Saturday, February 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌వైపే 'వరంగల్‌'

కాంగ్రెస్‌వైపే ‘వరంగల్‌’

- Advertisement -

9 మున్సిపాల్టీలలో విజయం
గట్టిపోటీ ఇచ్చిన బీఆర్‌ఎస్‌
మహబూబాబాద్‌, జనగామలో హంగ్‌
క్యాంపు రాజకీయాలు షురూ

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి బీఆర్‌ఎస్‌ గట్టి పోటీ ఇచ్చింది. అయినా కాంగ్రెస్‌ పరకాల, భూపాలపల్లి, ములుగు, నర్సంపేట, డోర్నకల్‌, స్టేషన్‌ఘన్‌ పూర్‌, మరిపెడ మున్సిపాల్టీలలో విజయం సాధించి ఛైర్మెన్‌, వైస్‌ఛైర్మన్‌ పదవులను దక్కించుకుంది. ఎక్స్‌అఫిషియో ఓట్లతో కేసముద్రం, వర్ధన్నపేట మున్సిపాల్టీలను కాంగ్రెస్‌ పార్టీ దక్కించుకోనుంది. బీఆర్‌ఎస్‌ తొర్రూరు మున్సిపాల్టీని దక్కించుకుంది. కేసముద్రంలో 16 వార్డులకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ 8 వార్డుల చొప్పున గెలుచుకున్నాయి.

ఇక్కడ ఎమ్మెల్యే ఎక్స్‌అఫిషియో ఓటు వేసే అవకాశముండడంతో కేసముద్రం మున్సిపాల్టీని కాంగ్రెస్‌ దక్కించుకునే అవకాశ ముంది. వర్ధన్నపేట మున్సిపాల్టీలో 12 వార్డులుండగా ఇక్కడ కాంగ్రెస్‌ 5, బీఆర్‌ఎస్‌ 6 వార్డులను గెలుచుకోగా, మరో వార్డులో ఇండిపెండెంట్‌ గెలిచారు. ఇండిపెండెంట్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు పలకడంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు 6గురు కౌన్సిలర్ల చొప్పున బలం వుంది. దీంతో స్థానిక ఎమ్మెల్యే కెఆర్‌ నాగరాజు ఎక్స్‌అఫిషియో ఓటుండడంతో వర్ధన్నపేట మున్సిపాల్టీని కాంగ్రెస్‌ పార్టీ దక్కించుకునే అవకాశాలే అధికంగా వున్నాయి. మహబూబాబాద్‌, జనగామ మున్సిపాల్టీలలో హంగ్‌ ఏర్పడింది.

తొర్రూరులో గులాబీ ..
తొర్రూరు వమున్సిపాల్టీలో 16 వార్డులకుగాను బిఆర్‌ఎస్‌ 9 వార్డులలో, కాంగ్రెస్‌ పార్టీ 7 వార్డులలో వార్డులలో విజయం సాధించాయి. ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 8 కావడంతో బీఆర్‌ఎస్‌ స్పష్టమైన మెజార్టీతో ఛైర్‌పర్సన్‌, వైస్‌ఛైర్‌పర్సన్‌ పదవులను దక్కించుకున్నాయి. మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్య ర్థుల ఎంపిక నుండి ప్రచారం, పోల్‌ మేనేజ్‌మెంట్‌ వరకు అన్నీ తానై నడిపించడంతో విజయం సాధించగలిగారు.

ఇండిపెండెంట్లే కీలకం..
మహబూబాబాద్‌, జనగామ మున్సిపాల్టీలలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో ఈ రెండు మున్సిపాల్టీలలో కమ్యూనిస్టులు, ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. మహబూబాబాద్‌ మున్సిపాల్టీలో కాంగ్రెస్‌, సిపిఐ(ఎం) పొత్తుతో పోటీ చేశాయి. బీఆర్‌ఎస్‌, సిపిఐ పొత్తుతో పోటీ చేశాయి. 36 వార్డులలో కాంగ్రెస్‌ 13, బీఆర్‌ఎస్‌ 12, బిజెపి 1, సిపిఐ(ఎం) 3, సిపిఐ 3 వార్డులలో గెలవగా, మరో 4 వార్డులలో ఇండిపెండెంట్లు గెలిచారు. ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 19. కాంగ్రెస్‌, సిపిఐ(ఎం) బలం 16 మంది కౌన్సిలర్లు కాగా ఇండిపెండెంట్లను ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలు క్యాంప్‌కు తరలించినట్టు సమాచారం.

ఎక్స్‌ అఫిషియో సభ్యుల బలంతో మహబూబాబాద్‌ మున్సిపాల్టీని కాంగ్రెస్‌ కైవసం చేసుకోవడం ఖాయం. జనగామ మున్సిపాల్టీలోనూ ఇదే పరిస్థితి వుంది. జనగామలో 30 వార్డులకుగాను కాంగ్రెస్‌ 12, బీఆర్‌ఎస్‌ 13, సిపిఐ(ఎం) 1, 4గురు ఇండిపెండెట్లు గెలిచారు. ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 16 కాగా, కాంగ్రెస్‌, సిపిఐ(ఎం) పొత్తుతో పోటీ చేశాయి. ఈ రెండు పార్టీల బలం 13 కాగా మరో 3గ్గురు ఇండిపెండెంట్ల బలం వుంటే జనగామ మున్సిపాల్టీని సైతం కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుకునే అవకాశముంది. ఇండిపెండెంట్లను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు క్యాంప్‌కు తరలించినట్లు ప్రచారం జరుగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -