Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంనేటి నుంచి ఓట్‌ అధికార్‌ యాత్ర

నేటి నుంచి ఓట్‌ అధికార్‌ యాత్ర

- Advertisement -

– బీహార్‌లో 16 రోజులు.. 1300 కిలోమీటర్లు ప్రయాణం
– ఓట్ల చోరీపై ‘లాపతా ఓట్‌’ వీడియోను విడుదల చేసిన రాహుల్‌ గాంధీ
న్యూఢిల్లీ :
ఎన్నికల సంఘం బీహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు, ప్రజల ఓటు హక్కుపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ఆదివారం ‘ఓట్‌ అధికార్‌ యాత్ర’ను చేపట్టనున్నట్టు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అఖిలేశ్‌ ప్రసాద్‌ సింగ్‌ తెలిపారు. ఈ యాత్ర ద్వారా 16 రోజులు..1300 కిలోమీటర్ల పరిధిలోని ఓటర్లకు అవగాహన కల్పించ నున్నట్టు ఆయన వివరించారు. శనివారం పాట్నాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘బీహార్‌లో ఓట్‌ అధికార్‌ యాత్రను ఆదివారం ససారం నుంచి రాహుల్‌ గాంధీ ప్రారంభించనున్నారు. ఈ యాత్ర ముగిసేవరకు రాహుల్‌ రాష్ట్రంలోనే ఉండనున్నారు. ఈ యాత్ర కోసం ముందుగానే అనుమతులు తీసుకున్నాం. ఈ యాత్ర రాష్ట్రంలోని 24 జిల్లాలు, 118 నియోజకవర్గాలను కవర్‌ చేస్తుంది. ఆగస్టు 20, 25, 31 తేదీల్లో యాత్రకు విరామం. సెప్టెంబర్‌ 1న పాట్నాలో జరిగే ర్యాలీతో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రలో బీహార్‌ అసెంబ్లీ ప్రతిపక్షనేత తేజస్వియాదవ్‌ పాల్గొననున్నారు. ఆర్జేడీతోపాటు ఇండియా బ్లాక్‌లోని ఇతర పార్టీలైన వామపక్ష పార్టీల నేతలు కూడా పాల్గొననున్నారు’ అని ఆయన అన్నారు.

ఓట్ల చోరీపై ‘లాపతా ఓట్‌’ వీడియోను విడుదలచేసిన రాహుల్‌గాంధీ
బీహార్‌ ఓటర్ల జాబితాలో లోపాలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా ఆయన శనివారం ‘లాపతా ఓట్‌’ (ఓట్లు కోల్పోయిన) అనే టైటిల్‌తో వీడియోను ఎక్స్‌లో విడుదల చేశారు. నిమిషం నిడివి ఉన్న ఆ వీడియోలో.. పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి తన ఓటు చోరీ చేశారని, ఇంకా లక్షల ఓట్లు చోరీ అయ్యాయని అధికారులకు ఫిర్యాదు చేస్తారు. పోలీసు సిబ్బంది చెక్‌ చేసి అందులో తమ ఓట్లు కూడా గల్లంతుకావడంతో నిర్ఘాంతపోతారు. అలా ఆ వీడియా ముగుస్తుంది.
దీనిని రాహుల్‌ తన అధికారిక ఎక్స్‌లో పోస్టు చేస్తూ.. ”ఓటర్లందరూ చైతన్యంతో ఓ ఉద్యమంలా ముందుకు సాగాలి. మీ ఓటు చోరీ అయితే మీ ప్రాథమిక హక్కు చోరీ అయినట్లే ” అని పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా మనమందరం ఉద్యమంగా పోరాడి మన హక్కులను కాపాడుకుందామని తెలిపారు.
ఓట్ల చోరీ అనేది ‘డూ ఆర్‌ డై’ సమస్యగా కాంగ్రెస్‌ పేర్కొంది. ఓట్లు గల్లంతైన వారి కోసం ఓ వెబ్‌ పోర్టల్‌ను కూడా ప్రారంభించింది. అందులో పోల్‌ ప్యానెల్‌ నుంచి ఓట్ల గల్లంతుకు వ్యతిరేకంగా నమోదు చేసుకోవడానికి, అధికారుల నుంచి జవాబుదారీతనం కోరడానికి, డిజిటల్‌ ఓటరు జాబితాల డిమాండ్‌కు మద్దతు తెలియజేయడానికి ఆ వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad