Wednesday, November 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనూతన దంపతులకు ఓచర్లు!

నూతన దంపతులకు ఓచర్లు!

- Advertisement -

చైనా నగరాల్లో నయా ట్రెండ్‌
బీజింగ్‌ :
కొత్తగా గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టిన నూతన దంపతులకు వివాహ వినియోగ ఓచర్లను అందజేయడం ఇప్పుడు చైనాలో నయా ట్రెండ్‌గా మారింది. తూర్పు చైనాలోని జెజియాంగ్‌ రాష్ట్రంలో ఉన్న నింగ్బో నగరంలో పౌర వ్యవహారాల విభాగం వారు కొత్తగా వివాహం చేసుకున్న దంపతులకు వెయ్యి యువాన్ల (140 డాలర్లు) విలువ కలిగిన వినియోగ ఓచర్లను అందజేస్తున్నారు. నగరంలో ఇటీవల వివాహాలను రిజిస్ట్రర్‌ చేసుకున్న వారికి ఈ ఓచర్‌ను ఇస్తున్నారు. వివాహ వినియోగ ఓచర్ల జారీపై గత నెల 28వ తేదీతో మొదలైన ప్రచారం డిసెంబర్‌ 31వ తేదీ వరకూ కొనసాగుతుంది. దీని కింద ప్రతి జంట ఎనిమిది ఓచర్లు పొందవచ్చు. ప్రతి ఐదు వందల యువాన్ల ఖర్చు పైన 125 యువాన్ల రాయితీ లభిస్తుంది. అయితే జారీ చేసే ఓచర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. ‘ముందుగా వచ్చిన వారికి ముందుగా’ అనే ప్రాతిపదికన వీటిని ఇస్తారు. వివాహానికి సంబంధించి పెట్టే ఏ ఖర్చు కైనా ఈ ఓచర్‌ను ఉపయోగించుకొని రాయితీ పొందవచ్చు.
జెజియాంగ్‌ రాష్ట్రంలోని మరికొన్ని నగరాలలో కూడా ఈ ఓచర్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. తగిన వయసులో వివాహం చేసుకోవాలని, సంతానాన్ని కనాలని చైనా ఇటీవలి కాలంలో తీవ్రంగా ప్రచారం చేస్తోంది. గతంలో షాంక్సీ రాష్ట్రంలోని లులియాంగ్‌ నగరంలో కూడా వివాహాన్ని రిజిస్ట్రర్‌ చేయించుకున్న దంపతులకు 1,500 యువాన్ల విలువ కలిగిన ఓచర్‌ ఇచ్చారు. అయితే వధువు వయసు 35 సంవత్సరాలు, అంతకంటే తక్కువ ఉండాలి. వివాహానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే దంపతులకు అందజేసే ఓచర్‌ విలువ తక్కువే అయినప్పటికీ వివాహాలను ప్రోత్సహించడానికి అధికారులు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనివల్ల వివాహ వస్తువుల అమ్మకాలు పెరుగుతాయని, ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని వారు భావిస్తున్నారు. చైనాలో మే నుంచి అమలులో ఉన్న వివాహ నమోదు విధానం ప్రకారం వధూవరులు ఏ ప్రాంతానికి చెందిన వారు అయినప్పటికీ దేశంలో ఎక్కడైనా తమ వివాహాన్ని రిజిస్ట్రర్‌ చేసుకోవచ్చు. చైనా ప్రభుత్వం ఇప్పటికే చిన్నారుల సంరక్షణ నిమిత్తం సబ్సిడీలు అందజేస్తోంది. తాజాగా వివాహ వినియోగ ఓచర్లు కూడా జారీ అవుతుండడంతో సంతానోత్పత్తికి అనువైన సమాజ నిర్మాణం జరుగుతుందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -