Wednesday, March 18, 2026
E-PAPER

మాటల యుద్ధం

- Advertisement -

– అధికార, ప్రతిపక్షపార్టీల వాదనలతో హీటెక్కిన అసెంబ్లీ
– కాంగ్రెస్‌ ఎన్నికల హామీలపై ప్రశ్నించిన కేటీఆర్‌
– తిప్పికొట్టిన అధికారపక్షం
– సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మంత్రుల ఆగ్రహం
– బ్యాంకు లింకేజితో కలిపి రూ.57 వేల కోట్ల వడ్డీలేని రుణమిచ్చాం: భట్టి
– వడ్డీలేని రుణాలు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. లేకుంటే భట్టి చేయాలి : కేటీఆర్‌
– రూ. 56 వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం : మంత్రి శ్రీధర్‌బాబు
– మహిళలంటే ఎందుకంత చులకన? : మంత్రి సీతక్క
– స్పీకర్‌ అందరి హక్కులనూ కాపాడాలి : తలసాని
– గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో గరంగరం


నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యులు అధికార పక్షం తప్పులను ఎత్తిచూపితే, బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను అధికార పక్షం ఎండగట్టింది. మంగళవారం అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. కాంగ్రెస్‌ సభ్యులు బాలూనాయక్‌ తీర్మానాన్ని ప్రతిపాదించగా, విప్‌ ఆది శ్రీనివాస్‌ బలపర్చారు. వారిద్దరూ తీర్మానంపై మాట్లాడారు. చర్చలో భాగంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కే తారకరామారావు (కేటీఆర్‌) కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలోని అంశాలను చదువుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. ఆరుగ్యారంటీల అమలుపై ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎవరి వాదనలు వారు వినిపించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఊదరగొట్టిందంటూ కేటీఆర్‌ చేసిన విమర్శలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మహిళా సంఘాలకు వడ్డీ చెల్లించకుండా ఎగొట్టారంటూ గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. కేటీఆర్‌ విమర్శలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి
దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క ధీటుగా సమాధానం చెప్పారు.

జీరో వ్యాల్యూ సీఎం…420 సర్కార్‌ : కేటీఆర్‌
‘గవర్నర్‌ ప్రసంగానికి విశ్వసనీయత, గౌరవం లేదు. సీఎం సంతకానికి జీరో వ్యాల్యూ. ప్రజల దృష్టిలో కాంగ్రెస్‌ సర్కార్‌కు జీరో వ్యాల్యూ. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి సంతకం చేసిన ఫైలు ఎక్కడకు పోయింది? ఆ ఫైలును వెలికితీసేందుకు సిట్‌ వేయాలి’ అని బీఆర్‌ఎస్‌ సభ్యులు కల్వకుంట్ల తారకరామారావు అసెంబ్లీలో డిమాండ్‌చేశారు. ఆరు గ్యారంటీల విషయంలో రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం శాసనసభలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. గవర్నర్‌ ప్రసంగం తప్పులతడక అని విమర్శించారు. ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు అన్నట్టుగా కాంగ్రెస్‌ పాలన ఉందన్నారు. కమీషన్లు, డైవర్షన్లు, బుల్డోజర్ల చప్పుళ్లు, అప్పులు, బూతుల మోతలు తప్ప ఏమీ లేవని ఎద్దేవా చేశారు. అప్పుల్లో తెలంగాణ ఆల్‌టైం రికార్డు సృష్టించిందని విమర్శించారు. 420 హామీల మ్యానిఫెస్టో అమలు ఏమైంది? ఒక్కో కుటుంబానికి రూ.2.50 లక్షలు ఎక్కడ అందుతున్నాయి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పెన్షన్లు పెంచి ఇవ్వనందుకు ధన్యవాదాలు తెలపాలా? నిరుద్యోగులకు భృతి, ఉద్యోగాలు భర్తీ విస్మరించినందుకు ధన్యవాదాలు తెలపాలా? అని నిలదీశారు. ఎన్నికలకు ముందు ప్రచారంలో రేవంత్‌రెడ్డి దానకర్ణుడిలా మాట్లాడి, ఓట్లు వేశాక కుంభకర్ణుడిలా నిద్రిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా 2014-23 మధ్య కాలంలో ఇచ్చిన రేషన్‌కార్డుల గురించి ప్రస్తావించారు. గవర్నర్‌ ప్రసంగంలోనే రెండున్నరేండ్ల పాలనలో ఐటీ రంగంలో ఏడు వేల ఉద్యోగాలు తగ్గిపోయాయని ఉందని ఎత్తిచూపారు. ఐటీ ఎగుమతులు, గ్లోబల్‌ సమ్మిట్‌లో పెట్టుబడుల ఒప్పందాలపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతున్నదని విమర్శించారు. సీఎం, మంత్రులు నిధులు తేవడానికి ఢిల్లీకి వెళ్లడం లేదనీ, ఢిల్లీకి వెళ్లి నిధులు ఇచ్చి వస్తున్నారని ఆరోపించారు. మహిళలకు రూ. 57వేల కోట్ల వడ్డీలేని రుణం ఇచ్చినట్టు కాగితం చూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానంటూ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. లేదంటే ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తన పదవి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. మూడుసార్లు రైతుబంధు ఆపారని విమర్శించారు. వరికి బోనస్‌ విషయంలో కొర్రీలు పెట్టిన కాంగ్రెస్‌…మిగతా పంటలకు బోనస్‌ ఇవ్వడం లేదన్నారు. మహిళలకు రూ. 2500, ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని కోరారు. గురుకులాల్లో విషాహారం తిని రెండు వందల మందికిపైగా పిల్లలు చనిపోయారని చెప్పారు. విదేశీ విద్యా నిధులను ఆపేసి విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున భూముల పందేరానికి తెరలేపిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రూ. 16 వేల కోట్లతో మూసీ అభివృద్దికి ప్రణాళికలు సిద్ధం చేస్తే, కాంగ్రెస్‌ సర్కారు దాన్ని రూ.1.5 లక్షల కోట్లకు అంచనా వేసిందని చెప్పారు. రియల్‌ ఎస్టేట్‌ సెటిల్‌మెంట్ల కోసం పేదల ఇండ్లను కూల్చుతున్నారని ఆరోపించారు. ఫ్యూచర్‌ సిటీ పేరుతో గ్రాఫిక్స్‌ మాయాజాలం చేస్తున్నారన్నారు. జర్నలిస్టులపైనా, సోషల్‌మీడియాపైనా అణిచివేతకు పాల్పడుతున్నారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ఆనవాళ్లు చెరిపేయాలని సర్కారు భావిస్తోందనీ, అది సాధ్యం కాదని స్పష్టం చేశారు.

మహిళలు అంటే ఎప్పుడూ చులకనే : మంత్రి సీతక్క
బీఆర్‌ఎస్‌కు మహిళలు అంటే ఎప్పుడూ చులకనే అని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. బ్యాంక్‌ లింకేజి ద్వారా మహిళా సంఘాలకు రూ. 57వేల కోట్లు వడ్డీలేని రుణం ఇచ్చామన్నారు. 99శాతం మహిళా సంఘాలు తీసుకున్న అప్పుకు రీపేమెంట్‌ బాగా చేస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభయహస్తం రూ. 3వేల కోట్లు ఎగొట్టిందన్నారు.

ఓపిక తెచ్చుకోండి : మంత్రి కోమటిరెడ్డి
కేటీఆర్‌ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. రేషన్‌ కార్డులు ఇచ్చినందుకు, యంగ్‌ ఇండియా స్కూల్‌ కట్టిస్తున్నందుకు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినందుకు, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నందుకు, సన్నవడ్లు పండించే రైతులకు బోనస్‌ ఇస్తున్నందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలని కేటీఆర్‌కు సూచించారు. తమ ప్రభుత్వం పేదల కోసమే ఉందని స్పష్టం చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్షల కోట్లు రూపాయల అప్పులు చేసిపోతే ఒప్పందాల్లో భాగంగా పదేండ్ల తర్వాత తమ ప్రభుత్వం వడ్డీలు కడుతున్నదనీ, అప్పుల రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు కేటీఆర్‌ తమ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపాలన్నారు. ప్రతిపక్ష సభ్యులు ఓపికగా ఉండాలని హితవుపలికారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టినందుకు రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కంపెనీల ఒప్పందాలపై శ్వేతపత్రం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
బయట ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు తెచ్చి కేటీఆర్‌ చదువుతున్నట్టు ఉందని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. బీఆర్‌ఎస్‌ మాదిరిగా ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కేంద్రం చుట్టూ తిరగట్లేదని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క అడుగు తగ్గి అయినా కేంద్రం దగ్గరకు వెళ్తామని చెప్పారు. తమది జాతీయ పార్టీ అనీ, ఢిల్లీ రాజకీయాలు తప్పనిసరిగా ఉంటాయని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ప్లాప్‌ కాలేదన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌, మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికల్లో ప్లాప్‌ అయింది బీఆర్‌ఎస్‌ పార్టీ అని ఎత్తిచూపారు. ఆయా కార్పొరేట్‌ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం రూ. ఆరు లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నదనీ, త్వరలోనే ఆ ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. చేసుకున్న ఒప్పందాల్లో 35 శాతమే అమలవుతాయని మహారాష్ట్ర ప్రభుత్వ అనుభవం తెలుపుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఐటీ అభివృద్ధి, ఎగుమతులు, ఎంఓయూల విషయంలో సంఖ్యాపరంగా తేడాలుంటే సరిచేసుకుంటామని స్పష్టం చేశారు. ఫార్మాసిటీలో గ్రీన్‌ ఫార్మాకు ప్రాధాన్యత ఇస్తున్నామనీ, ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పామని తెలిపారు. ప్రతి అంశాన్నీ గోబెల్స్‌ను మించి ప్రచారం చేయడంలో కేటీఆర్‌ను మించిన వారు లేరని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మంథనిలోజంట హత్యలకు కారకులెవరని కేటీఆర్‌ను ప్రశ్నించారు. దానిపై సీబీఐ విచారణ జరుగుతోందన్నారు.

మహిళలకు రూ. 57వేల కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చాం : భట్టి
తమ ప్రభుత్వం మహిళలకు రూ.57వేల కోట్ల వడ్డీలేని రుణం ఇచ్చిందని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఇందిరా క్రాంతి పథకం కింద మహిళలకు బీఆర్‌ఎస్‌ వడ్డీలేని రుణాన్ని నిలిపివేసిందని గుర్తుచేశారు. ఉచిత విద్యుత్‌, సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, నియోజకవర్గానికి 3,500 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, రైతులకు రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్‌ వంటి విషయాలేవీ కేటీఆర్‌కు కనిపించట్లేదా? అని ప్రశ్నలు సంధించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాదిరిగా ఇంటికో ఉద్యోగం, దళిత సీఎం, మూడెకరాల భూ పంపిణీ హామీలిచ్చి ప్రజలను మోసం చేయట్లేదన్నారు.

హక్కులను కాపాడాలి : బీఆర్‌ఎస్‌ ఎల్పీ ఉప నేత తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
స్పీకర్‌ అందరి హక్కులను కాపాడాలనీ, అధికార పక్షం వైపు ఉండొద్దని బీఆర్‌ఎస్‌ ఎల్పీ ఉపనేత తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కోరారు. అధికార పక్షం నుంచి గంటన్నరకుపైగా బాలూనాయక్‌, ఆది శ్రీనివాస్‌ మాట్లాడితే తాము సైలెంట్‌గా వింటూ నోట్‌ చేసుకున్నామన్నారు. ఇప్పుడు తమకు మాట్లాడే అవకాశం వచ్చిందనీ, మధ్యలో మంత్రులు జోక్యం చేసుకోవడం సభా మర్యాద కాదని చెప్పారు. ఏమైనా అభ్యంతరాలుంటే మంత్రులుగానీ, డిప్యూటీ సీఎంగానీ, సీఎంగానీ రిప్లరు ఇచ్చే సమయంలో మాట్లాడాలని సూచించారు. తమ హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

స్పీకర్నే ప్రశ్నిస్తారా? : మంత్రి పొంగులేటి
పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌ ఇచ్చిన జడ్జిమెంట్‌ను కూడా ప్రశ్నించే హక్కు సభ్యునిగా తనకు ఉంటుందంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తప్పుపట్టారు. జడ్జిస్థానంలో ఉన్న స్పీకర్‌ను ప్రశ్నించడమంటే కేటీఆర్‌ అహంకారానికి నిదర్శనమన్నారు. నిరంకుశత్వానికి బీఆర్‌ఎస్‌ నేతలు బ్రాండ్‌ అంబాసిడర్లు అని విమర్శించారు. కేటీఆర్‌ వ్యాఖ్యలను స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఖండించారు. జడ్జిమెంట్‌ చదవకుండా అభియోగాలు మోపడం సరైందికాదని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -