Thursday, January 22, 2026
E-PAPER
Homeజాతీయంఅసోంలో హింసాకాండ

అసోంలో హింసాకాండ

- Advertisement -

ఆవుల దొంగతనం ఆరోపణలతో మూక దాడి
వాహనానికి నిప్పు, ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
ప్రతిగా ఆందోళనలు, హైవే దిగ్భంధం

గౌహతి : అస్సాంలోని కోక్రాఝర్‌ జిల్లాలో హింసాకాండ చెలరేగింది. ఆవులను దొంగతనం చేస్తున్నారనే ఆరోపణలతో మూక దాడి చేసి వాహనానికి నిప్పు పెట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మూకదాడికి వ్యతిరేకంగా ఆందోళనలు వెళ్లువెత్తాయి. ఆందోళనకారులు హైవేను దిగ్భంధించారు. కొన్ని ఇళ్లు, దుకాణాలను దగ్ధం చేశారు. ఈ సంఘటన ప్రకారం సోమవారం రాత్రి కరిగావ్‌లో మాన్సింగ్‌ రోడ్డు వద్ద ఆవుల దొంగతనం చేస్తున్నారనే అనుమానంతో ఒక ఎస్‌యూవీని ఆపడానికి స్థానికులు ప్రయత్నించారు. అయితే ఆ వాహనం ఆగకుండా వెళ్లపోయింది. దీంతో స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు.

మరోవైపు ఈ వాహనం కొంతదూరం వెళ్లి, ప్రమాదానికి గురై ఆగిపోయింది. దీన్ని చూసి స్థానికులు గుంపు అక్కడకు వెళ్లి వాహనంలో ఉన్న వారిపై దాడికి దిగారు. అంతటితో ఆగకుండా ఎస్‌యూవీకి నిప్పుటించారు. ఈ విషయం తెలిసిన పోలీసులు, అగ్నిమాపక, అత్యవసర సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని బాధితుల్ని రక్షించడానికి ప్రయత్నించారు. వారిని కోక్రాఝర్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సిఖ్నా జ్వాలావ్‌ బిస్మత్‌ అనే వ్యక్తి మరణించాడు. మంగళవారం ఉదయం చికిత్స పొందుతూ సునీల్‌ ముర్ము మృతి చెందాడు. మరో ముగ్గురు వ్యక్తులు ప్రభాత్‌ బ్రహ్మ, జుబిరాజ్‌ బ్రహ్మ, మహేష్‌ ముర్ము తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. వాస్తవంగా వీరంతా స్థానికంగా జరుగుతున్న ఒక రోడ్డు నిర్మాణ ప్రాజెక్టుతో సంబంధం ఉన్నారు. నిర్మాణ పనులను తనిఖీ చేసి తిరిగి వెళుతుండగా ఈ మూకదాడికి గురయ్యారు.

మరోవైపు ఈ మూక దాడి జిల్లాలో ఆదివాసీలు-బోడోల మధ్య ఘర్షణలకు దారి తీసింది. మంగళవారం ఉదయం నుంచి ఈ రెండు గ్రూపులకు చెందిన వ్యక్తులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిని దిగ్భంధించారు. రోడ్లపై టైర్లను దగ్భం చేశారు. ఇండ్లను, దుకాణాలను తగులబెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా నిప్పు అంటించారు. అలాగే, కరిగావ్‌ పోలీసు అవుట్‌పోస్టుపై కూడా దాడి చేశారు. ఈ దాడుల్లో అధికారులు, పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దీంతో పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు లాఠీచార్జి, టియర్‌ గ్యాస్‌లను ప్రయోగించారు. అలాగే, రాష్ట్ర పోలీసులకు సహాయంగా భారత సైన్యాని కూడా మోహరించారు. నాలుగు ఆర్మీ దళాలు, స్థానిక భద్రతా సిబ్బందితో కలిసి గస్తీ నిర్వహించింది. ఫ్లాగ్‌ మార్చ్‌ను కూడా నిర్వహించింది. జిల్లా అంతటా నిషేధాజ్ఞలు విధించారు. కోక్రాఝర్‌ జిల్లాతోపాటు సమీప జిల్లా చిరాంగ్‌లో కూడా మొబైల్‌ ఇంటర్నెట్‌, డేటా సేవలను నిలిపివేశారు. బుధవారం కొత్తగా ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగలేదని, అయితే పరిస్థితి ఉద్రిక్తతంగానే ఉందని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -