Friday, September 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఓట్ల చోరీ?

ఓట్ల చోరీ?

- Advertisement -

బీహార్‌ తరహాలో నల్లగొండలో ఓట్లు తొలగించే ప్రయత్నం
ముగిసిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌
2002, 2025 ఓటర్‌ జాబితాల మ్యాచింగ్‌
మ్యాచింగ్‌ కాని ఓటర్ల ఇంటింటి సర్వే
దసరా తర్వాత ధ్రువపత్రాల పరిశీలన!
సరైన పత్రాలు చూపకుంటే ఓటు తొలగింపు

నవతెలంగాణ-మిర్యాలగూడ
తెలంగాణ రాష్ట్రంలోనూ ‘సర్‌’ అమలుకు రంగం సిద్దమైంది. బీహార్‌ మాదిరే ఓట్ల తొలగింపుకు ఎలక్షన్‌ కమిషన్‌(ఈసీ) సిద్దమైంది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఎలక్షన్‌ కమిషన్‌ 65 లక్షల మంది ఓట్లను తొలగించినట్టే.. తెలంగాణలోనూ ఓట్లను తొలగించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎలక్షన్‌ కమిషన్‌ ద్వారా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) పేరిట ప్రస్తుతం తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన చేపట్టారు. 2002, 2025 ఓటర్‌ జాబితాలను మ్యాచింగ్‌ చేసి రెండు జాబితాల్లో ఓట్లు ఉన్న వారి వివరాలను సేకరించి నివేదిక పంపించారు. మిగిలిన ఓట్లను పరిశీలించేందుకు త్వరలోనే బీఎల్‌ఓల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి.. వాళ్లు ఎలా ఓటు హక్కు పొందారో సంబంధిత ధ్రువీకరణ పత్రాలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వారం కిందట ఎలక్షన్‌ కమిషన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఓటర్‌ జాబితాలను ప్రక్షాళన చేయాలని ఆదేశించింది.

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ పేరిట ఓటర్‌ జాబితాను మ్యాచింగ్‌ చేశారు. మొదటి దశలో మ్యాచింగ్‌ ప్రక్రియ బుధవారం ముగియడంతో ఆ నివేదికను అధికారులు ఎలక్షన్‌ కమిషన్‌కు సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 30 నుంచి 40శాతం ఓట్లు మాత్రమే మ్యాచింగ్‌ అయినట్టు సమాచారం. మిగిలిన ఓటర్లు స్థానికులా? కాదా? గుర్తించేందుకు బీఎల్‌వోలు ఇంటింటి సర్వే చేయనున్నారు. ఆ సర్వేలో ఓటర్లు తమ ఓటు హక్కు ఎలా పొందారో సంబంధిత స్థానికత ధ్రువీకరణ పత్రాలు అందజేసి నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ దసరా పండుగ తర్వాత చేపట్టనున్నట్టు సమాచారం. అలా జరిగితే ప్రతి నియోజకవర్గంలోనూ 20 నుంచి 30శాతం ఓటర్లను జాబితా నుంచి తొలగించే అవకాశం కనిపిస్తోంది. సరైన ధ్రువీకరణ పత్రాలు చూపిం చని వారిని ఓటర్‌ జాబితా నుంచి తొలగించి వారికి దేశ పౌరసత్వం లేనివిధంగా ప్రక టించే అవకాశముంది. బీహార్‌ రాష్ట్రంలో ఎలా చేశారో తెలంగాణలోనూ అదేవిధంగా చేస్తున్నట్టు సమాచారం.

2002, 2025 జాబితాలో ఓట్లు ఉంటేనే..
స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ పేరిట ఎలక్షన్‌ కమిషన్‌ ఓటర్‌ జాబితా ప్రక్షాళన చేపట్టింది. ఎలక్షన్‌ కమిషన్‌ అందించిన 2002, 2025 ఓటర్‌ జాబితాల ఆధారంగా ఓటర్ల మ్యాచింగ్‌ చేపట్టారు. రెండు జాబితాలలో ఓటరు ఓటు హక్కు కలిగి ఉంటేనే వారు స్థానికులుగా, దేశ పౌరులుగా గుర్తించనున్నారు. 2025 ఓటర్‌ జాబితాలో మాత్రమే ఓటు హక్కు ఉంటే.. ఆ ఓటర్లు ఎలా ఓటు హక్కు పొందారో నిరూపించుకునేందుకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. సరైన ధ్రువీకరణ పత్రాలు, ఓటు హక్కు పొందిన ఆధారాలు చూపించకపోతే ఆ ఓటరును స్థానికేతరునిగా గుర్తించి జాబితా నుంచి తొలగిస్తామని ఓ అధికారి ‘నవతెలంగాణ’కు తెలిపారు. 2002లో ఓటు హక్కు ఉండి ఇప్పుడు ఓటు హక్కు లేని వారి వివరాలను సేకరించి వారు ఎక్కడికి వెళ్లారు..? ఎక్కడ ఉన్నారు? అనే వివరాలు కూడా ఆరా తీయనున్నారు. జాబితాలో ఎవరైనా చనిపోయిన, ఇతర దేశాలకు వలస వెళ్లిన వారి ఓట్లు ఉంటే గుర్తించి తొలగించనున్నారు.

18 నుంచి 38 ఏండ్ల వయస్సు వారి గుర్తింపు
2002 ఓటర్‌ జాబితాలో 18 ఏండ్ల నుంచి 38 ఏండ్ల వయస్సు గల ఓట్లను గుర్తించారు. 2002లో 18 ఏండ్లు ఉన్నట్టయితే 2025 నాటికి వారికి 43 ఏండ్ల వయస్సు ఉంటుంది. అప్పుడు 38 ఏండ్లు ఉన్నట్టయితే ఆ ఓటర్‌కు ఇప్పుడు 61 ఏండ్ల వయస్సు ఉంటుంది. అలాంటి వారిలో ఎవరైనా చనిపోతే వారి ఓట్లను తొలగిస్తున్నారు. ఓట్లు ఉన్న వారు ఇప్పుడు ఓటరుగా ఉన్నారా లేదా పరిశీలిస్తున్నారు. 2002 తర్వాత నమోదైన ఓటర్లను స్థానికేతరులుగా గుర్తించి వారి పుట్టిన ప్రాంతం, నివాస ప్రాంతంపై ఆరా తీయనున్నారు. పుట్టిన ప్రాంతం, నివాస స్థలం.. తల్లిదండ్రులు, తాత ముత్తాతల స్థానికతపై ధ్రువీకరణ పత్రాల ద్వారా నిర్ధారణ చేయనున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో 60 లక్షల ఓట్లు తొలగించే కుట్ర
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో ఓట్ల జాబితా ప్రక్షాళన సాగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలలో ఈ ప్రక్షాళన నడుస్తోంది. 2002, 2005 ఓటర్‌ జాబితాల ప్రకారం ఒక్కో నియోజకవర్గంలో సుమారు 50 వేల నుంచి 60వేల వరకు ఓట్లు మ్యాచింగ్‌ అయినట్టు సమాచారం. ధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం ప్రతి నియోజకవర్గంలోనూ 20 నుంచి 30శాతం ఓట్లు తొలగిపోయే అవకాశమున్నది. ఉమ్మడి జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో సుమారు 40 వేల నుంచి 60 వేల ఓట్ల వరకు అంటే 12 నియోజకవర్గాల్లో సుమారు 5 లక్షల ఓట్లు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల ఓట్లు తొలగిపోయే అవకాశముంది.

ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను పాటిస్తాం
ఓటర్‌ జాబితా ప్రక్షాళన విషయంపై ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను పాటిస్తాం. ప్రస్తుతం 2002, 2025 ఓటర్‌ జాబితాలను స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ చేశాం. రెండు జాబితాలలో ఉన్న ఓటర్ల వివరాలను సేకరించి నివేదికను ఉన్నత అధికారులకు అందజేశాం. ఆ తర్వాత ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను అమలు చేస్తాం.
సబ్‌ కలెక్టర్‌ నారాయణ అమిత్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -