Sunday, March 15, 2026
E-PAPER
Homeఅంతరంగంయుద్ధం

యుద్ధం

- Advertisement -

యుద్ధం అంటే అందరూ గెలుపు ఓటములు మాత్రమే చూస్తారు. ఆ యుద్ధంలో ఈ రాజు గెలిచాడు. ఈ యుద్ధంలో ఆ రాజు ఓడిపోయాడని చరిత్రలో రాసుకుంటారు. కానీ యుద్ధం తర్వాత మిగిలిపోయే కన్నీళ్లు.. బాధలు ఎవ్వరూ రాయరు. వాటిని పట్టించుకోరు. కార్గిల్‌ యుద్ధంలో మనం గెలిచామని సంబరాలు చేసుకుంటాం. కానీ అదే యుద్ధంలో చనిపోయిన సైనికుల్ని ఒక్కరోజు తర్వాత మళ్లీ స్మరించుకోము. ఏ యుద్ధంలోనైనా దేశాధినేతలే గెలుస్తారు. సామాన్య సైనికులు అశువులుబాస్త్తారు. కుటుంబాలకు కన్నీళ్లే మిగులుస్తారు. ఇదే యుద్ధం వెనక ఉండే అసలైన కన్నీటి గాధ.
యుద్ధాన్ని ఎప్పుడూ ఎవ్వరూ ఆహ్వానించకూడదు. అన్ని రకాల ప్రత్యామ్నాయాలు విఫలమై అనివార్య పరిస్థితుల్లో పోరుకు వెళ్లాలి. కానీ ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు మాత్రం అలాంటివి కాదని చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అనుమానాలు, అపోహలు, అపార్థాలతోనే పెను యుద్ధాలు జరుగుతున్నాయి. ఆయుధాలున్నాయి కదా అనో, సైనిక బలాన్ని చూసుకునో.. అకారణంగా సమరం చేసే పోకడ పెరగడం ప్రపంచానికి చేటు చేస్తోంది. అగ్రదేశ అహంకారంతో ప్రపంచం అట్టుడికిపోతోంది. గత శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగి లక్షల మంది మరణించినా కూడా ప్రపంచంలో ఆధిపత్య పోరు ఆగలేదు. కొన్ని దేశాల్లో రావణకాష్టాన్ని మిగిల్చాయి.
కొత్తగా యుద్ధాలు చేసేటపుడు అంతకు ముందు పోరు చేసి ఏమైనా సాధించామా లేదా అనేది ఎవరికి వారే అవలోకనం చేసుకోవాలి. కానీ ఆధునిక ప్రపంచంలో ఆ పరిణతి కనిపించడం లేదు. ఎలాగోలా యుద్ధం చేసేసి ఏదో సాధించేయాలనే తాపత్రయమే కానీ నిజానికి ఏమీ సాధించలేమనే సంగతి గుర్తించడానికి అగ్ర అహంకారం ఇష్టపడడం లేదు. యుద్ధం వల్ల గాజాలో జరిగిన మారణహౌమం ఇంకా మన కండ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఇప్పుడు అమెరికా కుట్రలకు ఇరాన్‌ రగిలిపోతోంది. పసిపిల్లలు, మహిళలు ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఇలా యుద్ధం నిరంతరం సంక్షోభానికి దారితీస్తోంది. బుల్లెట్లు, మందుగుండు, క్షిపణులు కూడా దీర్ఘకాలిక యుద్ధాలుగా మారి ప్రపంచం గుండెలపై కుంపటి రగిలిస్తున్నాయి.
యుద్ధం వాంఛనీయం కాదని నాటి అశోకుడు, అలెగ్జాండర్‌ నుంచి నేటి వరకు చాలా మంది చెప్పారు. అయినా సరే అగ్రనేతలు చెవికెక్కించుకోవడం లేదు. పైగా యుద్ధాలు చేసి ప్రజల దృష్టిలో హీరోలుగా వెలిగిపోవాలనే యావ పెంచుకుంటున్నారు. ఒక పక్క యుద్ధాలు సృష్టిస్తూనే శాంతికోసం తపిస్తున్నామంటూ మాయమాటలు వల్లిస్తున్నారు. తమ స్వప్రయోజనాల కోసం యుద్ధాన్ని ఆయుధంగా చేసుకుంటున్నారు. వేల మంది సామాన్యుల ప్రాణాలు బలితీసుకుంటున్నారు. లక్షల మంది కుటుంబ సభ్యలకు తీరని శోకం మిగిల్చుతున్నారు. యుద్ధం వల్ల ఇన్ని రకాల నష్టాలు కలుగుతున్నా అసలు నిజాలకు సమాధి కడుతున్నారు.
యుద్ధం అంటే సరదా కాదు. ప్రాణాలతో జూదం అనే సంగతి గుర్తించాలి. అలా కాకుండా ఎవరేమి అనుకున్నా మా దారి మాదే అన్నట్టుగా మొండి పట్టుదలకు పోయి ప్రపంచంలో ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రపంచ శాంతికి సవాలు విసరకుండా ఈ ప్రపంచం నా మాతృభూమి అనే భావన పెంపొందించుకోవాలి. యుద్ధాలను విరమించాలి. ప్రపంచ శాంతికై పాటుపడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -