తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలకు చైనా సమాయత్తం
త్రివిధ దళాల తరలింపు
చైనాలో కాంబోడియా, థాయిలాండ్ మంత్రుల భేటీ
హాంగ్‌కాంగ్ : వేర్పాటువాదులకు, తన వ్యవహారాలలో తలదూరుస్తున్న విదేశీ శక్తులకు చైనా గట్టి హెచ్చరికలు జారీ చేస్తోంది. తైవాన్ చుట్టూ సంయుక్త విన్యాసాలు జరిపేందుకు సోమవారం వైమానిక, నౌక, రాకెట్ దళాలను పంపింది. తన ఆంతరంగిక విషయాలలో వేలుపెడుతున్న అమెరికా, జపాన్ దేశాల వైఖరులను చైనా తీవ్రంగా తప్పు పడుతోంది. తైవాన్‌కు అమెరికా ఆయుధాలు విక్రయిస్తుండగా తైవాన్‌పై చైనా చర్యలకు దిగితే తన సైన్యం జోక్యం చేసుకుంటుందని జపాన్ ప్రధాని సానే తకైచీ బెదిరించారు. ఈ రెండు దేశాల వైఖరులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా తాజాగా సైనిక విన్యాసాలకు సమాయత్తమైంది. విన్యాసాలపై చైనా సైన్యం సోమవారం ఉదయం చేసిన ప్రకటనలో అమెరికా, జపాన్ దేశాల ప్రస్తావన తేలేదు.
మోహరింపు ఇలా…
చైనా సైన్యం తైవాన్ జలసంధికి ఉత్తర, నైరుతి దిశలో సుదూర లక్ష్యాలను ఛేదించే రాకెట్లతో పాటు డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు, ఫైటర్లు, బాంబర్లు, మానవ రహిత గగనతల వాహనాలను మోహరిస్తోంది. జలాలలోని లక్ష్యాలపై కూడా విన్యాసాలు జరుపుతుంది. జలసంధికి తూర్పున ఉన్న జలాలలో, గగనతలంలో ఇప్పటికే సామర్ధ్య పరీక్షలు నిర్వహించింది. మంగళవారం ప్రధాన సైనిక విన్యాసాలు జరగబోతున్నాయి. ఆ సమయంలో ప్రత్యక్ష కాల్పులు జరుపుతామని, ద్వీపం చుట్టూ ఉన్న ఐదు ప్రాంతాలలో విన్యాసాలు జరుగుతాయని సైన్యం తెలిపింది. సైనిక విన్యాసాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.
చైనా పీఎల్‌ఓ ప్రతినిధి ఏమన్నారంటే…
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఈస్ట్రన్ థియేటర్ కమాండ్ ప్రతినిధి సీనియర్ కల్నల్ షీ ఈ ఒక ప్రకటన చేస్తూ తైవాన్ జలసంధిలోనూ, ద్వీపానికి ఉత్తర, నైరుతి, తూర్పు ప్రాంతాలలోనూ విన్యాసాలు నిర్వహిస్తామని తెలిపారు. వైమానిక, సముద్ర దాడులకు సన్నద్ధత పైన, పూర్తి ఆధిపత్యం సాధించడం పైన, కీలక ఓడరేవుల దిగ్బంధనం పైన దృష్టి సారిస్తామని వివరించారు. ఇది చైనా సైన్యం నిర్వహిస్తున్న మొట్టమొదటి అతి పెద్ద కవాతు అని చెప్పారు. ‘తైవాన్‌కు స్వాతంత్య్రం కోరుతున్న వేర్పాటువాదులకు గట్టి హెచ్చరిక. మా ఆంతరంగిక విషయాలలో జోక్యం చేసుకుంటున్న విదేశీ శక్తులకు కూడా ఇది కఠినమైన హెచ్చరిక. చైనా సార్వభౌమత్వాన్ని, జాతి సమైక్యతను కాపాడుకోవడానికి చట్టబద్ధమైన, అవసరమైన చర్య’ అని షీ చెప్పారు.
చైనాలో కాంబోడియా, థాయిలాండ్ మంత్రుల భేటీ
ప్రపంచ దౌత్య పటంలో చైనా తన ఉనికిని ప్రత్యేకంగా చాటుకుంటుంది. కాంబోడియా, థాయిలాండ్ మంత్రులు చైనాలో ఆ దేశ విదేశాంగ మంత్రితో భేటీ కావడమే ఇందుకు నిదర్శనం. చైనాలోని యునాన్ ప్రావివ్స్‌లో ఆది, సోమవారాల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. కాంబోడియా, థాయిలాండ్ దేశాల మధ్య నూతన కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు జరిగిన రెండు రోజుల తరువాత ఈ భేటీ జరగడం గమనార్హం.
సైన్యాన్ని అప్రమత్తం చేసిన తైవాన్
చైనా విన్యాసాలపై స్పందించిన తైవాన్ తన సైనిక దళాలను అప్రమత్తం చేసింది. ద్వీపాన్ని కాపాడుకునేందుకు సైన్యం సిద్ధంగా ఉన్నదని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. ఇప్పటికే సైన్యాన్ని మోహరించామని, యుద్ధ సన్నద్ధత విన్యాసాలు జరుపుతున్నామని తైవాన్ మరో ప్రకటనలో చెప్పింది.



