– ప్రజలకు ఉపాధి కల్పించే దీర్ఘకాలిక కార్యక్రమాలు కొనసాగాలి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ సందర్శన
నవతెలంగాణ-సంగెం
ఒకనాడు వరంగల్ జిల్లా, ఓరుగల్లు అంటేనే అజంజాహీ మిల్లు గుర్తుకు వచ్చేది కానీ ఇప్పుడు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఆ లోటును తీర్చి గుర్తింపు తెచ్చిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనంగా చెప్పొచ్చన్నారు. బుధవారం వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను సందర్శించిన అనంతరం బీఆర్‌ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ జిల్లా తన పూర్వ వైభవాన్ని కోల్పోయి నేతన్నలు సూరత్, షోలాపూర్, బీవండి వంటి ప్రాంతాలకు వలసపోయారని అన్నారు. ఆ పరిస్థితిని మార్చి, వరంగల్‌ను సూరత్ లాగా, తమిళనాడులోని తిరుపూర్ లాగా టెక్స్‌టైల్ హబ్‌గా మార్చాలనే ఉద్దేశంతో ఈ టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ‘ఫామ్ టు ఫ్యాషన్’ అంటే నల్లరేగడి నేలల్లో పండే తెల్ల బంగారం (పత్తి)తో రైతుకు, పరిశ్రమలో పనిచేసే మహిళలకు ఉపాధి దొరకాలనే సంకల్పంతో భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కును ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం స్థాపించిందని తెలిపారు.
కరోనా కారణంగా రెండేండ్లు ఇబ్బంది కలిగినా, ఈరోజు కైటెక్స్, యంగ్‌వన్, గణేషా లాంటి పరిశ్రమలు దాదాపు 25-30 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోవడం సంతోషదాయకం అన్నారు. తాము కిటెక్స్ పరిశ్రమను సందర్శించి, అందులోని అత్యాధునిక స్పిన్నింగ్, గార్మెంటింగ్ పరిశ్రమలను పరిశీలించామని, దక్షిణ కొరియాకు చెందిన యంగ్‌వన్ సంస్థకు కూడా పెద్దఎత్తున భూమిని కేటాయించినట్టు చెప్పారు. నాడు ధర్మారెడ్డి శాసనసభ్యుడిగా రైతులను ఒప్పించి, ఉపాధి అవకాశాల గురించి వివరించి, బతిమిలాడి భూసేకరణ చేశారన్నారు. ఆ కల సాకారమై పరిశ్రమలు వచ్చి ఉపాధి కల్పించే స్థాయికి చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ పార్కును ప్రారంభించినప్పుడు భారతదేశంలో ఇలాంటి పాలసీ లేదని, పక్కన ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌లో వస్త్ర ఉత్పత్తి భారతదేశం (4శాతం) కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందని అన్నారు. తెలంగాణను టెక్స్‌టైల్ హబ్‌గా మార్చాలనే విజన్‌తో ఈ పార్కును ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఉపాధి కల్పించే ఇలాంటి దీర్ఘకాలిక కార్యక్రమాలు శాశ్వతంగా కొనసాగాలన్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని తాను కోరుతున్నా.. ఈ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ఉపాధి అవకాశాల విషయంలో చొరవ తీసుకుని, స్థానికులకే ఉద్యోగాలు దొరికే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అందుకు తమ పార్టీ తరపున ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, వినయ భాస్కర్, నన్నపనేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, తాటికొండ రాజయ్య, మాజీ జెడ్పీ చైర్మెన్ గండ్ర జ్యోతి, నాయకులు కర్ర వాసుదేవ రెడ్డి, చింతం సదానందం నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, గూడ సుదర్శన్ రెడ్డి, పసునూరి సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.
వరంగల్‌కు ‘టెక్స్‌టైల్ పార్క్’తో పూర్వ వైభవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



