30మందికిపైగా పౌరులు, సైనికులు మృతి
ముదురుతున్న సరిహద్దు వివాదం
ఫెనోమ్‌పెన్ : థాయ్‌లాండ్-కంబోడియా మధ్య కొన్నేళ్లుగా సాగుతున్న సరిహద్దు వివాదం ఇటీవల తీవ్రమైంది. ఫలితంగా ఇరుదేశాలకు చెందిన సైన్యాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. అయితే ఘర్షణలు క్రమంగా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. తాజాగా థారులాండ్‌లోని ట్రాట్ ప్రావిన్స్ కంబోడియాలోని ప్రుశాట్ ప్రావిన్స్ సరిహద్దుల్లో ఇరు దేశాలకు చెందిన బలగాలు దాడులు చేసుకున్నాయి. రక్షణాత్మక ధోరణిలోనే దాడులు చేశామని ఇరుదేశాలు ప్రకటించుకున్నాయి. మూడు రోజులుగా సాగుతున్న ఈ ఘర్షణల కారణంగా ఇరువైపుల 30 మందికిపైగా పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. లక్షా ముప్పై వేల మంది ప్రజలు స్వస్థలాలు వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఐరాస భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. సంయమనం పాటించి శాంతిచర్చలు జరపాలని ఇరుదేశాలకు సూచించింది. తమ భూభాగంలో కంబోడియా సైన్యం మందుపాతర అమర్చడం వల్ల ఇద్దరు సైనికులు గాయపడ్డారని థాయ్‌లాండ్ అంబాసిడర్ భద్రతామండలి దృష్టికి తీసుకె ళ్లారు. అయితే థాయ్‌లాండ్ వాదనలను కంబోడియా ఖండించింది. రెండుదేశాలు మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తామని మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తెలిపారు. మలేషియా ప్రతిపాదనను కంబోడియా స్వాగతించింది.
కవ్వింపు చర్యలు
సైనికులు, ఆయుధాలను సరిహద్దులకు తరలిస్తూ థాయ్‌లాండ్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని కంబోడియా సైన్యం ఆరోపించింది. యుద్ధ సన్నద్ధతను ప్రదర్శిస్తూ రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడింది. థారులాండ్ చర్యలను అంతర్జాతీయ సమాజం ఖండించాలని కోరింది. థాయ్‌లాండ్ మాత్రం భిన్నంగా స్పందించింది. కంబోడియాతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అయితే సరిహద్దుల్లో దుందుడుకు చర్యలకు కంబోడియా స్వస్తి పలికాలని షరతు విధించింది.
ఇంతకీ ఏమిటీ వివాదం?
వాస్తవానికి ఈ ఘర్షణలకు సరిహద్దు వివాదాలే కారణమని చెబుతున్నా, సరిహద్దుల్లోని హిందూ దేవాలయాల కోసం ఇరుదేశాలు ఎన్నో ఏండ్లుగా కొట్టుకుంటున్నాయి. ప్రధానంగా ప్రముఖ ఆలయాలు ఉన్న ప్రీహ్ విహార్, ట మోన్ థోమ్, ట మ్యూన్ థోమ్ ఉన్న పర్వతాలు, అరణ్యాలు కలగలిసిన ప్రాంతాల కోసం దశాబ్దలుగా ఇరుదేశాల మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. ఈ ఆలయాల్లో శివలింగం, సంస్కృత లిపిలో శాసనాలు, హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయి.
థాయిలాండ్, కంబోడియా మధ్య 508 మైళ్ల సరిహద్దు ఉంది. దీనిలో అత్యధిక భాగాన్ని ఫ్రాన్స్ పాలన కింద ఉన్నప్పుడే గుర్తించారు. రెండు దేశాలు శాంతియుతంగా కలిసి ఉంటున్నప్పటికీ, సరిహద్దుల్లో మాత్రం తరచూ ఘర్షణలతో రగులుతున్నాయి. వీటిల్లో 9వ శతాబ్దానికి చెందిన ప్రీహ్ విహార్ కీలకమైంది. ఈ శివాలయాన్ని ఖెమర్ పాలకులు నిర్మించారు. డాంగ్రెక్ పర్వతాల శిఖరం థారులాండ్‌కు అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ ఆలయం కంబోడియాకు చెందుతుందని 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దానిని థాయ్‌లాండ్ అంగీకరించింది. కానీ, ఆ దేవాలయం కేంద్రంగా స్థానిక సెంటిమెంట్లు తరచూవివాదాలకు కారణమవుతున్నాయి. కంబోడియా విజ్ఞప్తి మేరకు 2008లో ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీనిని థాయ్‌లాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది. కంబోడియానాడు చూపిన మ్యాప్‌లో 4.6 చదరపు మైళ్లను ఆక్రమించుకొన్నట్లు ఆరోపించింది.
అటు థాయ్‌లాండ్ దేశ పరిధిలోని సురిన్ ప్రావిన్స్‌లోని ట మోన్ థోమ్, ట మ్యూన్ థోమ్ ప్రాంతాలు కూడా ఇరుదేశాల మధ్య వివాదాస్పద ప్రదేశాలుగా ఉన్నాయి. థాయ్‌లాండ్ సురిన్ ప్రావిన్సులోని ప్రసాత్ ట మోన్ థోమ్ అనే మరో శివాలయం కోసం కూడా రెండు దేశాలు గొడవ పడుతున్నాయి. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ శివాలయం తమకే చెందుతుందని కంబోడియా వాదిస్తోంది. అందుకు థాయ్‌లాండ్ అంగీకరించట్లేదు. శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాలు రెండు దేశాల మధ్య వివాదంతో మరోసారి తెరపైకి వచ్చాయి.
థాయిలాండ్- కంబోడియా మధ్య యుద్ధమేఘాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES