– ఆ అపోహను తిప్పికొట్టేలా అమల్లో చూపాలి
– యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేయండి
– పాలసీలతో పాటు భవిష్యత్ ప్రణాళికా ముఖ్యమే
– ప్రతినెలా కార్యదర్శుల పనితీరుపై సమీక్ష
– నిర్లక్ష్యంగా ఉంటే బేషరమ్‌గా వ్యవహరిస్తాం
– ఐఏఎస్‌లు పదిరోజులకోసారి క్షేత్రస్థాయికి వెళ్లాలి
– కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ లెక్కలు తీయండి
– జనవరి 26లోపు సీఎస్‌కు ఇవ్వాలి
– అద్దె భవనాల్లో ప్రభుత్వ శాఖలు ఉండొద్దు
– వెంటనే ప్రభుత్వ ఖాళీ భవనాల్లోకి మార్చండి
– అన్ని శాఖల ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విజన్ అంటే ప్రచారం కాదనే భావనను ప్రభుత్వ ఉద్యోగులు తొలగించుకోవాలని సీఎం ఏ రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ఆ అపోహను తిప్పికొట్టేలా క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపిస్తేనే ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుందన్నారు. అన్ని శాఖలు దానికోసం స్వల్ప, మధ్యస్థ, దీర్ఘకాల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేస్తే తెలంగాణ రైజింగ్ విజన్ 2047 భవిష్యత్ లక్ష్యాలను సులభంగా సాధించొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారంనా డిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారుల తో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. విధినిర్వహణ లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పని విషయంలో తాను కూడా నిర్మోహమాటంగా వ్యవహరిస్తానని తేల్చిచెప్పారు. ఇకపై ప్రతినెలా అన్ని శాఖల కార్యదర్శుల పనితీరును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించాలనీ, మూడు నెలలకోసారి తానే స్వయంగా ఆయా అధికారుల పని తీరును సమీక్షిస్తానని స్పష్టం చేశారు. కిందిస్థాయి ఉద్యోగులతో ప్రభుత్వానికి ఏంకావాలో చెప్పి చేయించుకోవాల్సిన బాధ్యత కార్యదర్శులదేనని చెప్పారు.
అలాగే ఐఏఎస్ అధికారులు పది రోజులకు ఒకసారి ఆయా శాఖలు చేపడుతున్న పనుల్ని క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు ఫీల్డ్ విజిట్‌కు వెళ్లాలని ఆదేశించారు. ఆయా రిపోర్టుల్ని నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపాలని చెప్పారు. ప్రజా సంక్షేమమే కేంద్రంగా ప్రభుత్వ పని తీరులో సమూల మార్పులు అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ శాఖలపై విధాన పత్రాలు రూపొందించామనీ, ఇకపై కార్యాచరణ అంతా వాటి ప్రకారమే జరగాలని చెప్పారు. అభివృద్ధిని ‘క్యూర్, ప్యూర్, రేర్’ విభాగాలుగా విభజించిన విషయాన్ని ప్రస్తావించారు. వాటి ప్రాధాన్యతను గుర్తుచేశారు. ప్రభుత్వం ఎంత గొప్ప కార్యాచరణ తీసుకున్నా, అది విజయం సాధించాలంటే అధికారుల సహకారం ఉండాలన్నారు. కచ్చితంగా ఇప్పటికంటే మెరుగ్గా అధికారుల పనితీరు ఉండాలని తాను ఆశిస్తున్నానని తెలిపారు. అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారనీ, వారికి సంబంధించిన పూర్తి వివరాలను జనవరి 26 నాటికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయాలని ఆదేశించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు, ఈపీఎఫ్ అందుతున్నాయో లేదో సంబంధిత శాఖల అధికారులు పరిశీలించాలన్నారు.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై అద్దె భవనాల్లో ఉండకూడదని చెప్పారు. జనవరి 26లోపు అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను ఖాళీ చేసి, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ఆదేశించారు. ఖాళీ భవనాలు అందుబాటులో లేకుంటే, అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి, సొంత భవనాల నిర్మాణాలకు అంచనాలు సిద్ధం చేయాలన్నారు. పురపాలకశాఖ సహా అన్ని ప్రభుత్వ శాఖలకు ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు. నిర్ణీత గడువులోగా ప్రతిపాదనలు పంపితే సొంత భవనాల నిర్మాణాలనకు నిధులు విడుదల చేస్తామన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్) నుంచి వచ్చే నిధుల్ని అన్ని శాఖలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయిస్తే, కేంద్రం 60 శాతం నిధులు ఇస్తుందనీ, దీనిద్వారా దాదాపు 3వేల కోట్ల నిధుల్ని తెచ్చుకోవచ్చని సూచించారు. ఆ మేరకు అన్ని శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్ర వాటా నిధుల విడుదలకు సంబంధించిన నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలని ఆర్థికశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో ఫైళ్లు పట్టుకొని తిరిగే పద్ధతి మార్చుకోవాలని చెప్పారు.
అన్ని శాఖల్లోనూ జనవరి 31 నాటికి ఈ-ఫైలింగ్ సిస్టంను అమల్లోకి తేవాలన్నారు. ఇకపై ఎవరూ కాగితాలు, ఫైళ్లు పట్టుకొని తిరగొద్దని చెప్పారు. అన్ని విభాగాలు, శాఖల పరిధిలోని కార్యక్రమాల అమలుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాష్‌బోర్డుకు ముఖ్యమంత్రి కార్యాలయ డాష్‌బోర్డును అనుసంధానం చేయాలని చెప్పారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలు, భూసేకరణ, భూ కేటాయింపులు వంటి అంశాలపై ప్రత్యేక అధికారుల్ని నియమించాలని సీఎం సూచించారు. కోర్ అర్బన్ ఏరియాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలనీ, కార్పొరేట్ తరహాలో సర్కారు స్కూళ్లలో నమోదు శాతం పెంచేందుకు రవాణా సదుపాయాలతో పాటు విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలును పకడ్బందీగా చూడాలని చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో టీచింగ్ ఆస్పత్రుల ద్వారా మరింత మెరుగైన వైద్య సేవల్ని ప్రజలకు అందించాలని కోరారు. నిమ్స్ తరహాలో సనత్‌నగర్, కొత్తపేట, అల్వాల్ టిమ్స్, ఉస్మానియా, వరంగల్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవల్ని విస్తరించాలని చెప్పారు. మెడికల్ కాలేజీ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌ను అనుసంధానం చేయాలని సూచించారు. అక్కడి వైద్యులు, సిబ్బందికి కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావుతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, పలువురు మంత్రులు పాల్గొన్నారు.
విజన్ అంటే ప్రచారం కాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



