17 నుంచి యాత్ర ప్రారంభం
‘ఓటు చోరీ’కి వ్యతిరేకంగా బీహార్ నుంచి
ప్రత్యక్ష పోరాటం : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాలో లోపాలపై ఈసీ, అధికార బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరింత దూకుడు పెంచారు. బీహార్ లో ‘ఓట్ అధికార్ యాత్ర’ను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఓటర్ల జాబితాల సవరణ, ఓటు చోరీకి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రణాళికలు వేశారు. ఈ క్రమంలో బీహార్‌లోని ఇండియా బ్లాక్ నాయకులతో కలిసి రాహుల్ గాంధీ 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ఓట్ అధికార్ యాత్ర’ చేపట్టనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
ప్రజాస్వామ్యాన్ని రక్షించటానికి పోరాటం.. కేసీ వేణుగోపాల్
దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పోరాటం వీధుల్లో జరుగుతుందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఆగస్టు 17 నుంచి లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఇండియా బ్లాక్ నాయకులు బీహార్ అంతటా ఓటు అధికార్ యాత్రను చేపడతారని పేర్కొన్నారు. ”ప్రమాదకరమైన ఎస్‌ఐఆర్, ఓటు చోరీకి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రజా ఉద్యమంగా మార్చడానికి ఈ యాత్ర. యాత్రకు సన్నాహాలు, జన సమీకరణ వంటి ఏర్పాట్లపై చర్చించేందుకు బుధవారం ససారంలో ఇండియా బ్లాక్ నాయకులను కలిశాను. ఓటు అధికార్ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగే ర్యాలీతో ముగుస్తుంది” అని కేసీ వేణుగోపాల్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
‘అది మాకు డూఆర్ డై సమస్య’
ఓటు చోరీ అనేది తమకు డూ ఆర్ డై సమస్య అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఆగస్టు 14 సాయంత్రం ‘లోక్ తంత్ర బచావో మషాల్ మార్చ్‌లు’తో సహా వివిధ కార్యకలాపాల ద్వారా ఓటు చోరీపై తమ గొంతుకను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒక రోడ్ మ్యాప్‌ను ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జిలతో సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ ప్రకటన చేశారు.కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ, ఎస్‌ఐఆర్ ను మూడు ముఖ్యమైన కార్యక్రమాలతో ప్రజల్లోకి తీసుకెళ్తుందని హస్తం పార్టీ నాయకుడు కన్హయ్య కుమార్ తెలిపారు. ఆగస్టు 22- సెప్టెంబర్ 7 మధ్య అన్ని రాష్ట్ర ప్రధాన కార్యాలయాలలో కాంగ్రెస్ ‘ఓట్ చోర్, గద్ది ఛోడ్’ (ఓటు దొంగలు, అధికారాన్ని వదులుకోండి) ర్యాలీలను నిర్వహిస్తుంది.
ఓట్ అధికార్ యాత్ర
- Advertisement -
- Advertisement -