Wednesday, July 16, 2025
E-PAPER
Homeజాతీయంజల జగడం..!

జల జగడం..!

- Advertisement -

రేపు అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ
కేంద్ర జలశక్తి మంత్రి నేతృత్వంలో సమావేశం
హాజరుకానున్న తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలు
గోదావరి-బనకచర్లతో పాటు రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృత అంశాలపై చర్చ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

కృష్ణా, గోదావరి నదీ బేసిన్‌ల పరిధిలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై చర్చించేందుకు బుధవారం అపెక్స్‌ కమిటీ భేటీ జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం జరగనున్న ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అలాగే జల వనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ చేపట్టిన కొత్త ప్రాజెక్ట్‌లు, బోర్డుల వర్కింగ్‌ మాన్యువల్‌, రెండు బేసిన్‌లలో నీటి వినియోగం, వృథా నీటి వాడకానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్‌లపై అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించనున్నారు.

కాగా… గోదావరి-బనకచర్లకు అనుమతివ్వాలని ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోంది. సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఈ నేపథ్యంలో గతనెల 19న కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎక్స్‌ పర్ట్స్‌ అప్రైజల్‌ కమిటీ(ఈఏసీ) భేటీలో బనకచర్ల అంశంపై చర్చించారు. అయితే ఈ ప్రాజెక్ట్‌పై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. దీంతో చంద్రబాబు నాయుడు ఎలాగైనా అనుమతులు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా… ఆంధ్రప్రదేశ్‌ చేపట్టే గోదావరి-బనకచర్ల లింక్‌ ప్రాజెక్ట్‌ను తొలి నుంచి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌తో ఎగువ రాష్ట్రమైన తెలంగాణ తీవ్ర అన్యాయం జరుగుతోన్న విషయాన్ని ఇప్పటికే పలు పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్‌ 19, మార్చి 3 తేదీల్లో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్‌ పాటిల్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం త్వరలో అపెక్స్‌ కమిటీ భేటీ నిర్వహిస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్టు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే బుధవారం అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ కానుంది.


తెలంగాణ అభ్యంతరం
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం గోదావరి-బనకచర్ల లింక్‌ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతోంది. ఇదే విషయాన్ని కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు కంప్లైంట్‌ చేసింది. ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కేంద్ర జల సంఘం, గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ), కేఆర్‌ఎంబీల నుంచి ఎటువంటి అనుమతి లేదని పేర్కొంది. గోదావరిపై తాము చేపట్టిన సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వని విషయాన్ని కేంద్రానికి గుర్తు చేసింది. ప్రధానంగా కృష్ణా నది పరివాహకంలో సుమారు 70 శాతం తెలంగాణలో ఉంటే కేవలం 30 శాతం మాత్రమే ఏపీలో ఉన్నందున కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని తెలంగాణ డిమాండ్‌. గోదావరికి సంబంధించి తెలంగాణ వాటా నికర జలాలు తేల్చిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే తేల్చి చెప్పింది. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉన్నప్పటికీ కష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పక్షపాతంగా ఏపీకి 66, తెలంగాణకు 34 శాతం నీటి కేటాయింపులు చేసిన విషయాన్ని కేంద్రమంత్రికి సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే తెలిపారు. ఏండ్లుగా తాము నష్టపోతున్నామని, ఈ ఏడాది సైతం ఆంధ్రప్రదేశ్‌ తమకు కేటాయించిన మొత్తానికి మించి నీరు తరలించుకు పోయిందన్నారు. ఇక ముందు తమ వాటాకు మించి కృష్ణానది నీటిని ఏపీ తరలించుకొని పోకుండా చూడాలని పట్టుబడుతోంది.


ట్రిబ్యునల్‌ విచారణ త్వరగా పూర్తి చేయండి
శాశ్వత సమస్య అయిన కృష్ణా బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యూనల్‌ వ్యవహారంలో విచారణను త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ కోరుతోంది. అలాగే ముచ్చిమర్రి నుంచి ఏపీ తరలిస్తోన్న నీటిని ఆపాలని, నాగార్జున సాగర్‌ కుడి కాలువ నుంచి 10 వేల క్యూసెక్‌లను ఏపీ తీసుకుపోతోన్న వైఖరిని తప్పుబడుతోంది. మరీ ముఖ్యంగా కృష్ణా నదిపై నిర్మించిన శ్రీశైలం, నాగార్జున సాగర్‌తో పాటు ఇతర పాయింట్లలో టెలిమెట్రీ పరికరాలు వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తోంది. ఈ టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుకయ్యే ఖర్చులో అవసరమైతే తెలంగాణ, ఏపీ ఇద్దరి వాటాను తెలంగాణనే భరించేందుకు సిద్ధమని ఇప్పటికే స్పష్టం చేసింది. అందువల్ల వెంటనే టెలిమెట్రీ పరికరాలు అమర్చాలని, దీంతో అక్యురేట్‌ మెజర్‌మెంట్స్‌ వస్తాయని కేంద్రాన్ని కోరుతోంది. ఇక తెలంగాణకు కీలకమైన పాలమూరు- రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల, మోడి కుంట వాగు, చనాఖా కొరటా బ్యారేజీ (డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌), చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర) ఎత్తిపోతల పథకాలకు సత్వర సాగు నీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ).. పీఎంఆర్‌పీ 2024 కింద తగిన ఆర్థిక సహాయం అందజేయాలని కోరుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -