Sunday, January 11, 2026
E-PAPER
Homeకవితజాగో... జర భద్రం..

జాగో… జర భద్రం..

- Advertisement -

కొన్ని లక్షణాల బట్టి
ఉన్న క్షపణుల సంఖ్య బట్టి
కళ్లు కుళ్లు కునే చేతులతో
చేతల్లో చర్నాకోలా చేబట్టిన
అమరికలో సామ్రాజ్య వాదపు
గ్రద్దచూపులున్నోడే,
బక్కదేశాలపై ఉక్కు పాదాలతాడన
కావించేవాడే అమెరికా అధ్యక్షడౌతుంటాడు
ఉగ్రవాదుల కేరాఫ్‌ అడ్రస్సౌతాడు
గుర్తుంతుందా ఆ మధ్య
సద్దాంహుసేన్ను ఆంక్షలతో ఇరుకున పెట్టి
కరుకు రక్కసిలా రక్తం జుర్రుకున్నాడు
ఖతర్నాక్‌ చేష్టలకు విశ్వవిఖ్యాత
ప్రఖ్యాత మారణాయుధాల
నిరంతర వాడకందారుడు
తన అవసరాల నిమిత్తం పక్కవాడి
పడకగదిలోకి సైతందూరటంలో సిద్ధహస్తుడు
విస్తరణాకామక్రీడను అమలుచేయగలోడు
దగుల్బాజీ కోరికలు పుట్టినప్పుడల్లా
పచ్చగా వున్నదేశంపై
తన హస్త లాఘవం చూపించెటోడు
అమానవీయ పనులకు
దిగజారుతున్న విలువలకు
పెంటగాన్‌ సాక్షగా పెంటనైనా నాకేవాడు
బహు తెంపరి ట్రంపు
టెంపరుకు పెద్ద ప్రతీక
అలవాటు కాబట్టి చమురుకోసం
చిప్ప పట్టుకుని దేవురించడమెందుకని
తన నైజానికి అద్దంపట్టేలా
వెనుజులా దేశాధ్యక్షకుటుంబపై
ఇనుప వలవిసిరిన అగ్రజుడు
తన ధర్మం విడిచిన ఆగ్రహ విగ్రహంలా
కిరాతక రుద్ర రూపాన్ని
సభ్య ప్రపంచం ఛీ కొడుతున్నా
సిగ్గులేక నీతులు వల్లిస్తూ
పనిలో పనిగా
దుష్ట దష్టి సారిస్తు మన దేశంలో సైతం
తుంపులు పెట్టగల సమర్థుడు
సమగ్ర కార్యాచరణకు
నూనె బావుల ఎముకలతో పాచికలు ఆడే
మాయా జూదప్రవీణుడైన
శకుని మించిన అంశతో
దెబ్బకొడతాడెప్పుడో అమెరికా అధ్యక్షడు
మన కషాయ కాషాయ పాలకులనే బెదిరించి
తన పబ్బం గడపుకోడానికి వెరవనివాడు
మన దేశాన్ని మనకు కాకుండా చేయగలోడు
ఇకనైనా అమెరికా మోజు వదులుకోండి
డాలర్ల సంపాన కంటే
దేశ సమగ్రత గురించి యోచించండి
కక్షగట్టి మరో దేశాన్ని లొగదీసుకునేందుకు
అధ్యక్షడిని, భార్యను బందీలనుచేసిన దుర్మార్గం
యుద్ధఖైదీలకుండే చట్టరక్షణలేకపోవడం
సామ్రాజ్య వాదానికి పరాకాష్ట
ఇదేదో దేశపు సమస్య కదా
మనకెందుకని ఉదాసనంగా వుంటే
ఆ కబంధహస్తాలు మనల్ని
కబళిస్తాయని తెలుసుకుని మసలుకోవాలి
జర భద్రం
ఇసుమంత నిర్లక్ష్యంతో నిర్లిప్తతంగా వుంటే
మన కొంప కొల్లేరౌతుంది
కళ్లు తెరవండి, కళ్లెం వేయండి
గళం సవరించుకుని తలెత్తుగు నిలబడేలా
పిడికళ్ళు బిగించండి
జాగో…జర భద్రం..
– కపిల రాంకుమార్‌, 9849535033

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -