Tuesday, May 13, 2025
Homeఆటలువిరాట్‌ వీడ్కోలు

విరాట్‌ వీడ్కోలు

- Advertisement -


– టెస్టు క్రికెట్‌కు కింగ్‌ కోహ్లి గుడ్‌బై
– ఇక ఆడేది వన్డేలు మాత్రమే
– టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన నాల్గో బ్యాటర్‌.
– అత్యధిక సెంచరీలు సాధించిన నాల్గో క్రికెటర్‌.
– భారత్‌కు అత్యధిక టెస్టుల్లో నాయకత్వం వహించిన కెప్టెన్‌.
– సారథిగా భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన నాయకుడు.
– ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్‌ను అత్యధిక కాలం వరల్డ్‌ నం.1గా నిలిపిన సేనాని.
– ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు సిరీస్‌ విజయాన్ని సాకారం చేసిన యోధుడు.

14 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌లో టెస్టు క్రికెట్‌ను అభిమానులను మరింత చేరువ చేసిన బ్రాండ్‌ అంబాసిడర్‌… అనూహ్యంగా ఐదు రోజుల ఆటకు వీడ్కోలు పలికాడు.
టెస్టు క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నానని విరాట్‌ కోహ్లి సోమవారం అధికారికంగా ప్రకటించాడు.

నవతెలంగాణ-న్యూఢిల్లీ

ఊహాగానాలు నిజమయ్యాయి. అంచనాలు వాస్తవ రూపం దాల్చాయి. ప్రపంచ క్రికెట్‌ రారాజు అసలు సిసలు ఫార్మాట్‌ టెస్టుల నుంచి వైదొలిగాడు. టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు భారత క్రికెట్‌ సూపర్‌స్టార్‌ విరాట్‌ కోహ్లి సోమవారం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. 14 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌కు అర్థాంతరంగా తెరదించిన విరాట్‌ కోహ్లి.. 123 టెస్టుల్లో 46.85 సగటుతో 9230 పరుగులు సాధించాడు. 68 టెస్టుల్లో భారత జట్టుకు నాయకత్వం వహించిన విరాట్‌ కోహ్లి 40 విజయాలతో అత్యంత సక్సెస్‌ఫుల్‌ సారధిగా నిలిచాడు. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకటం అంత సులువు కాదు, కానీ ఇదే సరైన నిర్ణయంగా భావిస్తున్నట్టు విరాట్‌ కోహ్లి రిటైర్మెంట్‌ ప్రకటనలో పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలుకు పలికిన విరాట్‌ కోహ్లికి మాజీ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, గౌతం గంభీర్‌, రవి శాస్త్రి, అనిల్‌ కుంబ్లే, సంజరు మంజ్రేకర్‌, యువరాజ్‌ సింగ్‌, ఏబీ డివిలియర్స్‌, కెవిన్‌ పీటర్సన్‌, గ్రెగ్‌ చాపెల్‌, అంజుమ్‌ చోప్రా, హర్బజన్‌ సింగ్‌, యూసుఫ్‌ పఠాన్‌, ఆకాశ్‌ చోప్రా, ముష్ఫీకర్‌ రహీమ్‌, మనోజ్‌ తివారీ, నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు, ఆర్పీ సింగ్‌ సహా సహచర క్రికెటర్లు శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌, రోహిత్‌ శర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, చతేశ్వర్‌ పుజారాలు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
కింగ్‌స్టన్‌లో మొదలై.. సిడ్నీలో ముగిసె
విరాట్‌ కోహ్లి టెస్టు క్రికెట్‌ ప్రయాణం 2011లో మొదలైంది. విదేశీ గడ్డపై అరంగ్రేటం చేసిన విరాట్‌.. విదేశీ గడ్డపై ఆఖరు మ్యాచ్‌ ఆడేశాడు. కింగ్‌స్టన్‌ టెస్టులో తొలిసారి బరిలోకి దిగిన విరాట్‌ కోహ్లి.. 4, 15 పరుగుల ఇన్నింగ్స్‌లతో నిరాశపరిచాడు. విండీస్‌ పర్యటనలో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 76 పరుగులే చేశాడు. వెస్టిండీస్‌పైనే వాంఖడె టెస్టులో 52, 63 పరుగులతో కోహ్లి మాయకు చిన్న టీజర్‌ చూపించాడు. ఆరంభంలో టెస్టుల్లో తడబాటుకు గురైన విరాట్‌ కోహ్లి.. నెమ్మదిగా పుంజుకున్నాడు. 2014 ఇంగ్లాండ్‌ పర్యటనలోనూ కోహ్లి తేలిపోయినా.. సవాల్‌ను స్వీకరించి ఇంగ్లీశ్‌ బౌలర్లకు 2018లో చుక్కలు చూపించాడు. కెరీర్‌ తొలి, ఆఖరు సెంచరీలను సైతం కోహ్లి విదేశీ గడ్డపైనే సాధించాడు. ఆడిలైడ్‌ టెస్టులో కెరీర్‌ తొలి వంద సాధించిన కోహ్లికి ఇటీవల పెర్త్‌ టెస్టులో బాదిన 30వ శతకం ఆఖరు వంద ఇన్నింగ్స్‌. విరాట్‌ కోహ్లి మ్యాజిక్‌ ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా పర్యటనల్లో ప్రపంచానికి తెలిసింది. 2018 ఇంగ్లాండ్‌ టూర్‌లో రెండు సెంచరీలు సహా 59.30 సగటుతో 583 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాలో 2014-15 పర్యటనలో రెండు సెంచరీలు బాదిన కోహ్లి.. 86.50 సగటుతో 692 పరుగులు చేశాడు.
ఎదురులేని సారథి
విరాట్‌ కోహ్లి టెస్టు క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. బ్యాటర్‌గా కెరీర్‌ భీకర ఫామ్‌లో ఉన్న సమయంలో నాయకత్వం వహించిన విరాట్‌ కోహ్లి.. భారత క్రికెట్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన నాయకుడిగా నిలిచాడు. 68 టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి.. 40 మ్యాచుల్లో విజయాలు సాధించాడు. 17 మ్యాచుల్లో ఓటమి ఎదురవగా.. 11 టెస్టులు డ్రాగా ముగిశాయి. విదేశీ గడ్డపై 16 టెస్టులు గెలుపొందిన కోహ్లి.. స్వదేశంలో 24 టెస్టు విజయాలు సాధించాడు. విరాట్‌ కోహ్లి సారథ్యంలో టీమ్‌ ఇండియా సొంతగడ్డపై ఒక్క టెస్టు సిరీస్‌ను సైతం కోల్పోలేదు. భారత క్రికెట్‌ కెప్టెన్సీ దిగ్గజాలు ఎం.ఎస్‌ ధోని, సౌరవ్‌ గంగూలీ సైతం రెడ్‌బాల్‌ ఫార్మాట్‌లో కోహ్లి తర్వాతి స్థానంలో ఉన్నారు. కెప్టెన్‌గా ధోని 60 టెస్టుల్లో 27 విజయాలు సాధించగా, గంగూలీ 49 టెస్టుల్లో 21 విజయాలు సాధించాడు. ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్‌లో కోహ్లి నాల్గో స్థానంలో ఉన్నాడు. గ్రేమ్‌ స్మిత్‌ (109 టెస్టుల్లో 53 విజయాలు), రికీ పాంటింగ్‌ (77 టెస్టుల్లో 48 విజయాలు), స్టీవ్‌ వా (57 టెస్టుల్లో 41 విజయాలు) కోహ్లి కంటే ముందంజలో ఉన్నారు. దక్షిణాఫ్రికాపై సాధించిన 254 నాటౌట్‌ ద్విశతక ఇన్నింగ్స్‌ కోహ్లికి వ్యక్తిగత అత్యధిక స్కోరు.
ద్వి శతక సిక్సర్‌
కెరీర్‌ను మొదలెట్టిన కరీబియన్‌ దీవుల్లోనే కోహ్లి తొలి డబుల్‌ సెంచరీ సాధించాడు. జులై 2016 ఆంటిగ్వా టెస్టులో తొలి ద్వి శతకం సాధించిన విరాట్‌ కోహ్లి.. 2017 ఏడాది ఆఖరు నాటికి మరో ఐదు డబుల్‌ సెంచరీలు బాదాడు. కేవలం 34 ఇన్నింగ్స్‌ల వ్యవధిలోనే ఆరు ద్వి శతకాలు సాధించాడు. ప్రపంచ క్రికెట్‌లో డాన్‌ బ్రాడ్‌మన్‌ (8) ఒక్కడే కోహ్లి కంటే ముందున్నాడు.
14 ఏండ్లలో మూడంచెలు!
విరాట్‌ కోహ్లి టెస్టు కెరీర్‌ గొప్పగా సాగినా.. కింగ్‌ కోహ్లి సైతం ఎత్తు పల్లాలకు అతీతుడు కాదు. కోహ్లి కెరీర్‌ గణాంకాలను మూడు దశల వారీగా పరిశీలిస్తే.. ఇటీవల కాలంలో ఐదు రోజుల ఆటలో అంచనాలను ఏమాత్రం అందుకోలేదు. 2011-2015 వరకు 41 టెస్టుల్లో 2994 పరుగులు చేశాడు. సగటు 44.02 కాగా, 11 సెంచరీలు బాదాడు. 2016-2019లో 43 టెస్టుల్లో 4208 పరుగులు చేశాడు. సగటు 66.79 కాగా.. 16 సెంచరీలు సాధించాడు. 2020-2025లో 39 టెస్టుల్లో 2028 పరుగులే చేశాడు. సగటు 30.22 కాగా, ఒక్క సెంచరీ మాత్రమే చేయగలిగాడు. కోవిడ్‌ మహమ్మారి విరామం అనంతరం కోహ్లి మ్యాజిక్‌ మసకబారింది!. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయటంలో నిలకడగా విఫలమయ్యాడు. కోహ్లి స్వర్ణయుగం 2016-2019లో కనిపించింది. 2016లో 75.93 సగుటు, 2017లో 75.64 సగటు, 2018లో 55.08 సగటు, 2019లో 68.00 సగటుతో ప్రపంచ క్రికెట్‌ను శాసించాడు.
నెల రోజులుగా ఆలోచన
టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని విరాట్‌ కోహ్లి సుమారు నెల రోజులుగా ఆలోచన చేసినట్టు చెబుతున్నారు. ఐదు రోజుల ఆట నుంచి తప్పుకునే ఆలోచనను విరాట్‌ కోహ్లి శుక్రవారం భారత క్రికెట్‌ బోర్డుతో ఈమెయిల్‌ ద్వారా పంచుకున్న సంగతి తెలిసిందే. వీడ్కోలు నిర్ణయంపై పునరాలోచన చేయాలని బీసీసీఐ సూచించినా, భారత క్రికెట్‌ పెద్దలు సంప్రదింపులు జరిపినా విరాట్‌ కోహ్లి వీడ్కోలు నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు తెలిసింది. రెడ్‌బాల్‌ ఫార్మాట్‌ నుంచి తప్పుకునే యోచన ఉన్నట్టు తనతో సంభాషణల సందర్భంగా విరాట్‌ సంకేతం ఇచ్చినట్టు ఏబీ డివిలియర్స్‌ వెల్లడించాడు. జూన్‌లో భారత జట్టు ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఐదు టెస్టుల సిరీస్‌ జూన్‌ 20 నుంచి ఆరంభం కానుంది. కోహ్లి వీడ్కోలుతో..ఇంగ్లాండ్‌లో టీమ్‌ ఇండియా కొత్త కెప్టెన్‌ సారథ్యంలో, యువ జట్టుతో బరిలోకి దిగనుంది. ఆస్ట్రేలియాలో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ అనంతరం రవిచంద్రన్‌ అశ్విన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి టెస్టు క్రికెట్‌కు దూరం కావటం గమనార్హం. భారత జట్టులో జశ్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజాలు మాత్రమే సీనియర్లు. టెస్టుల్లో కెప్టెన్సీ పగ్గాలు సైతం కుర్రాడికే దక్కనున్నట్టు సమాచారం.
విరాట్‌ కోహ్లి 2014 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ విజయానంతరం టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా టెస్టులకు దూరమవగా ఇక నుంచి వన్డేల్లో మాత్రమే జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు.
టెస్టు క్రికెట్‌లో బ్యాగీ బ్లూ తొలిసారి ధరించి ఇప్పటికి 14 ఏండ్లు. నిజాయితీగా చెప్పాలంటే, ఈ ఫార్మాట్‌లో నా ప్రయాణం ఇలా సాగుతుందని ఊహించలేదు. టెస్టు క్రికెట్‌ నన్ను పరీక్షించింది, తీర్చిదిద్దింది, జీవిత కాలం గుర్తుండే పాఠాలు నేర్పించింది. ఈ ఫార్మాట్‌లో ఆడటం వ్యక్తిగతంగా ఏదో తెలియని అనుభూతి. రోజంతా సాగే మ్యాచ్‌లో ఎవరూ చూడని చిన్న చిన్న సందర్భాలు ఎప్పటికీ మనతోనే ఉండిపోతాయి. టెస్టు క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకోవటం అంత సులువు కాదు, కానీ ఇదే సరైనది అని భావిస్తున్నాను. టెస్టు క్రికెట్‌కు నా సర్వం ఇచ్చాను, ఈ ఫార్మాట్‌ తిరిగి నాకు ఆశించిన దానికంటే ఎక్కువే ఇచ్చింది. టెస్టు క్రికెట్‌, సహచర క్రికెటర్లు, ఈ ప్రయాణంలో తోడ్పాటుగా నిలిచిన అందరి పట్ల కృతజ్ఞతా భావంతోనే వీడుతున్నాను. నా టెస్టు క్రికెట్‌ కెరీర్‌ను ఎల్లప్పుడూ చిరునవ్వుతో చూస్తాను’

  • విరాట్‌ కోహ్లి

    కోహ్లి టెస్టు కెరీర్‌
  • మ్యాచులు : 123
  • ఇన్నింగ్స్‌లు : 210
  • పరుగులు : 9230
  • సగటు : 46.85
  • సెంచరీలు : 30
  • ద్వి శతకాలు : 06
  • అర్థ సెంచరీలు : 31
  • స్ట్రయిక్‌రేట్‌ : 55.57
  • అత్యధిక స్కోరు : 254

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -