- Advertisement -
- – జీలుగు, జనుము అందేనా?
– 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం
– మండలంలో వరి సాగుకే రైతుల మొగ్గు
నవతెలంగాణ – మల్హర్ రావు - వ్యవసాయ పొలంలో భూసారాన్ని పెంచే పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము విత్తనాల కోసం రైతులు ఎదురుచూ స్తున్నారు. యాసంగి సాగు ముగియడంతో వర్షాకాలం సాగుపై రైతులు దృష్టి సారించారు. ఈనెల 25న ప్రారంభమయ్యే రోహిణి కార్తె నుంచి వ్యవసాయ పనులు ప్రారంభిస్తే పంటల దిగుబడి ఆశించిన స్థాయిలో వస్తుందని రైతుల నమ్మకం. ఇప్పటికే దుక్కులు దున్నుతున్నారు. కానీ ప్రభుత్వం అందించే సబ్సిడీ జిలుగు, జనుము విత్తనాలు రాకపోవడంతో దిగులు చెందుతున్నారు. మండలంలో దాదాపు 13,215 వేల ఎకరాల సాగు భూమి ఉండగా యాసంగిలో 8,200 ఎకరాల్లో వరి సాగు, 4100 ఎకరాల్లో పత్తి సాగు చేశారు.ప్రస్తుతం వర్షాకాలంలో 10 వేల పై చిలుకు ఎకరాలలో వరుసాగు, 5000 ఎకరాల్లో పత్తి సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వరిసాగు కోసం 4,000 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉండగా ప్రైవేట్ సంస్థలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ ముందుగా భూసారాన్ని పెంచేం దుకు జీలుగ, జనుము పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసి ఏపుగా పెరిగిన తర్వాత పొలంలోనే దున్ని మురుగబెడతారు. దీంతో భూసారం పెం పొందుతుందని రైతులు ఆశాభావం.
- జీలుగు, జనుము విత్తనాల కొరత..
- మండలంలో 280 క్వింటాళ్ల జీలుగతో పాటు 60 క్వింటాళ్ల జనుము విత్తనాలు సబ్సిడీపై ప్రభుత్వం అందించేందుకు వ్యవసాయ శాఖ మండల అధికారులు ప్రతిపాదనలు పంపినట్లుగా సమాచారం. ఇంకా రాకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. బహిరంగ మార్కెట్లో పచ్చిరొట్ట ఎరువులు కొరత ఉంది.. దొరికిన ఎక్కువ రేటు ఉందని రైతులు వాపోతున్నారు. పశువుల పేడ ఎరువులు కూడా పొలాల్లో చల్లుకుంటున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జీలుగ, జనుము విత్తనాలను అందించాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.
- Advertisement -