ఈ భూమిపై ఇంకా యుద్ధం మిగిలే ఉండటం కంటే దురదృష్టకరమైన విషయం ఏముంటుంది. మానవ పురోగతికి యుద్ధాలు అడ్డుగా నిలుస్తాయని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఏనాడో హెచ్చరించాడు. అయినా యుద్ధాలు ఆగలేదు. ఈ ప్రపంచం నేటికీ నిరంతర యుద్ధ వాతావరణంలోనే జీవిస్తుందన్నది అక్షర సత్యం. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ఎటు దారితీస్తుందో తెలియని పరిస్థితి. యుద్ధోన్మాదం, మతోన్మాదం ప్రపంచానికి కలిగిస్తున్న ముప్పు గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు. బంగారం, వెండి ధరలు ఈరోజు ఎంత పెరిగాయి, ఆ హీరో హీరోయిన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు, అంబానీ ఇంట పెండ్లికైన ఖర్చు ఎంత, ఆ ఇంటిల్లిపాదికి డ్రెస్ లు డిజైన్ చేసింది ఎవరు? ఇలాంటి అనవసరపు అంశాలపైనే చర్చోపచర్చలు జరపడానికి సమయమంతా తగలేస్తున్నారు. కానీ! తరతరాలుగా మానవ శ్రమతో నిర్మించుకున్నటువంటి సమాజాలను విధ్వంసం చేస్తున్న వారిని ప్రశ్నించరు, రోడ్డెక్కి చిన్న నిరసన చేయరు, ప్రపంచశాంతి వర్ధిల్లాలంటూ కనీసం నినదించరు. యుద్ధ ప్రభావం ప్రపంచమంతా ఉండక మానదు. అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్‌తో చేస్తున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు మనగల్లీ వరకు తాకి జన జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది కదా.
యుద్ధాల వల్ల విధ్వంసం తప్ప ఏ ప్రయోజనం ఉండదని గత అనుభవాలు చాటుతూనే ఉన్నాయి. గత వందేళ్లలో వివిధ యుద్ధాల వల్ల 23 కోట్ల మంది అర్ధాంతరంగా జీవితాలని ముగించుకోవాల్సి వచ్చింది. నాలుగేళ్ల పాటు కొనసాగిన మొదటి ప్రపంచ యుద్ధంలో రెండు కోట్ల మంది, ఆరేళ్ల పాటు కొనసాగిన రెండో ప్రపంచ యుద్ధంలో ఎనిమిది కోట్ల మంది బతుకులు ముగిసిపోయాయి. యాభైమందిలో ఒకరు సైన్యంలో పనిచేయటానికి నిరాకరిస్తే దేశాలు యుద్ధం చేయలేవని ఎక్కడో చదివినట్లు గుర్తు. కానీ అలా నిరా కరించకపోవడానికి కారణం ఆయా దేశాల్లో నెలకొన్న పేదరికమే. సైన్యంలో చేరుతున్న వారిలో ఎక్కువమంది నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉంటారు. యుద్ధంలో ఆయా దేశాల్లో వారు బలవ్వటమే కాక విధ్వంసం వల్ల పరోక్షంగా ఎక్కువగా మహిళలు, పిల్లలే బలవ్వటం ప్రతి యుద్ధంలో చూడొచ్చు. సమాజ పురోగమనాన్ని అక్షరాలా అడ్డుకట్ట వేసేది యుద్ధమే. ఇప్పుడు జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ఆరంభంలో ఇరాన్ పై పడిన తొలి బాంబులో 165 మంది పిల్లలు బలవ్వటం,వారి సామూహిక ఖనన దృశ్యం అందరి హృదయాలను కలచివేసింది.
సిరియా అధ్యక్షుడు బసర్ అల్ అసద్‌కు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో 2011 నుంచి 2024 వరకు 12 వేల మంది పిల్లలు అసువులు బాసారు. ఇక ఆర్థిక నష్టం అక్షరాల రూ.73.60 లక్షల కోట్లు అని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. భవిష్యత్తు తరాల ఆశలను చిదిమి వేయడం, ప్రకృతి వనరులను దుర్వినియోగం చేసుకోవడం, ఆధిపత్యం, అహంకారంతో విర్రవీగుతూ ఒక దేశంపై మరో దేశం చేసే యుద్ధం మిగిల్చేది అక్షరాల విషాదం, వినాశనమే. దురహంకార పూరిత జాతీయవాదం, సామ్రాజ్యవాదం, రహస్య ఒప్పందాలు వంటి కారణాలతో వచ్చిన మొదటి ప్రపంచ యుద్ధం నుంచి ఈ ప్రపంచం ఏ గుణపాఠం నేర్చుకోలేదు. ఈ యుద్ధంలో ఆరుకోట్ల మంది చనిపోయారు, ఏడు కోట్ల మంది శాశ్వత అంగవైకల్యంతో జీవితాంతం బాధలను అనుభవించారు, కోటిన్నర మంది తీవ్రంగా గాయపడ్డారు.
వర్సెయిల్స్ సంధిలోని అవమానకరమైనటు వంటి షరతులు, నానాజాతి సమితి వైఫల్యం, ప్రతీకార పెత్తందారీతనంపై జర్మనీ సవాల్, సామ్రాజ్యవాదం లాంటి కారణాలు రెండో ప్రపంచ యుద్ధానికి దారి తీశాయని చరిత్ర చెబుతుంది. 1939 నుంచి 1945 వరకు జరిగిన ఈ యుద్ధం మానవచరిత్రలో అత్యంత విషాదాన్ని వినాశనాన్ని మిగిల్చింది. 6 కోట్ల నుంచి 8 కోట్ల మంది పౌరులు, సైనికులు మరణించారు. పది లక్షల కోట్ల అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ ఆర్థిక నష్టం జరిగినట్టు చరిత్ర పుటలు తిరగేస్తే స్పష్టమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాలు నేలమట్టమయ్యాయి. మరి రెండు ప్రపంచ యుద్ధాల నుంచి ఈ ప్రపంచ ఏమాత్రం నేర్చుకున్నా ఈ భూమిపై యుద్ధం అనేది మిగలకూడదు. కానీ! నేటికీ ఈ ప్రపంచంలో ఏదో ఒక చోట యుద్ధం జరుగుతూనే ఉంది. మూడో ప్రపంచ యుద్ధంలో మనిషి ఏ ఆయుధాలతో పోరాడుతాడో తెలియదు కానీ, నాలుగవ ప్రపంచ యుద్ధంలో కర్రలు, రాళ్లతో పోరాడుతారని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆనాటికి తనకందిన ఊహతో ఆ మాటలు వ్యక్తపరిచాడు. మనిషి సాధించిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసుకున్న అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలతో మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే నాలుగో ప్రపంచ యుద్ధం అంటూ ఉంటుందా? ఇది ఊహకందని ప్రశ్న.
ఇరాన్‌పై యుద్ధంతో ప్రపంచం అంతం దిశగా సాగుతుందని రష్యా అధ్యక్ష భవనం నుంచి వచ్చిన ప్రకటన ఇప్పుడు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. సైనిక చర్యను ఎప్పుడు నిలిపివేయాలన్న అంశంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు అహంకారపూరితంగా ప్రకటించారు. ఆ వెనువెంటనే యుద్ధం ముగించేది మీరు కాదు, దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధమంటూ ఇరాన్ ప్రకటిం చేసింది. ఈ ప్రకటనలు సమాజ పురోగతికి ఏమాత్రం పనికొచ్చేవి కాదు. చాలా దేశాల్లో ప్రజలు చెల్లించే పన్నుల్లో అధిక మొత్తం ఆయుధాలు కొనడానికో, తయారు చేసుకోవడానికో ఉపయోగిస్తూ యుద్ధజ్వాలలు రగుల్చుతున్నాయని ప్రముఖ ఎకనమిస్ట్ ప్రొఫెసర్ జోమో క్యామిన్ సుందరం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచం మొత్తం 2024లో 2.7 లక్షల కోట్ల డాలర్లు మిలటరీపై ఖర్చు చేసింది, అందులో అమెరికా వాటానే 36శాతం ఉంది. యుద్ధోన్మాదంతో ఊగిపోయే అమెరికా ఆయుధ సంపద చూసుకుని విర్రవుగుతోంది.అమెరికాలో పేదరికం ఉంటుందా ? అమెరికా ధనిక దేశం కదా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇప్పుడు ఆ దేశంలో పేదరికం ఒక పెద్ద సమస్యగా మారింది. కానీ అవేమీ శ్వేత సౌధానికి పట్టవు. 2024 నాటికి సుమారుగా 10.6శాతం అంటే 30.9 మిలియన్ల మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. అంతేకాదు 33 మిలియన్ల మంది ఆహార భద్రతను ఎదుర్కొంటున్నారు. దేశ సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రపంచాన్ని వల్లకాడుగా మారుస్తానంటూ ట్రంప్ రంకిలేస్తున్నాడు.
ఇరాన్ తర్వాత మా టార్గెట్ ఉత్తర కొరియా, క్యూబా అంటూ పనికిమాలిన ప్రకటనలు చేస్తున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి, రెండో ప్రపంచం తర్వాత ఐక్యరాజ్యసమితి అనే శాంతి సంఘాలు ఏర్పడ్డాయి. శాంతి నెలకొల్పటం, సామాజిక ప్రగతిని ప్రోత్సహించటం, అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం, మానవ హక్కులను కాపాడటం లాంటి ఈ నాలుగు సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడిన ఐక్యరాజ్య సమితి ,ఇప్పుడు కళ్లు, చెవులు మూసుకుందా అనిపిస్తుంది.యుద్ధాలు ఎవరు చేసినా దుష్ఫలితాలు ప్రపంచ ప్రజలందరివి. యుద్ధంలో ఎవరిది పై చేయి అయ్యింది, ఎవరు గెలిచారన్నది ముఖ్యం కాదు. అసలు యుద్ధాలే వద్దంటూ ప్రపంచ ప్రజలు ”ప్రపంచ శాంతి వర్ధిల్లాలంటూ” దిక్కులు పిక్కటిల్లేలా నినదించాలి. భారత్‌తో సహా మిగిలిన దేశాలు తక్షణం అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్‌తో చేస్తున్న యుద్ధాన్ని నిలిపివేసేందుకు తమవంతు కృషి చేయాలి.
పి.వి.రావు
9010153065



