పోలింగ్ ముందురోజే పల్లెల్లో భారీ ఫ్లెక్సీలు – అధికారుల నిర్లక్ష్యం బట్టబయలు
నవతెలంగాణ – ఉప్పునుంతల
తెలంగాణ గ్రామపంచాయతీ స్థానిక ఎన్నికల మూడవ విడత పోలింగ్ రేపు (17వ తేదీ) జరగనున్న నేపథ్యంలో, జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు ప్రచారం ముగిసినప్పటికీ పల్లెల్లో భారీ పోస్టర్లు, ఫ్లెక్సీలు, అభ్యర్థుల గుర్తులు ఇంకా బహిరంగంగానే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలకు అతి సమీపంలోనూ ప్రచార సామగ్రి ఉండటంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పోలింగ్‌కు 48 గంటల ముందే అన్ని రకాల ప్రచారాలను పూర్తిగా నిలిపివేయాలన్న ఎన్నికల కోడ్‌ను అభ్యర్థులు బహిరంగంగా ఉల్లంఘిస్తున్నా, సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాన్ని మండల స్థాయి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఎంపీడీవో స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఎన్నికల సిబ్బంది పర్యవేక్షణలో ఉండాల్సిన పోలింగ్ కేంద్రాల పరిసరాల్లోనూ ఫ్లెక్సీలు అలాగే ఉండటం విధి నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు పేర్కొంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులో అధికారులు ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే, స్వేచ్ఛాయుతమైన ఎన్నికల నిర్వహణపై అనుమానాలు తలెత్తుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాల భవనాలపై అభ్యర్థుల స్టిక్కర్లు అంటించి ఉండటం, పోలింగ్ సెంటర్ల ముందే వరుస సంఖ్యలో భారీ ఫ్లెక్సీలు దర్శనమించడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. మండలంలోని పలు గ్రామాలలో, ముఖ్యంగా అయ్యవారిపల్లి, పిరట్వానిపల్లి, గ్రామాలలో అనేక పోలింగ్ కేంద్రాల ముందు ప్రచార సామగ్రి బహిరంగంగా దర్శనమిస్తున్నట్లు ప్రజలు తెలిపారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రచార సామగ్రిని వెంటనే తొలగించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎన్నికల పటిష్ట అమలుపై సందేహాలు నెలకొంటున్నాయని, ప్రజాస్వామ్య ప్రక్రియకు ఇది ప్రమాదకర సంకేతమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



