Monday, September 22, 2025
E-PAPER
Homeమానవిసహృదయ ఉపాధ్యాయిని వురిమళ్ళ‌ సునంద

సహృదయ ఉపాధ్యాయిని వురిమళ్ళ‌ సునంద

- Advertisement -

‘విద్యాలయ ధ్వజస్తంభాలు భాషో పాధ్యాయులు’ అన్న నానుడిని నిజం చేస్తున్నారు. దశాబ్ద కాలంగా అటు బోధనలోను ఇటు సాహిత్య సేవలోను సవ్యసాచిగా కృషి చేస్తున్నారు. బాషోపాధ్యాయ వర్గానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. స్వయంగా సాహిత్య సేద్యం చేయడమే కాక తాను పని చేస్తున్న పాఠశాల విద్యార్థులను సైతం రచయితలుగా తీర్చిదిద్దుతున్నారు. ‘వురిమళ్ల ఫౌండేషన్‌’ స్థాపించి సాహిత్య లోకానికి విశేష సేవలు అందిస్తున్నారు. ఆమే వురిమళ్ల సునంద. తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ ఉపాధ్యాయ కీర్తి పురస్కారం 2024 అందుకోబోతున్న సందర్భంగా ఆమె పరిచయం నేటి మానవిలో…

సునంద ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. బాల్యం నుంచి సుడిగుండాలు ఎదుర్కొన్న సాహస పయనం ఈమెది. నాటి ఆచారాల ప్రకారం బాల్య వివాహం తప్పలేదు. తర్వాత పిల్లల పెంపకం, కుటుంబ నిర్వహణ వంటి బాధ్యతలు మోస్తూనే పెండ్లితో ఆగిపోయిన పదవ తరగతి విద్యను తిరిగి ప్రారంభించారు. భర్త భోగోజు ఉపేందర్‌ రావు ప్రోత్సాహాలతో మళ్లీ తన చదువుల బండిని నడిపించారు. డిగ్రీతో పాటు ఉపాధ్యాయ విద్య పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం పొంది, తనకు ఇష్టమైన బోధనా రంగంలోకి ప్రవేశించారు.

సాహితీ సృజనతో…
ఉద్యోగం చేస్తూనే విశ్వవిద్యాలయ విద్యలు పూర్తిచేశారు. ఎందరో విద్యార్థులకు తెలుగు భాష రుచులను పంచుతున్నారు. తనకు మక్కువైన సాహితీ సృజనతో రచనలు చేయడంతో పాటు తాను పనిచేస్తున్న పాఠశాలల్లో ఔత్సాహికులైన పిల్లల్లోని సృజనాత్మకతలను వెలికితీస్తున్నారు. విద్యార్థులను బాల్యం నుండే కవులుగా, కథా రచయితలుగా, తీర్చిదిద్దుతూ భావితరం సాహితీవేత్తలను తయారు చేస్తున్న ఘనత సునంద సొంతం. తాను పనిచేసే ప్రతి పాఠశాలను తన సొంత కుటుంబంగా భావిస్తారు. పిల్లలను సొంత పిల్లల కన్నా ఎక్కువగా ఆదరిస్తారు. అందరితో కలిసిపోయి అందరినీ తన వెంట నడిపించుకోగల మృదు స్వభావ సేవానాయకీమణి వురిమళ్ళ సునంద అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. నిగర్వం, నిరాడంబరత సహృదయతలే పెట్టుబడిగా అటు విద్యా రంగంలోనూ ఇటు తెలుగు సాహితీ క్షేత్రంలోనూ విశేష కృషి చేస్తున్న సునంద జీవితం నేటితరం ఉపాధ్యాయలకు గర్వకారణం, ఆదర్శనీయం.

బహుముఖీయమైన కృషి
సాహితీ క్షేత్రంలో కవయిత్రిగా ప్రారంభమైన ఆమె ప్రస్థానం కథా రచయిత్రిగా, సంపాదకురాలుగా, ప్రభుత్వ పాఠ్యపుస్తకాల సంపాదక వర్గ సభ్యురాలుగా, ఆకాశవాణి రచయిత్రిగా, వురిమళ్ల ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలుగా.. ఇలా బహుముఖీయమైన కృషి చేస్తూ సాహితీ ప్రపంచంలో నిర్విరామంగా సాగిపోతూ తన కంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆమె ఏమి చేసినా, ఏమి రాసిన, ప్రజా ప్రయోజనార్థమే. ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ అనుకోకుండా.. ‘అందరూ బాగుండాలి.. అందుకోసం నేను ఏం చేయాలి?’ అనే పరోపకార గుణంతో సాగుతున్న వారి సాహితీ ప్రస్థానంలో అనేక మైలురాళ్లు అగుపిస్తాయి.

పిల్లలంటే ఎనలేని ప్రేమ
వురిమళ్ల వసంతం(కవిత్వం), మెలకువ చిగురించిన వేళ (కవిత్వం), ‘బహు’మతులు’ (కథలు), సాహిత్యంలో న్యాయాలు (వ్యాసాలు)తో పాటు.. బాల సాహిత్యంలో.. వెన్నెల బాల(గేయ సంపుటి), బాలలకో బహుమతి (బొమ్మల కథా సంపుటి) వెలువరించారు. అలాగే వీరి సంపాదకత్వంలో అసిఫా కోసం (కవితా సంకలనం) వెలువడింది. ఇక వీరి ఉద్యోగ జీవితానికి, సృజనాత్మక వైభవానికి అవినాభావ బంధం బలపడటానికి ఓ ప్రధాన కారణం ఉంది. ఆమె మనసు పసి హృదయం కావడమే దీనికి కారణం. పిల్లలంటే ఎనలేని ప్రేమాభిమానాలు కలబోసుకున్న బాలసాహితీ రచయిత్రి ఈమె. నిత్యం విద్యార్థులతో మమేకమై పాఠాలు గుణపాఠాలు బోధిస్తూ, వారిలో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను, సృజనాత్మక శక్తులను ఒడిసి పట్టి వెలికి తీయడం ఆమెకు అక్షరంతో అబ్బిన విద్య.

అక్షర క్రతువు
ఆమె పని చేసిన ప్రతి పాఠశాలక్షేత్రాల్లో కవులు, కథకులు, చిత్రకారులు అలవోకగా పుట్టుకొస్తారు. అది ఆమె బోధనా నైపుణ్యంలోని గొప్పతనం. పిల్లలతో రచనలు చేయించడం ఒక ఎత్తు అయితే వాటిని అందంగా పుస్తక రూపంలో ప్రచురించి భావితరాల వారి కోసం భద్రపరచటం మరో ఎత్తు. ఇలా క్లిష్టమైన రెండు బాధ్యతలను భుజాలకి ఎత్తుకొని ఆర్థిక భారాన్ని కొంత తానే భరిస్తూ మరి కొంత సహృదయ సహచరుల సహకారంతో ఈ అక్షర క్రతువు నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఆయా పాఠశాలల విద్యార్థులకు మధురస్మృతులను పంచుతున్నారు మన తెలుగు మేడం సునంద.

వురిమళ్ల ఫౌండేషన్‌
2019 నుంచి ‘వురిమళ్ల ఫౌండేషన్‌’ అనే సాహితీ సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేశారు. జాతీయస్థాయిలో విద్యార్థులకు బాలసాహిత్య ప్రక్రియల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తున్నారు, పుస్తకాలు ప్రచురిస్తున్నారు. అదేవిధంగా ప్రౌఢ సాహితీవేత్తలను కూడా ప్రతిభా పురస్కారాలతో సమున్నతంగా గౌరవిస్తున్నారు. ఆమె చేస్తున్న ఈ అక్షర సేవకి సాహితీ కృషికిగాను అనేక సన్మానాలు, సత్కారాలతో పాటు పలు పురస్కారాలు లభించాయి. ప్రతినిత్యం భావి సాహితీ వికాసం కోసం పరితపిస్తున్న ఈ ప్రతిభా మూర్తికి ఇటీవల జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం కూడా లభించింది. ప్రస్తుతం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా అందించే ‘కీర్తి పురస్కారం 2024’ను ఉత్తమ ఉపాధ్యాయ విభాగం నుండి అందుకోబోతున్నారు. విశ్వవిద్యాలయ స్థాయి కీర్తి పురస్కారం పొందిన వురిమళ్ళ ఖ్యాతి మరింత ఎత్తుకు ఎదగబోతోంది.

  • అమ్మిన శ్రీనివాస రాజు, 7729883223
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -