తెలంగాణలోనూ ఓట్ల చోరీకి కుట్రలు
కలిసికట్టుగా వారి భరతం పట్టాలి
బహుజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది కిషన్‌రెడ్డి, మోడీనే..
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగంలోనే లేవు
కేసీఆర్ చేసిన చట్టం బీసీలకు శాపం : సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సభలో సీఎం రేవంత్‌రెడ్డి
ట్యాంక్‌బండ్‌పై విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో ఓట్ల దొంగలు పడ్డారని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. బీజేపీ నేతలు దొంగ ఓట్లతో కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారనీ, తెలంగాణలో కూడా ఈ తరహా కుట్రలకు తెరలేపారని చెప్పారు. మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ నాలుగు నెలల్లో కోటి ఓట్లను నమోదు చేసిందని గుర్తు చేశారు. ఈ రకంగా అంబేద్కర్ పుట్టిన గడ్డ మీద రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు.
దొంగ ఓట్లతోనే మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఓట్ల చోరీ దేశం నలుమూలలా జరుగుతోందనీ, బీహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగించారని గుర్తు చేశారు. బతికున్న వారిని చనిపోయినట్టుగా చూపారని తెలిపారు. ఈ కుట్రను రాహుల్ గాంధీ బయటపెట్టారని చెప్పారు. తప్పు చేసిన వారిని వదిలేసి తప్పును ప్రశ్నించిన రాహుల్ గాంధీని ఎన్నికల కమిషన్ అఫిడవిట్ అడగటమేంటని ప్రశ్నించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహ ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం రవీంద్రభారతిలో బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఓటు హక్కును దొంగిలించిన వారిని శిక్షించాలంటూ రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారనీ, త్వరలో తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ పాదయాత్రలో పాల్గొని మద్దతిస్తామని తెలిపారు.
అందరం కలిసికట్టుగా ఓట్ చోరీ కుట్రదారుల భరతం పట్టాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ సూచనలను అమలు చేయడం తమ బాధ్యతనీ, ఆ క్రమంలో సమస్య వచ్చినప్పుడు పోరాడేందుకు బహుజనులు నైతిక మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు. విద్య ఒక్కటే బహుజనుల తలరాతలు మారుస్తుందని రేవంత్ చెప్పారు. నాణ్యమైన చదువు, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. బహుజనులంతా ఉన్నత చదువులు చదివి రాజ్యాధికారం సాధించాలనీ, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహనీయుల విగ్రహాలనేవి వర్దంతులు, జయంతుల కోసం కాదనీ, అవి వారి స్ఫూర్తిని మనలో రగిలించేందుకేనని చెప్పారు. అందుకే రాష్ట్రానికి గుండెకాయ లాంటి సచివాలయం సమీపంలో పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
అడ్డుకుంటోంది వాళ్లే…
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ప్రధాని నరేంద్రమోడీనేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బహుజనుల సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మైనింగ్ పేరుతో ఖిలాషాపూర్ కోట చరిత్రను కాలగర్భంలో కలిపేందుకు కుట్రలు పన్నిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడే కోటపైకి వెళ్లి దాన్ని కాపాడి చారిత్రక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన చట్టం బీసీలకు శాపంగా మారిందన్నారు. దాన్ని సవరిస్తూ చేసిన ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపితే ఆయన రాష్ట్రపతికి పంపారని తెలిపారు. ఐదు నెలలు గడిచినా బిల్లులను ఆమోదించకపోవడంతో బహుజనుల కోసం ఢిల్లీలో ధర్నా సైతం చేశామని గుర్తు చేశారు. బహుజనుల కోసం తాము చేసిన ధర్నాకు బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు రాలేదంటూ సీఎం నిలదీశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగంలోనే లేవని గుర్తు చేశారు. అబద్ధాలతో బహుజనులకు అన్యాయం చేయాలని ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు.
మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో బీసీల్లోని ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించగలరా? అంటూ ప్రధాని మోడీకి సవాల్ విసిరారు. 56 ఏండ్లుగా ఇవి అమలవుతున్నాయనీ, ఇప్పుడు మతం ముసుగులో బహుజనుల రిజర్వేషన్లను బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దే నాయకత్వాన్ని గాంధీ కుటుంబం దేశానికి అందించిందని చెప్పారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశ సమగ్రత కోసం కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారని తెలిపారు. ఆ సందర్భంగా కులగణన చేసి తీరుతామని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారనీ, గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే అది శిలాశాసనమేనని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా తెలంగాణలో తాము కుల గణన చేసి చూపించామంటూ చెప్పారు. పక్కా ప్రణాళిక ప్రకారం శాస్త్రీయంగా దాన్ని పూర్తి చేశామని ధీమా వ్యక్తం చేశారు. కులగణన ద్వారా బహుజనుల సంఖ్య 56.33 శాతంగా ఉందంటూ తేల్చామన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధితోపాటు రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. రాహుల్ గాంధీపై కోపం ఉంటే ఆయనపైనే చూపాలనీ, అంతేగానీ ఆయన సిద్ధాంతాలపై చూపొద్దంటూ కేంద్రంలోని మోడీ సర్కారుకు హితవు పలికారు. కార్యక్రమంలో మంత్రులు అడ్లూరి లక్ష్మన్ కుమార్, వాకిటి శ్రీహరి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు కే.కేశవరావు, జీహెచ్‌ఎమ్‌సీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, బీసీ కార్పొరేషన్ చైర్మెన్ శ్రీకాంత్ గౌడ్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ ముత్తినేని వీరయ్యతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
మా మూల సిద్ధాంతమే సామాజిక న్యాయం : డిప్యూటీ సీఎం భట్టి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తమ పార్టీ మూల సిద్ధాంతమే సామాజిక న్యాయమని అన్నారు. తెలంగాణలో చేపడుతున్న సంస్కరణలు, నిర్ణయాలు దేశానికే దశ, దిశా, నిర్దేశం చేస్తున్నాయని ఆయన తెలిపారు. భారత చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులగణనను చేపట్టామని వివరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చట్టం చేశామని గుర్తు చేశారు.
దేశంలో ఓట్ల దొంగలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES