Monday, March 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంయుద్ధం బూచీ.. పడిపోయిన పసుపు ధర

యుద్ధం బూచీ.. పడిపోయిన పసుపు ధర

- Advertisement -

వారం వ్యవధిలో రెండు వేల వ్యత్యాసం గరిష్ట ధర కొందరికే..
ప్రస్తుతం క్వింటా రూ.10 నుంచి రూ.11 వేలే
నష్టపోయామంటున్న పసుపు రైతులు
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

పసుపు ధర కుదుపులకు లోనవుతోంది. పంట ఉత్పత్తి మార్కెట్‌కు వచ్చిన ప్రారంభంలో పలికిన ధర క్రమం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పేరుకు ఈ-నామ్‌ ద్వారా ఆన్‌లైన్‌ యాక్షన్‌ కింద కొనుగోళ్లు జరుగుతున్నా.. మార్కెట్‌ యార్డుకు పసుపు పోటెత్తుతుండటంతో ఖరీదుదారులు సిండికేట్‌ అవుతున్నారు. క్రమంగా ధరను తగ్గిస్తున్నారు. ఇందుకోసం అందివచ్చిన అవకాశాలను ఉపయోగించు కుంటున్నారు. గత నెల చివరలో కురిసిన వర్షం కారణంగా ధర తగ్గినట్టు చెప్పగా.. తాజాగా ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయిల్‌ యుద్ధం కారణంగా ధరలు తగ్గుతున్నట్టు చెబుతుండటం గమనార్హం.
నిజామాబాద్‌ జిల్లా పసుపు పంట సాగుకు పెట్టింది పేరు. క్వింటా పసుపు అమ్మి తులం బంగారం కొనుగోలు చేసిన చరిత్ర ఇక్కడి రైతులది. కానీ ప్రస్తుతం పెట్టుబడులు పెరగడం, దిగుబడి తగ్గడంతో పాటు మార్కెటింగ్‌ మాయాజాలంతో పెట్టిన ఖర్చుకు.. వస్తున్న ధరకు పొంతన లేకుండా పోతోంది. ఒక సారి కాకపోతే మరోసారైనా ధర రాకపోదా అన్న ఆశతో పలువురు సాగు చేస్తున్నా.. మరికొంత మంది సాహసం చేయలేక ఇతర పంటల వైపు మళ్లారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో పసుపు పంట సాగు 22 వేల ఎకరాలకు తగ్గింది. ఎకరా విస్తీర్ణంలో సాగుకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షలు ఖర్చు అవుతుండగా వచ్చే ధరల్లో స్థిరత్వం లేకపోవడంతో పెట్టుబడులు, చేసిన శ్రమకు ఫలితం లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. పసుపు సాగు ‘లాభం లేని ఖర్చు’ అంటూ ఊసూరు మంటున్నారు.

వారం వ్యవధిలోనే 2 వేల వ్యత్యాసం
జనవరిలో పసుపు తవ్వడం ప్రారంభించి ఉడకబెట్టి, ఆరబెట్టి పాలిషింగ్‌ చేసి ఫిబ్రవరి నెల నుంచి మార్కెట్‌ యార్డుకు తరలిస్తుంటారు. మే నెల వరకు కొనుగోళ్లు జోరుగా సాగుతుంటాయి. అయితే ప్రారంభంలో క్వింటాకు అధిక ధర పలకగా.. క్రమంగా తగ్గుతూ వస్తుంది. వారం వ్యవధిలోనే ఏకంగా రూ.2 వేల ధర తగ్గడం గమనార్హం. ప్రారంభంలో రూ.13 వేలు పలకగా.. వర్షం కురవడంతో రూ.12 వేలకు తగ్గింది. అయితే ప్రస్తుతం రూ.11 వేలకు పడిపోవడం గమనార్హం. ఇందుకు ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయిల్‌ యుద్ధం నేపథ్యంలో ఎక్స్‌పోర్ట్‌ ఆగిపోయినట్టు చెబుతున్నారు. దీంతో డిమాండ్‌ తగ్గి ధరలు తగ్గిపోతున్నట్టు రైతులకు వెల్లడిస్తున్నారు.
పంట నిరంతరంగా మార్కెట్‌కు వస్తుండటంతో అదును చూసి ఖరీదుదారులు సిండికేట్‌గా మారి కోట్‌ చేసే ధరను తగ్గిస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలతో పంటకు రోగం తగిలి దిగుబడి తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు ధరలు తగ్గడంతో తొమ్మిది నెలల శ్రమకు, పెట్టిన పెట్టుబడులు రాలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఇలానే కొనసాగితే పసుపు సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం లేకపోలేదు.

మార్కెట్‌కు వస్తే ఖర్చులే

ఈసారి వర్షాలతో పంట దిగుబడి తగ్గింది. అయితే డిమాండ్‌ పెరిగి ధర పెరుగుతుందని ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు మా పంటకు రూ.11 వేలు మాత్రమే పలికింది. ఇంత తక్కువ ఎందుకుంది అంటే యుద్ధం అంటున్నారు. మార్కెట్‌కు పంట తెచ్చినమంటే లోడ్‌, అన్‌లోడ్‌, కుప్పలు ఎత్తినందుకు, కాంటా పెట్టినందుకు, శాట కొట్టినందుకు ఇలా అనేక ఖర్చులుంటాయి. ఇది వరకే దిగుబడి తగ్గింది. ఇప్పుడు రేటు తగ్గింది. ఖర్చులు మాత్రం ఏటికేడూ పెరుగుతున్నాయి.
– శెట్టి మారుతి. జానకంపేట్‌. వేల్పూర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -