Sunday, September 21, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅప్రకటిత యుద్ధం చేస్తోంది

అప్రకటిత యుద్ధం చేస్తోంది

- Advertisement -

అమెరికాపై వెనిజులా ఆగ్రహం
విచారణ జరపాలని ఐరాసకు వినతి


కారకాస్‌ : కరేబియన్‌ ప్రాంతంలో అమెరికా ‘అప్రకటిత యుద్ధం’ చేస్తోందని వెనిజులా ఆరోపించింది. అమెరికా దాడులపై విచారణ జరపాలని ఐక్యరాజ్యసమితిని కోరింది. ఓడల ద్వారా మాదక ద్రవ్యాల రవాణా జరుగుతోందన్న ఆరోపణతో అమెరికా ఇటీవలి కాలంలో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఇప్పటికే 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వెనిజులా తీరంలోని అంతర్జాతీయ జలాల్లో అమెరికా యుద్ధ నౌకలను మోహరించింది. మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపే పేరుతో పుయర్టో రికోకు ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్లను కూడా పంపింది. అమెరికా చర్యలపై వెనిజులా మండిపడింది. ‘ఇది అప్రకటిత యుద్ధం. మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నా లేకున్నా కరేబియన్‌ సముద్రంలో ప్రజలపై దాడులు చేసి చంపేస్తోంది. తమను తాము రక్షించుకునే హక్కు సైతం వారికి లేకుండా చేస్తోంది’ అని రక్షణ మంత్రి వ్లాదిమిర్‌ పడ్రినో లోపెజ్‌ విమర్శించారు. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో వెనిజులా నిర్వహించిన సైనిక విన్యాసాలకు ఆయన హాజరయ్యారు. ఓ ఓడపై మరో సైనిక దాడి చేశామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన చేయడానికి కొద్ది గంటల ముందు లోపెజ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము జరిపిన దాడిలో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముగ్గురు హతమయ్యారని ట్రంప్‌ తెలిపారు.

దీంతో అమెరికా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 17కు చేరింది. అయితే ఈ దాడి ఎప్పుడు జరిగిందీ ట్రంప్‌ వివరించలేదు. అమెరికా దక్షిణ కమాండ్‌ ప్రాంతంలో జరిగిందని మాత్రం చెప్పారు. అసలు అమెరికా చట్టాల ప్రకారం మాదక ద్రవ్యాల రవాణా మరణశిక్ష విధించదగిన నేరమేమీ కాదు. అలాంటప్పుడు ఈ హత్యాకాండ ఎలా సాగిస్తారన్న చర్చ జరుగుతోంది. తాను దాడి చేసిన ఓడల్లో మాదక ద్రవ్యాల రవాణా జరిగిందా లేదా అనే విషయంపై కూడా అమెరికా స్పష్టత ఇవ్వలేకపోతోంది. కాగా ఓ చిన్న పడవలో నిరాయుధులైన మత్స్యకారులు ప్రయాణిస్తుంటే వారిపై క్షిపణులు, అణ్వాయుధాలు ప్రయోగించి చంపడం మానవతపై జరిగిన నేరమేనని వెనిజులా అటర్నీ జనరల్‌ తరేక్‌ విలియమ్‌ సాబ్‌ ధ్వజమెత్తారు. దీనిపై విచారణ జరపాలని ఐరాసను కోరారు.కరేబియన్‌లో అమెరికా భారీగా నౌకా దళాన్ని మోహరించడం చూస్తుంటే వెనిజులా భూభాగంపై దాడికి అది సమాయత్తమవుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా బెదిరింపుల నేపథ్యంలో వెనిజులా తన లా ఆర్చిలా దీవిలో మూడు రోజుల పాటు సైనిక విన్యాసాలు నిర్వహించింది. మాతృభూమిని కాపాడుకునేందుకు సైన్యంలో చేరాలని దేశాధ్యక్షుడు నికొలస్‌ మదురో ప్రజలకు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -