్, రవాణా, ప్రజాసేవల హక్కులను కాపాడే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వికలాంగుల సాధికారత శాఖకు మొత్తం కేటాయింపుల్లో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ, ఈ పెరుగుదల ప్రధానంగా ప్రకటించిన రెండు కొత్త పథకాలకు వెళుతుందని తెలిపారు.
మొత్తం బడ్జెట్ కేటాయింపులలో వికలాంగులకు 0.0286 శాతం మాత్రమేననీ, జీడీపీలో దాదాపు 0.008 శాతమేనని అసంతృప్తి వ్యక్తం చేశారు. అసమర్థ నైపుణ్య శిక్షణ పథకాలకే నిధులు ఎక్కువగా వెళతాయని తెలిపారు. 2012 నుంచి రూ.300గా ఉన్న ఇందిరాగాంధీ వికలాంగుల పెన్షన్ పథకంలో పెరుగుదల లేదని చెప్పారు. మూలధన వ్యయ కోతలతో ఉన్న మౌలిక సదుపాయాలు, రవాణా, సహాయక సాంకేతిక పరిజ్ఞానాల్లో పెట్టుబడులు నిలిపేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన ఆర్థిక క్రమశిక్షణ అంటే వికలాంగులకు సామాజిక భద్రతా చర్యలు లేకుండా చేయడమేనని ఆయన ఎద్దేవా చేశారు. వైకల్య హక్కులను ఉల్లంఘించి, అసమానతలను పెంచే బడ్జెట్ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఖర్చు కోతలను రద్దు చేయాలనీ, ఆర్పీడబ్ల్యూడీ చట్టం అమలుకు కేటాయింపులను పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 2న జిల్లా కేంద్రాల్లో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వారు హెచ్చరించారు.
వికలాంగుల హక్కుల ఉల్లంఘన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



