Saturday, October 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపోరాట ఫలితమే నైబర్‌ హుడ్‌ సిబ్బందికి వేతనాలు

పోరాట ఫలితమే నైబర్‌ హుడ్‌ సిబ్బందికి వేతనాలు

- Advertisement -

ప్రభుత్వానికి కృతజ్ఞతలు : ఎన్‌పీఆర్‌డీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా క్రాంతి పథకం ఆధ్వర్యంలో నడుస్తున్న నైబర్‌ హుడ్‌ సెంటర్లలో పని చేస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం పట్ల వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్‌పీఆర్‌డీ)కృతజ్ఞతలు తెలిపింది. వేతనాల పెంపు, హెచ్‌ఆర్‌ విధానం అమలు కోసం, రెగ్యులరైజ్‌ చేయాలని 2024 నుండి ఎన్‌పీఆర్‌డీ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన పోరాటాలు నిర్వహించినట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె వెంకట్‌, ఎం అడివయ్య, గౌరవాధ్యక్షులు వరమ్మ, కోశాధికారి ఆర్‌ వెంకటేశ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెర్ఫ్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న నైబర్‌హుడ్‌ సెంటర్లలో పని చేస్తున్న కార్యకర్తలు, ఎర్లీ ఇంటర్వెన్షన్‌ కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్లు, ఆయా, రిహబిలిటేషన్‌ ప్రొఫెషనళ్లు 225 మంది పని చేస్తున్నారని తెలిపారు. వీరు అతి తక్కువ వేతనాలతో గత 15 ఏండ్ల నుండి పని చేస్తున్నారని గుర్తు చేశారు. సెర్ప్‌లో పని చేస్తున్న అనేక మంది సిబ్బందిని గత ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేసి వేతనాలు పెంచిందని తెలిపారు.

కానీ ఎన్‌హెచ్‌సీలలో పని చేస్తున్న సిబ్బందిని పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఎన్‌పీఆర్‌డీ, ఎన్‌హెచ్‌సీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క, సెర్ప్‌ సీఈఓ, వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మెన్‌ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. 2025 ఫిబ్రవరి 25న సెర్ప్‌ సీఈఓతో జరిగిన చర్చల సందర్బంగా కార్యకర్తలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.5వేల నుండి 13,650 లకు, సీఆర్‌పీలకు రూ.5000 నుండి 13,650లకు, ఆయాలకు రూ.4000 నుండి రూ.7,800 లకు,రిహ్యాబిలిటేషన్‌ ప్రోఫెషనళ్లకు రూ.21,000 నుండి రూ.36,000 లకు పెంచుతామని హామీ ఇచ్చారు. హామీ అమలు చేయడానికి ప్రభుత్వం కాలయాపన చేస్తుంటే 2025 జూలై 23న సెర్ప్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించామని గుర్తు చేశారు. అనేక పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచుతు ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు, పెంచిన వేతనాలు 2025 ఏప్రిల్‌ నుండి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించటం హర్షణీయమని తెలిపారు. ప్రతినెల మొదటి వారంలోనే వేతనాలు చెల్లించే విదంగా చర్యలు తీసుకోవాలనీ, పెండింగ్‌లో ఉన్న పెరిగిన వేతనాలను అక్టోబర్‌ నెలలో ఏరియర్స్‌తో కలిపి చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -