Thursday, April 9, 2026
E-PAPER
Homeజాతీయంయుద్ధంతో భారత వృద్ధికి ముప్పు

యుద్ధంతో భారత వృద్ధికి ముప్పు

- Advertisement -

పశ్చిమాసియా ఘర్షణలతో ప్రతికూలతే : ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్ మల్హోత్రా ఆందోళన
కీలక వడ్డీరేట్లు యథాతథం

ముంబయి : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపబోతున్నాయని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌ సంజయ్ మల్హోత్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీజీ) సమావేశం అనంతరం బుధవారం గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధం వల్ల తలెత్తే పరిణామాలను ప్రస్తావించారు. అమెరికా-ఇరాన్‌ మధ్య ఘర్షణ వాతావరణం అంతర్జాతీయంగా అనిశ్చితిని పెంచిందన్నారు. ఇది భారత వృద్ధికి సవాలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గతంలో దేశీయ ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉన్నప్పటికీ మార్చి నెలలో యుద్ధ తీవ్రత పెరగడంతో పరిస్థితులు ప్రతికూలంగా మారాయని ఆయన విశ్లేషించారు. ముడిచమురు ధరలు పెరగడం వల్ల దిగుమతి ద్రవ్యోల్బణం పెరగడమే కాకుండా, కరెంట్‌ అకౌంట్‌ లోటు (సీఏడీ) మరింత విస్తరించే ప్రమాదం ఉందన్నారు.

రెపోరేటు 5.25 శాతమే..
అధిక వ్యయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రుణగ్రహీతలు వడ్డీ రేట్లు తగ్గుతాయని ఆశించిన వారికి ఆర్‌బిఐ నిర్ణయం నిరాశకు గురి చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరపు తొలి సమీక్షలో రెపో రేటును 5.25 శాతం వద్దే యధాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. గతేడాది ఫిబ్రవరి ఫిబ్రవరి నుంచి దాదాపు 1.25 శాతం మేర రేట్లను తగ్గించిన ఆర్‌బిఐ ఈసారి మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ నిర్ణయం వల్ల బ్యాంకుల వద్ద వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటమే కాకుండా పారిశ్రామిక వృద్ధికి, సామాన్యుల ఇఎంఐలపై భారం పడకుండా దోహదపడుతుందని గవర్నర్‌ పేర్కొన్నారు.

డిమాండ్‌కు విఘాతం..
పశ్చిమాసియా యుద్ధం వల్ల సరఫరా వ్యవస్థలో తలెత్తే అడ్డంకులు దేశంలోని పరిశ్రమలు, వ్యవసాయం, సేవా రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని గవర్నర్‌ మల్హోత్రా వివరించారు. ముఖ్యంగా హార్ముజ్‌ జలసంధిలో రవాణా ఆటంకాల వల్ల ముడివస్తువుల లభ్యత తగ్గి, దేశీయ ఉత్పత్తి క్షీణించవచ్చని హెచ్చరించారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తే భారత ఎగుమతులు, రెమిటెన్స్‌ల ప్రవాహంపై ప్రభావం పడుతుందన్నారు. ఇది చివరకు దేశీయంగా అప్పుల భారాన్ని కూడా పెంచవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ”సరఫరా వ్యవస్థలో మొదలైన అడ్డంకులు పునరుద్ధరణలో ఆలస్యమైతే.. అది మధ్యకాలికంగా డిమాండ్‌ పడిపోవడానికి దారితీయవచ్చు” అని మల్హోత్రా హెచ్చరించారు.

వృద్ధి రేటు అంచనాలకు కోత..
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఈ అనిశ్చితి కారణంగానే 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత జిడిపి వృద్ధి రేటు అంచనాను ఆర్‌బిఐ 6.9 శాతానికి పరిమితం చేసింది. 2025-26లో 7.6 శాతంగా ఉండొచ్చని తెలిపింది. పెట్టుబడిదారులు రిస్క్‌ తీసుకోవడానికి వెనకాడటం, సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపడం వల్ల దేశీయ పెట్టుబడులు, వినియోగంపై ఒత్తిడి పెరుగుతుందని గవర్నర్‌ అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు ఇతర దేశాల కంటే పటిష్టంగా ఉన్నాయని, ఇది బాహ్య ఒత్తిళ్లను తట్టుకోవడానికి కొంత మద్దతును ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యుద్ధ మేఘాలు వీడితేనే దేశీయ మార్కెట్లు మళ్లీ పూర్తిస్థాయిలో పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -