నిజాం పాలనలో భూస్వాములు, రజాకార్లు కలిసి పేద ప్రజలపై చేసిన దాడులు, పెట్టిన చిత్రహింసలు అన్నీఇన్నీ కావు. ఈ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన ఎంతోమంది యోధుల్లో కామ్రేడ్ దర్గ్యానాయక్ ఒకరు. భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో యుద్ధవీరుడిలా మెరిశాడు. దేశ్‌ముఖ్‌లు జనగామ తాలూకా ధర్మపురం తండా చుట్టుపక్కల ఉన్న ఎనిమిది గ్రామాల ప్రజలను చిత్రహింసలు పెడుతుంటే చూస్తూ ఊరుకోలేక తిరగబడ్డాడు. నిజాం పాలనలో ధర్మపురం జమీందారు వేమూరి రాఘవరావు, జనగామ జమీందారు విసునూరు రామచంద్రారెడ్డి, మొండ్రాయి జమీందారు కట్టారు రామచంద్రారావు ఆగడాలకు అంతేలేదు. గిరిజనులు సాగుచేస్తున్న నూట ఐదెకరాల సాగు భూమిని భూస్వాములు బలవంతంగా లాక్కున్నారు. ఆ భూమిలోనే బానిసల్లా చూశారు. పొలంలోనే కాదు ఇంట్లోనూ వెట్టిచాకిరీ చేయించారు. వారి భూమికే తప్పుడు పత్రాలు సృష్టించి డబ్బులివ్వాలంటూ వడ్డీ వసూళ్లకు పాల్పడేవారు. అధిక శిస్తు వసూలు చేసేవారు.
రామచంద్రారెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఆగడాలతో విసిగిపోయిన ప్రజలు ఎదురు నిలిచారు.ఆంధ్ర మహాసభ సంఘంలో చేరారు. ‘దున్నేవాడికే భూమి కావాలని నినాదం’తో మమేకమయ్యారు. ఆగ్రహించిన బాబుదొర గుండాలతో వచ్చి తండాలను తగలబెట్టాడు. మధ్యాహ్నం సమయంలో గిరిజనులు పొలం పనులకు వెళుతున్న సందర్భంలో, ఎవరూ లేని సమయంలో ముసలి ముతక, ఆడ మగ వాళ్లను బట్టలు విప్పి అవమానపరుస్తూ మూత్రం తాపించి ఊరే గించారు. ‘మీరు సంఘంలో పనిచేస్తే అందరికీ ఇదే గతి పడుతుందని మీ పిల్లలకు చెప్పాలని’ చిత్రహింసలు పెట్టారు. అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు. ‘పోరాడితే పోయేదేమీ లేదన్న’ స్ఫూర్తితో ప్రజలందరినీ ఏకం చేసి గడీలపై ధిక్కారస్వరం వినిపించాడు దర్గ్యానాయక్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1944 నుండి 1951 వరకు జరిగింది. ఆ కాలంలో ఎందరో వీరులు అమరులయ్యారు. ప్రజలకోసం, వారి స్వేచ్ఛ కోసం ప్రాణాలను తృణప్రాణంగా బలిచ్చారు. హక్కుల కోసం గుంపు కట్టారు, సంఘం పెట్టారు.
ఆ కాలంలో కన బడితే కాల్చివేత అన్న దారుణ పరిస్థితులుండేవి. దళ సభ్యులంతా పగలంతా అడవుల్లో చెట్ల మీద దాక్కుని ఉండేవారు. రాత్రుల్లోనే గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజల సమస్యలను తెలుసుకునేవారు. ఇలాంటి స్థితిలో దొరలు మాత్రం కామ్రేడ్ దర్గ్యానాయక్ అంటే వణికేవారు. చిన్నతనంలోనే దళంలో చేరిన ఆయన తుపాకీ పట్టడంలో దిట్ట. ఐదు ఫైరింగ్‌ల్లో ఎనిమిదేండ్ల జైలు శిక్ష అనుభవించాడు. ఆయనతో పాటు అన్నదమ్ములు కూడా పోరాటంలోనే పాల్గొన్నారు, కొంతమంది ఆ ఉద్యమంలోనే అసువులు బాశారు. తండాకు చెందిన హామునాయక్ కుమారులు ఆరుగురు పోరాటరంగంలో దిగి భూస్వాములకు సవాల్‌గా నిలిచారు. ఠానునాయక్ దళ కమాండర్‌గా ఉండగా ముండ్రాయి దగ్గర పటుకుని ఎడ్లబండ్ల చక్రాలకు కట్టి తిప్పి కాల్చి చంపారు. బాబుదొర, పోలీసులు గుర్రాల మీద వచ్చి వారి బలగాలతో దాడులు చేశారు. సోమ్లనాయక్‌ను చితిమంటలు పేర్పించి మరీ సజీవ దహనం చేశారు.
దర్గ్యానాయక్ తెగువ చూపిన ధీరుడు. శత్రువులకు చిక్కకుండా అనేక పోరాటాలు నిర్వహించాడు. పదిహేనేండ్ల పాటు ధర్మపురం తండాకు గ్రామ సర్పంచిగానూ సేవలందించాడు. సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య బలిదానం రాష్ట్రంలోనే ఓ సంచలనం. ఆ మరణంతో ఉద్యమం ఊపందుకుంది. కులం, మతం, ప్రాంతమనే తేడా లేకుండా దోపిడీదారులను తరిమికొట్టారు. చాలామంది భూస్వాములు ఆ కాలంలో హైదరాబాద్‌లో తలదాచుకున్నారు. ఆ పోరాటంలో కామ్రేడ్ మల్లు స్వరాజ్యం రెండు నెలలపాటు దర్గ్యానాయక్ ఇంట్లో ఉన్నది. పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శంతో చివరి వరకు కమ్యూనిస్టు పార్టీ జెండా కిందనే దర్గ్యానాయక్ కట్టుబడి ఉపనిచేశాడు. ఆయన నూట ఏడేండ్ల వయసులో గతేడాది డిసెంబర్ పదహారున చనిపోయాడు. కానీ ఆయన పోరాటజ్వాల మాత్రం ప్రజల్లో ఇంకా చెరగని ముద్రనే. దర్గ్యానాయక్ ఆశయ సాధనకు పునరంకితమవ్వాల్సిన సందర్భమిది.
మూడ్ ధర్మానాయక్
9490098685



