సెన్సెక్స్ మరో 1100 పాయింట్లు డౌన్
మూడు రోజుల్లో రూ.21 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబయి : పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ స్టాక్ మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. వరుసగా మూడో సెషన్‌లోనూ కుప్పకూలాయి. బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు 1 శాతం పైగా పతన మవడంతో ఇన్వెస్టర్ల సంపద మరో రూ.9.1 లక్షల కోట్ల మేర హరించుకుపోవడంతో బీఎస్‌ఈ లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.447.18 లక్షల కోట్లకు పరిమితమయ్యింది. మూడు సెషన్లలో దాదాపు రూ.21 లక్షల కోట్ల సంపద తుడుచుకుపెట్టుకుపోయింది. దీంతో ఆ మొత్తం ఇన్వెస్టర్లు మదుపు సంపదను కోల్పోయినట్లయ్యింది. బుధవారం సెషన్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,122.66 పాయింట్లు లేదా 1.40 శాతం నష్టపోయి 79,116కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 385.20 పాయింట్లు లేదా 1.55 శాతం పతనమై 24,480కు క్షీణించింది. ఫిబ్రవరి 26 నుంచి ఇప్పటివరకు సెన్సెక్స్ ఏకంగా 3,805 పాయింట్లు లేదా 4.6 శాతం, నిఫ్టీ 1,191 పాయింట్లు లేదా 4.7 శాతం కోల్పోవడం మార్కెట్ తీవ్రతకు నిదర్శనం.
అంతర్జాతీయంగా అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియడం, ఐరోపాలో సహజ వాయువు ధరలు ఏకంగా 40 శాతం పెరగడం ఇన్వెస్టర్లలో ఆందోళనను రెట్టింపు చేశాయి. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే రూపాయి విలువ పడిపోవడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు నిధులను వెనక్కి తీసుకునే అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ వంటి సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 81 డాలర్లకు చేరింది. చమురు ధరలో ప్రతి ఒక్క డాలరు పెరుగుదల భారత్ వార్షిక దిగుమతి బిల్లును సుమారు 2 బిలియన్ డాలర్లకు పెంచుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చమురు ధరలు 10 శాతం పెరిగితే దేశంలో ద్రవ్యోల్బణం 40-80 బేసిస్ పాయింట్లు పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల పెయింట్స్, లూబ్రికెంట్స్, ఏవియేషన్, కెమికల్ వంటి రంగాల ముడిసరుకు ఖర్చులు పెరిగి వారి లాభాలపై తీవ్ర ఒత్తిడి పడనుంది.



