నేటి నుంచి అసెంబ్లీలో చర్చ
అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న అధికార, ప్రతిపక్షాలు
నీటి పంపకాలపై ఎవరి వాదన వారిదే
కృష్ణా, గోదావరి వివాదాలపై నవతెలంగాణ ప్రత్యేక కథనం
ఊరగొండ మల్లేశం
కృష్ణా, గోదావరిలో తెలంగాణ నీటి హక్కులు కోల్పోవడంలో పాపమెవరిది? తప్పు మీదంటే మీదని గత రెండేండ్లుగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా మీడియా సమావేశంలో చేసిన విమర్శలు అగ్గికి ఆజ్యం పోశాయి. తెలంగాణ శాసన సభ వేదికగా కృష్ణా, గోదావరి జలాల వాటాను సాధించడంలో ఎవరు విఫలమయ్యారో చర్చిద్దామని సీఎం ప్రకటించారు. సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలు నీటి యుద్దాలకు వేదికగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకాలపై నవ తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం.
కృష్ణా వివాదం
మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో పుట్టిన కృష్ణా నది 1400 కిలో మీటర్ల ప్రయాణంలో మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా హంసలదీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. దక్షిణ భారతదేశంలో గోదావరి తర్వాత రెండవ అతిపెద్ద నది, కోయనా, భీమా, తుంగభద్ర, మూసీ నదులు ప్రధాన ఉపనదులు. ఉమ్మడి ఏపీలోనే నీటి పంపకాలపై మూడు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 ప్రకారం 1969లో జస్టిస్ బచావత్ నేతృత్వంలో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యూనల్-1 (కేడబ్ల్యూడీటీ)ను ఏర్పాటు చేసింది. 78 సంవత్సరాల నీటి ప్రవాహ లెక్కల ఆధారంగా 75 శాతం నీటిని పరిగణలోకి తీసుకుని 1976లో బచావత్ ట్రిబ్యూనల్ తుది అవార్డును ప్రకటించింది.
మహారాష్ట్రకు 585, కర్నాటకకు 734, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలుగా పంపకాలు జరిపింది. అన్ని రాష్ట్రాలు ట్రిబ్యూనల్ పంపకాలపై తమతమ పరిధిలో కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. ఆయా రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలు పరిష్కారం కాకముందే ఏపీ రెండుగా విడిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత కేడబ్ల్యూడీటీ తుది అవార్డు ప్రకారం 66 శాతం (512 టీఎంసీలు) ఏపీకి, 34 శాతం (299 టీఎంసీలు) తెలంగాణకు దక్కాయి. ప్రస్తుతం దాని ప్రకారమే నీటి వాడకం జరుగుతోంది. ఈ పంపకాలపై తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014లో బీఆర్‌ఎస్ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. గత 11 ఏండ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది.
గోదావరి వివాదం
భారతదేశంలో గంగ, సింధు తర్వాత పొడవైన నది గోదావరి. ఇది మహారాష్ట్రలోని నాసిక్‌లో జన్మించి నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నది. నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. హక్కుదారులు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలు. 1969లో కేంద్ర ప్రభుతం ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 ప్రకారం 1969లో గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యూనల్ (జీడబ్ల్యూడీటీ)ని ఏర్పాటు చేసింది. ప్రస్తుత, ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్‌లు, బేసిన్, సబ్‌బేసిన్, నీటి ప్రవాహం ఆధారంగా నీటిని వాడుకోవాలని చెప్పిందే తప్ప రాష్ట్రాల మధ్య స్పష్టమైన కేటాయింపులు చేయలేదు.
ఉదాహరణకు మహారాష్ట్ర సర్కార్ పైథాన్‌కు పైన మాత్రమే ప్రాజెక్ట్‌లు కట్టాలనీ, నీటి ప్రవాహాన్ని ఆపొద్దని అవార్డులో పేర్కొంది. జీడబ్ల్యూడీటీ పంపకాలకు భిన్నంగా ఆ రాష్ట్రం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ వివాదం కావడంతో కేంద్రం జోక్యం చేసుకుని వర్షాకాలంలో మూడు నెలల పాటు ప్రాజెక్ట్ గేట్లు తెరవాలని ఆదేశించింది. స్పష్టమైన కేటాయింపులు లేక పోవడంతో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణల మధ్య నీటి వివాదం కొనసాగుతోంది. గత పదేండ్లుగా తెలంగాణ సగటున 400 టీఎంసీలు, ఏపీ 250 టీఎంసీలు వాడుకుంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే తాజాగా పోలవరం నుంచి కృష్ణాకు నీటి తరలింపు వ్యవహారం వివాదంగా మారింది. కేడబ్ల్యూడీటీ తుది తీర్పుతో పాటు పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు నీటి తరలింపు వ్యవహారంలో ఏపీ లాబియింగ్‌కు పాల్పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కార్‌కు టీడీపీ మద్దతిస్తున్న నేపథ్యంలో మరో మూడేండ్లు ఇదే పరిస్థితి కొనసాగుతుందని భావిస్తున్నారు.
తెలంగాణ వాదన
కృష్ణానది తెలంగాణలో 300 కిలో మీటర్లు ప్రవహిస్తోంది. 70 ఏండ్లుగా తెలంగాణ ప్రాంతానికి కృష్ణా జలాల పంపిణీలో అన్యాయం జరుగుతోంది. బచావత్ ట్రిబ్యూనల్-1 చేసిన 66:34 శాతం పంపకాలను పున:సమీక్షించాలి. కృష్ణా నీటి వాటాలో 71 శాతం తెలంగాణకు, 29శాతం ఏపీకి ఇవ్వాలి. సెక్షన్ 3 ప్రకారం క్యాచ్‌మెంట్ ఏరియా, జనాభా, వ్యవసాయ అవసరాలను పరిగణనలోకి తీసుకుని పంపకాలపై కేడబ్ల్యూడీటీ-2 తుది అవార్డును ప్రకటించాలి. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. గత రెండేండ్లుగా వివాదం కేడబ్ల్యూడీటీ-2 వద్ద పెండింగ్‌లో ఉంది.
ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పోలవరం- నల్లమలసాగర్ ప్రాజెక్ట్ రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ హక్కులు, నిబంధనలకు పూర్తి వ్యతిరేకం. ఏ రాష్ట్రమైనా నికర జలాల ఆధారంగా ప్రాజెక్ట్‌లు కడతారే తప్ప వరద జలాలపై ప్రాజెక్ట్‌లు కట్టడం దేశంలోనే మొదటి సారి. ఆ జలాల్లో కూడా పక్క రాష్ట్రాలకు వాటాలు ఉంటాయి. వాటి లెక్కలు తేలక ముందే ఎలా ముందు కెళ్తారు. వర్షాలు కురవని ఏడాది నీటిని ఎక్కడి నుంచి తరలిస్తారు. రెండు రాష్ట్రాలు వాడుకునే నికర జలాల్లోంచే నీటిని తరలిస్తారు. ఫలితంగా భవిష్యత్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.
ఏపీ వాదన
బచావత్ ట్రిబ్యూనల్ పంపకాలను పున:సమీక్షించాల్సిన అవసరం లేదు. రాయలసీమ వెనకబడిన ప్రాంతం. ఇక్కడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని బచావత్ ట్రిబ్యూనల్ 1976లో అవార్డును ప్రకటించింది. మాకు న్యాయంగా కేటాయించిన నీటినే వాడుకుంటున్నాం. తెలంగాణ చీటికి మాటికి నీటిని అక్రమంగా తరలించుకుని పోతుందని మాపై చేస్తున్న ఆరోపణ అవాస్తవం.
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం అడ్డు చెప్పడంతో ఏపీ దాని స్థానంలో పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టును తాజాగా తెరపైకి తెచ్చింది. గోదావరినదిలో ఏటా సగటున 1,000 నుంచి 1,500 టీఎంసీలకు పైగా వరద నీరు సముద్రంలో కలిసిపోతోంది. వర్షాకాలంలో 129 రోజులు వరద పోటెత్తుతుంది. ఇరు రాష్ట్రాలు వాడుకోకుండా సముద్రంలో వృధాగా కలుస్తున్న వరదనీటిలో 200 టీఎంసీలను మళ్లించేందుకు పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించామనీ, దీనిపై తెలంగాణ అనవరంగా రాద్దాంతం చేస్తోందని ఆరోపిస్తుంది. గోదావరి ట్రిబ్యూనల్ అవార్డు ప్రకారమే గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలించాలని నిర్ణయించామనీ, ఈ ప్రాజెక్ట్ వల్ల ఏ రాష్ట్ర నీటి హక్కులకు భంగం కలగదని చెప్తుంది.
బీఆర్‌ఎస్ వల్లే నీటి హక్కులు కోల్పోయాం: కాంగ్రెస్
”బీఆర్‌ఎస్ వల్లే తెలంగాణ నీటి హక్కులను కోల్పోయింది. పదేండ్లు పాలించిన ఆ పార్టీ ఏపీ నీటి దోపిడిని అడ్డుకున్న దాఖలాలు లేవు. బచావత్ ట్రిబ్యూనల్ పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అడ్డుకోలేదు. బచావత్ అవార్డు ప్రకారం ఏపీకి 66 శాతం (512టీఎంసీలు) 34 శాతం (299టీఎంసీలు) కేటాయింపులను అంగీకరిస్తూ అపెక్స్ కౌన్సిల్, కేఆర్‌ఎంబీ బోర్డు మీటింగుల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులు సంతకాలు చేశారు. వారి సంతకాలే తెలంగాణకు నేడు మరణ శాసనం అయ్యాయి. కృష్ణా నీటి వాటాలో 71 శాతం తెలంగాణకు, 29శాతం ఏపీకి ఇవ్వాలని పోరాడుతున్నాం. గోదావరి నుంచి పోలవరం బనకచర్ల ద్వారా రోజుకు 3టీఎంసీల నీటిని తరలించేందుకు బీఆర్‌ఎస్ నేతలు ఒప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ ప్రాజెక్ట్ పనులు ఆపించాం. వాస్తవాలను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్ నేతలు అసత్యాలను ప్రచారం చేస్తున్నారు’ అని కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది..
ఆ పాపం కాగ్రెస్‌దే : బీఆర్‌ఎస్
”తెలంగాణ నీటి వాటాల విషయంలో 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, 20 ఏండ్లు పాలించిన టీడీపీ పార్టీలు అన్యాయం చేశాయి. 1974లో బచావత్ ట్రిబ్యూనల్ 17 టీఎంసీలు జూరాలకు సుమోటోగా కేటాయించినా దాన్ని ఏ సర్కార్ పట్టించుకోలేదు. కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు 299 టీఎంసీల కోటాకు ఒప్పుకున్నది గత కాంగ్రెస్ ప్రభుత్వమే. రాష్ట్ర విభజన అయ్యాక 2014 జులై 14న సెక్షన్ 3 కింద కృష్ణా జలాల నీటిపై కేంద్రానికి ఫిర్యాదు చేశాం. 299 టీఎంసీలను వ్యతిరేకిస్తూ అపెక్స్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్రానికి 32 లేఖలు రాశాం. సుప్రీంలో కేసు వేశాం. తమ సర్కార్ ఒత్తిడి వల్ల 2023లో కేంద్రం సెక్షన్ 3 ప్రకారం పున:పంపిణీకి ఒప్పుకుంది. అయితే తుది అవార్డు ప్రకటించలేదు. దాంతో పాత పంపకాలే కొనసాగుతున్నాయి. అలాగే గోదావరిపై పోలవరం, బనకచర్ల, తాజాగా నల్లమల సాగర్ చేపడుతున్నా కాంగ్రెస్ సర్కార్ అడ్డుకోవడంలో విఫలమైంది’ అని బీఆర్‌ఎస్ వాదిస్తుంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇవే అంశాలు ప్రధాన చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఎవరి వాదన వారు వినిపించుకొనేందుకు అధికార, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.



