పత్రికా కార్యాలయాలకు నిప్పు ఆస్తులు ధ్వంసం
జన్‌జెడ్ నేత ఉస్మాన్ హాదీ మృతితో వెల్లువెత్తిన ప్రజాగ్రహం
ఢాకా : బంగ్లాదేశ్‌లో గురువారం రాత్రి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. గత సంవత్సరం మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతికి దారితీసిన ఆందోళనలో కీలకంగా వ్యవహరించిన యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణించిన కొద్ది గంటలకే దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ముసుగు ధరించి మోటారు సైకిలుపై వెనుక కూర్చున్న ఓ వ్యక్తి జరిపిన కాల్పులలో ఈ నెల 12న హాదీ తలకు గాయమైంది. అప్పటి నుంచి ఆయన సింగపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హదీ ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఆయన మరణించారని సింగపూర్ విదేశాంగ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. ఇంక్విలాబ్ మంచో సంస్థకు హాదీ కన్వీనర్‌గా వ్యవహరించారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరగబోయే బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయాలని ఆయన భావించారు.
హాదీ మృతి వార్త తెలిసిన వెంటనే కొందరు నిరసనకారులు ఆగ్రహంతో బంగ్లాదేశ్‌లోని రెండు ప్రముఖ పత్రికా కార్యాలయాలు… బెంగాలీ పత్రిక ప్రోథమ్ అలో, ఆంగ్ల పత్రిక డెయిలీ స్టార్‌పై దాడి చేసి వాటికి నిప్పు పెట్టారు. కొందరు ఆందోళనకారులు డెయిలీ స్టార్ కార్యాలయంలోని సీపీయూలు, మానిటర్లు, కుర్చీలను ఎత్తికెళ్లారు. హింస చెలరేగడంతో పత్రికా సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. నిరసనకారులు డెయిలీ స్టార్ పత్రిక కార్యాలయం వెలుపల న్యూ ఏజ్ సంపాదకుడు నూరుల్ కబీర్‌పై దాడికి పాల్పడ్డారు. ఆందోళనకారులతో మాట్లాడేందుకు ఆయన అక్కడికి వెళ్లగా ఈ ఘటన జరిగింది. వారు ఆయనను అవామీలీగ్ ఏజెంట్ అంటూ నిందించారు. కాగా అల్లరి మూకలు రాజ్‌షాహీలోని అవామీలీగ్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేసినట్లు తెలిసింది.
ఇదిలావుండగా ఛట్‌గ్రామ్‌లోని భారత సహాయ రాయబార కార్యాలయం వెలుపల నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారని, ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా నలుగురు గాయపడ్డారని యునైటెడ్ న్యూస్ ఆఫ్ బంగ్లాదేశ్ వార్తా సంస్థ తెలిపింది. ఢాకాలోని ధన్‌మోండీ ప్రాంతంలో ఉన్న ఛాయానాట్ అనే సాంస్కృతిక సంస్థ భవనానికి శుక్రవారం ఉదయం నిరసనకారులు నిప్పు పెట్టారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కొందరు వ్యక్తులు హెల్మెట్లు, ముసుగులు ధరించి భవనంలోకి ప్రవేశించారు. అక్కడ విలువైన వస్తువులను ధ్వంసం చేశారు. ప్రాంగణం లోపల, వెలుపల నిప్పు పెట్టారు. హాదీ మరణంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ విచారం వ్యక్తం చేశారు. హాదీ మరణంతో ఏర్పడిన రాజకీయ లోటు పూడ్చలేనిదని అన్నారు. హత్యకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతామని, కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



