ప్రణాళికలతోనే సరిపెడుతున్న అధికారులు
జాడలేని కొనుగోలు కేంద్రాలు
మార్కెట్లకు చేరుతున్న పంట
అకాల వర్షాలతో ఆందోళన
35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా
మిల్లుల్లో కొనుగోళ్లు షురూ..
యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి. పంట మార్కెట్లకు చేరుతోంది.. ధాన్యం రాశులు పోగుబడుతున్నాయి..కానీ ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. మరోవైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఎప్పుడు వర్షం, వడగళ్లు పడతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రయివేట్‌గా మిల్లుల్లో కొనుగోళ్లు మాత్రం ప్రారంభమయ్యాయి. మిల్లుల్లో ధాన్యం అమ్మే రైతులు బోసన్‌కు నోచుకోకుండా పోతున్నారు.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయప్రతినిధి
వరి పంట సాగులో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా తొలిస్థానంలో ఉంది. ఈ యాసంగి సీజన్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో దాదాపు 13.72 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. ఉమ్మడి జిల్లా పరిధిలో 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని అధికారుల అంచనా.. ఈ దిగుబడులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాం గం సిద్ధమైంది. కోతలకు రెండు నెలల ముందుగానే అధికారులు కొనుగోళ్లకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయినప్పటికీ నేటకీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. 15 రోజులుగా కోతలు ప్రారంభమై ఐకేపీ కేంద్రాల కోసం రైతులు ధాన్యాన్ని ఆరబోసుకొని ఎదురుచూస్తున్నారు. వానాకాలం పంట కోసం ఉమ్మడి జిల్లాలో 1068 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తెరచుకోని కేంద్రాలు
రెండుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసిన అధికారులు.. కొనుగోలు కేంద్రాలను తక్షణం ప్రారంభించాలనే విషయాన్ని గాలికొదిలేశారు. నల్లగొండ జిల్లాలో యాసంగిలో 4.91 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 6 లక్షల మెట్రిక్ టన్నులు మిల్లర్లు కొనుగోలు చేస్తారని, 8 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని లెక్కలు వేశారు. అందుకోసం 383 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయినా ఇంకా తెరచుకోలేదు. జిల్లాలో 133 మిల్లులను గుర్తించినట్టు సమాచారం. అయితే ఏడు మిల్లులు ప్రస్తుతం బ్లాక్ లిస్ట్ ఉన్నాయి.
మిల్లుల్లో కొనుగోళ్లు షురూ..
నాగార్జునసాగర్ ఆయకట్టు మొదటి జోన్ పరిధిలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 రోజుల కిందట ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంత పరిధిలో సుమారు 4.32 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ప్రధానంగా నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో కలిపి 3 లక్షలకుపైగా ఎకరాల్లో సాగు చేశారు. ప్రభుత్వ కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం పోసేందుకు రైతులు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు.
పంటను కోసిన వెంటనే నేరుగా ట్రాక్టర్లలో నింపి మిల్లులకు తరలిస్తున్నారు. మిర్యాలగూడ ప్రాంతంలోని రైస్ మిల్లుల్లో ధాన్యం క్వింటాకు రూ.2,500 నుంచి రూ.2,600 వరకు ఇస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మద్దతు ధర క్వింటాకు ఏ గ్రేడ్‌కు రూ.2,203, సాధారణ రకం రూ.2,183 ఉంది. ఐకేపీ కేంద్రాల్లో విక్రయిస్తే ప్రభుత్వం అదనంగా బోనస్ రూ.500 చెల్లిస్తుంది. అయితే, ఐకేపీ కేంద్రాలకు తరలిస్తే ధాన్యం రోజుల తరబడిగా ఆరబెట్టాలి. కూలీలు, రవాణా వంటి కారణాలతో కొందరు అన్నదాతలు నేరుగా మిల్లులకు తరలిస్తున్నారు.
మిల్లర్లతో తప్పని తిప్పలు
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం ఒక ఎత్తు అయితే.. ఆ ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించడం, వారి నుంచి ముందస్తుగా బ్యాంకు గ్యారంటీ తీసుకోవడం అధికారులకు తలకు మించిన భారంగా మారుతోంది. మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇవ్వడంలో ముందుకు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో ఆలస్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. బ్యాంకు గ్యారంటీ లేకుండా ధాన్యాన్ని మిల్లర్లకు అప్పజెప్పితే సీఎంఆర్ తిరిగి ఇచ్చేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా విలువ చేసే సీఎంఆర్ ప్రభుత్వానికి రావాల్సి ఉంది.
పదిరోజుల నుంచి ఎదురు చూస్తున్నాం
-తరాల పద్మ, అక్కెనపల్లి, నార్కట్‌పల్లి మండలం
నేను 15 ఎకరాల్లో సాగు చేసిన పైరును కోసి ధాన్యాన్ని పది రోజుల కింద గ్రామంలోని ఐకేపీ కేంద్రానికి తీసుకొచ్చి ఆరబోస్తున్నాం.. ప్రభుత్వం రంజాన్ తర్వాత కొనుగోళ్లు ప్రారంభిస్తామని ప్రకటించి పట్టించుకోవడం లేదు. నిత్యం ఆరబోయడం, టార్ఫాలిన్లతో కప్పడం చేస్తున్నాం. ఎప్పుడు వర్షం వస్తుందోనని భయంతో వరికుప్పల వద్ద రాత్రింబవళ్లు గడుపుతున్నాం.



