వచ్చేవారం కుప్పకూలనున్న మార్కెట్లు
అప్రమత్తంగా ఉండాలని
నిపుణుల సూచన
ముంబయి : అమెరికా యుద్ధోన్మాదం దలాల్ స్ట్రీట్‌ను గడగడలాడించే అవకాశాలు మెండుగా కనబడుతోన్నాయి. యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చర్యలతో పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర ఆందోళన మొదలయ్యింది. ఇరాన్‌పై ఇజ్రాయిల్ ముందస్తు దాడులు చేయడంతో సోమవారం దలాల్ స్ట్రీట్ భారీ నష్టాలతో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అణు ఒప్పందంపై నెలకొన్న విభేదాల నేపథ్యంలో అమెరికా అండతో ఇజ్రాయిల్ ఈ దాడులకు తెగబడటంతో వచ్చే వారం భారత మార్కెట్లు తీవ్ర ప్రతికూలతను ఎదుర్కోనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మధ్యప్రాచ్యంలో దశాబ్దాల కాలంలో ఎప్పుడూ లేనంతగా అమెరికా తన నౌకాదళాన్ని మోహరించింది. శనివారం ఇరాన్ కూడా ప్రతిదాడికి దిగడంతో ఇజ్రాయిల్ గగనతల రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాల మార్కెట్లను వణికిస్తున్నాయి. గత శుక్రవారం సెన్సెక్స్ 961 పాయింట్లు, నిఫ్టీ 317 పాయింట్లు నష్టపోయాయి. ఫిబ్రవరి 27తో ముగిసిన వారంలో సెన్సెక్స్ దాదాపు 2300 పాయింట్లు, నిఫ్టీ 750 పాయింట్ల వరకు లేదా 2.5-3 శాతం మేర పతనమయ్యాయి. సోమవారం నుంచి ఈ పతనం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్ డైరెక్టర్ క్రాంతి బత్తిని హెచ్చరించారు. ముఖ్యంగా ముడి చమురు ధరలు బ్యారెల్ 80 డాలర్లు దాటితే భారత ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని ఆయన విశ్లేషించారు. ఐటి మినహా ఆటో, చమురు, ఫైనాన్షియల్, ఎఫ్‌ఎంసిజి రంగాలు ఇప్పటికే అమ్మకాల ఒత్తిడిలో ఉన్నాయి. ప్రస్తుతానికి పాత స్టాక్స్‌ను తగ్గించుకుని, యుద్ధ తీవ్రత తగ్గే వరకు వేచి చూడటం ఉత్తమమని మార్కెట్ నిపుణుడు అనుజ్ గుప్తా పేర్కొన్నారు. కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచి తూచి వ్యవహారించాలన్నారు. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహారించాలని నిపుణులు సూచిస్తున్నారు.
దలాల్ స్ట్రీట్‌లో యుద్ధ కల్లోలమే..!
- Advertisement -
- Advertisement -



