రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ముందస్తు సన్నాహాల్లో భాగంగా హైదరాబాద్‌లో చేపడుతున్న ఓటర్ల మ్యాపింగ్ సర్వే మరింత చురుగ్గా, వేగంగా జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలను ఆదేశించారు. శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మాణికేశ్వర్ నగర్ పోలింగ్ కేంద్రం 211 పరిధిలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ముందస్తు సన్నాహాల్లో భాగంగా చేపట్టిన ప్రోజెన్సీ మ్యాపింగ్‌ను ఆకస్మికంగా పరిశీలిం చారు. అనంతరం చార్మినార్ నియోజకవర్గంలోని కబుత్తరు ఖానా పోలింగ్ కేంద్రం 12 పరిధిలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించారు. బూత్ లెవెల్ అధికారులు, సూపర్ వైజర్‌లతో మాట్లాడారు. మ్యాపింగ్ ఎట్లా చేస్తున్నారంటూ ప్రశ్నించారు. మ్యాపింగ్‌పై వారికి ఉన్న అవగాహనను నేరుగా పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి 2002 జాబితాలోని ఓటర్ల కుటుంబ సభ్యుల వివరాలను 2025 జాబితాను పోల్చుతున్నామని తెలిపారు. 2002 జాబితాలో పేర్లున్న ఓటర్ల కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి, ప్రస్తుత జాబితాలో ఉంటే వారి పేర్లను మ్యాపింగ్ చేపడుతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రోజెన్సీ మ్యాపింగ్ పకడ్బందీగా చేపట్టి వేగంగా పూర్తి చేయాలన్నారు. ఎన్నికల జాబితాల్లో కచ్ఛితత్వం, పారదర్శకత, సమగ్రతను పాటించడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో ‘సర్’ కార్యక్రమం చేపట్టనుందని తెలిపారు. క్షేత్ర పరిశీలనలో ప్రధాన ఎన్నికల అధికారి వెంట అదనపు కమిషనర్ (ఎన్నికల విభాగం) చంద్రకళ, ఈఆర్‌వోలు సరిత, ఆంజనేయులు, ఏఈఆర్‌వోలు సుధీర్ రెడ్డి, ఎన్నికల విభాగం సహాయ మున్సిపల్ కమిషనర్ విమల తదితరులు ఉన్నారు.
ఓటర్ల మ్యాపింగ్ సర్వే వేగంగా చేపట్టాలి
- Advertisement -
- Advertisement -



