Wednesday, March 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపౌల్ట్రీ పరిశ్రమను వణికిస్తున్న 'వైరస్‌'!

పౌల్ట్రీ పరిశ్రమను వణికిస్తున్న ‘వైరస్‌’!

- Advertisement -

ఒకే రోజు 10వేల కోళ్లు మృత్యువాత
పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లిలో 5వేల కోళ్లు మృతి
వేసవి ప్రారంభంలోనే వరుస ఘటనలతో పౌల్ట్రీ రైతుల ఆందోళన


నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమను అంతు చిక్కని వైరస్‌ వణికిస్తోంది. ఒకే రోజు 10 వేల కోళ్లు చనిపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. బర్డ్‌ప్లూ సోకిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కంపెనీ వారు ఆ కోళ్లను ఆనవాళ్లు లేకుండా పూడ్చేశారు. వేసవి ప్రారంభంలోనే కోళ్లు మృత్యువాతపడటంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు.
కొల్లాపూర్‌ నియోజక వర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం చెన్పపురావుపల్లిలో రైతు బాలయ్యకు చెందిన పౌల్ట్రీలో 4 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. కోడేరు మండలం దేవుని తిర్మలాపూర్‌కు చెందిన మర్రికంటి లింగస్వామికి చెందిన ఫారంలో 2500 వేల కోళ్లు చనిపోయాయి. మరికొన్ని గ్రామాల్లో 3500వేల కోళ్లు మృత్యువాతపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలతో చిన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. వైరస్‌ ప్రభావమా.. లేక ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల కోళ్లు చనిపోతున్నాయా? అనేది పరిశీలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 20వేల కోళ్ల ఫారాలు ఉన్నాయి. ఇందులో 1.50 లక్షల కోళ్లను పెంచే సామర్థ్యం ఉంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే 5వేల లేయర్‌, 300 బాయిల్‌ కోళ్ల ఫారాలున్నాయి. గతేడాది వనపర్తి జిల్లా మరికల్‌లో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. వాటి షాంపిల్స్‌ తీసి వైరస్‌ నిర్ధారణ కోసం బోపాల్‌కు పంపారు. వైరస్‌ పాజిటీవ్‌ అని తేలితే ఆ షెడ్ల నుంచి కోళ్లను తొలగించారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా చేశారు. సోమవారం చనిపోయిన కోళ్ల విషయంలో షాంపిల్స్‌ తీసి ల్యాబ్‌కు పంపాలన్నా.. వాటి ఆనవాళ్లు లభ్యం కావడం లేదు. వైరస్‌ అని తేలితే కోళ్ల వ్యాపారం దెబ్బతింటుందని ఎవరికీ తెలియ కుండా యజమానులు పెద్ద గుంత తీసి పూడ్చిపెట్టారు. పశువైద్య నిపుణులు పోయినా ఆనవాళ్లు చూపలేదని తెలిసింది. బర్డ్‌ప్లూ అయ్యి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

బయోసెక్యూరిటీ అవసరం
కోళ్ల ఫారాలు నిర్వహించేవారు.. వాటి రక్షణ కోసం కొన్ని జాగ్రతలు తీసుకోవాలి. చనిపోయిన కోళ్లను లోతైన గుంతలో పూడ్చాలి. పైన సున్నం చల్లాలి. దాణ సంచులను కాల్చివేయాలి. నీటి తొట్టెలను, దాణ తొట్టెలను సోడియం హైపోక్లోరెట్‌ ద్రావణంతో కడగాలి. కోళ్ల షెడ్‌ను ప్రతిరోజూ స్ప్రేతో శుభ్రం చేయాలి. మృత్యువాత పడిన కోళ్లను పశుసంవర్ధక శాఖ అధికారులకు చూపించి సహాయం పొందాలి. -పశుసంవర్థక శాఖ ఏ.డి జ్ఞాన శేఖర్‌

కష్టం పోయింది
మూడు నెలలుగా చిన్న పిల్లలను పెంచి పెద్ద చేశాం. కంటికి రెప్పలా కాపాడుకున్నాం. వైరస్‌ దెబ్బతో మా కంచంలో మట్టి పడింది. షెడ్డులో ఉన్న కోళ్లు అన్నీ చనిపోతే.. కంపెనీలు మాకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తాయో లేదో తెలియడం లేదు. -పౌల్ట్రీ రైతు లింగస్వామి, దేవుని తిర్మలాపూర్‌, కోడేరు మండలం.

వేసవిలో కోళ్ల పెంపకం కష్టం
ప్రతి ఏటా వేసవిలో కోళ్లను బతికించడం కష్టంగా మారింది. వేడిని తట్టుకోలేక వందల కోళ్లుచనిపోతున్నాయి. కొన్నిసార్లు వైరస్‌ వచ్చి చనిపోయిన సందర్భాలున్నాయి. అందుకే వేసవిలో కోళ్లను పెంచడం లేదు. -పౌల్ట్రీరైతు చంద్రశేఖర్‌రెడ్డి, తెలకపల్లి మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -