నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటించారు. ఆ రాష్ట్రానికి ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత వీరభద్ర సింగ్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. కుమార్తె ప్రియాంక గాంధీ కూడా సోనియా వెంట ఉన్నారు. ఆదివారం సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్‌లో వీరభద్ర సింగ్ విగ్రహాన్ని సోనియా గాంధీ ఆవిష్కరించారు. ప్రియాంక గాంధీ, వీరభద్ర సింగ్ భార్య, కుమారుడు, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఇతర కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రియాంక గాంధీ ప్రసంగించారు. వీరభద్ర సింగ్‌ను ‘హిమాచల్ ఆత్మ’గా అభివర్ణించారు. ‘నేడు దేశంలో వీరభద్ర సింగ్ లాంటి నిజమైన నాయకుల కొరత ఉన్నది. ఆయన తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలు ఒక మాధ్యమం. అధికారం అంటే బాధ్యత అని భావించే మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల సంప్రదాయాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లారు’ అని అన్నారు.