Thursday, September 18, 2025
E-PAPER
Homeజాతీయంఓట్ల దొంగలు

ఓట్ల దొంగలు

- Advertisement -

– ఈసీతో కలిసి బీజేపీ నేరపూరిత మోసం
– ఒకే నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు
– ఐదు నెలల్లో కొత్తగా కోటి ఓట్లు నమోదు
– న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలి : ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

”ఒకే నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు. ఐదు నెలల వ్యవధిలోనే కొత్తగా కోటి ఓట్లు నమోదు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిన నేరం. ఎన్నికల సంఘంతో కలిసి బీజేపీ భారీ నేరపూరిత మోసం చేసింది. బీజేపీతో ఎన్నికల కమిషన్‌ కుమ్మక్కై వారికి సహాయం చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎంతో ఇష్టపడే ప్రజాస్వామ్యం ఉనికిలో లేదు. తక్షణం ఈ విషయంలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలి” అని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. తాము సేకరించిన ఆధారాల వంటివి దేశవ్యాప్తంగా ఉన్నాయని, అలాంటి ఆధారాలను నాశనం చేయడంలో ఎన్నికల సంఘం బిజీగా ఉందని ఘాటుగా విమర్శించారు. గురువారంనాడిక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యా లయం (ఇందిరా భవన్‌)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన గత ఎన్నికల్లో జరిగిన అవకతవకలు, ఓట్ల దొంగతనం జరిగిన తీరుతెన్నులపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేశారు.
మహారాష్ట్రలో ఐదు నెలల్లో కోటి కొత్త ఓట్లు
”అనేక రాష్ట్రాల ఓటర్ల జాబితాలో నకిలీ వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌, ఒపీనియన్‌ పోల్స్‌కు వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. హర్యానా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర ఫలితాలు మా అనుమానాలకు బలం చేకూర్చాయి” అని రాహుల్‌గాంధీ స్పష్టంచేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని అన్నారు. ”మహారాష్ట్ర ఎన్నికల్లో 40 లక్షల ఓట్లు రహస్యంగా జోడించారు. ఐదేండ్లలో నమోదైన వారి కంటే, ఐదు నెలల్లో నమోదైన ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 2024 లోక్‌సభ, 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మధ్య సమయంలో కోటి మంది ఓటర్లు నమోదయ్యారు. దీనికి సంబంధించిన ఓటర్ల జాబితాను మాకు ఇచ్చేందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది” అని పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ సందర్భంగా గణాంకాలతో సహా వివరించారు.
ఒక నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు
”అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న మా అనుమానం మహారాష్ట్ర ఫలితాలతో నిజమైంది. మెషిన్‌రీడ్‌ చేయగల ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఇవ్వకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. కర్నాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 6.5 లక్షల ఓట్లకు గాను లక్ష నకిలీ ఓట్లు సృష్టించారు. అవన్నీ తప్పుడు చిరునామాల్లో ఉన్నాయి. ఇవన్నీ మా పరిశీలనలో తేలాయి” అని చెప్పుకొచ్చారు. ”బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ, మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను విశ్లేషించాం.మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 11,965 డూప్లికేట్‌ ఓటర్లు, 40,009 నకిలీ, తప్పుడు చిరునామా, 10,452 బల్క్‌ లేదా సింగిల్‌ అడ్రస్‌ ఓటర్లు, 4,132 తప్పుడు ఫోటోలు ఉన్న ఓటర్లు, మరో 33,692 ఓటర్లు ఫారం-6 దుర్వినియోగం చేసినవి ఉన్నాయి మహదేవపురలో మొత్తం1,00,250 ఓట్లు దొంగిలించబడ్డాయి” అని వివరించారు.
ప్రజాస్వామ్యం లేదు
”ప్రజాస్వామ్య ప్రక్రియను అనుసరించకుండా ఓట్లను దొంగిలిస్తున్నారు. కచ్చితంగా ఎన్నికల కమిషన్‌ దోషి. ఈసీ విశ్వసనీయతపై అనేక సందేహాలు ఉన్నాయి.
దానికి సంబంధించిన అనేక ఆధారాలు మా వద్ద ఉన్నాయి” అని రాహుల్‌గాంధీ స్పష్టంచేశారు. బీజేపీ ఓట్ల దొంగతనం, ఓటర్ల జాబితా అంశాలపై ఈసి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మహారాష్ట్రలో కొన్ని నెలల్లోనే లక్షలాది మంది ఓటర్ల పేర్లు జాబితాలో చేర్చారని, ఇది చాలా ఆందోళనకరమైన విషయమన్నారు. సాయంత్రం 5 గంటల తరువాత ఓటర్ల సంఖ్య పెరగడం కూడా ఆశ్చర్యకరమైన విషయమన్నారు. ఓట్ల దొంగతనానికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించేందుకు ఆరు నెలల సమయం పట్టిందన్నారు.
ఈసీ సమాధానం చెప్పాలి
ఈ సందర్భంగా ఈసీకి ఆయన పలు ప్రశ్నలు సంధించారు. సాయంత్రం 5 గంటల తరువాత ఓటింగ్‌ ఎందుకు పెరిగింది ? ఎన్నికల కమిషన్‌ దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఓట్ల దొంగతనానికి సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నలు అడిగిందనీ, ఇప్పటి వరకు దేనికీ సమాధానం ఇవ్వలేదన్నారు. ఈ సందర్భంగా 2024 నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ.. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికలు ‘రిగ్గింగ్‌’ అయ్యాయనే మా అనుమానాలు నిజమయ్యాయి అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -