Monday, April 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరబీ చివరి పంటలకు నీరందించాలి

రబీ చివరి పంటలకు నీరందించాలి

- Advertisement -

జలాశయాల్లో పూడికతీత పనులు చేపట్టాలి
తాగునీటి కోసం సరిపడా నీటిని నిల్వచేయండి : అధికారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో చివరి దశలో ఉన్న రబీ పంటలకు నీరందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్‌లోని జలసౌధలో రబీ పంటలకు నీరు, జలాశయాలలో పూడికతీత తదితర అంశాలపై నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పంటలు ఎండిపోకుండా అన్ని ప్రధాన, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్ట్‌ల్లో అందుబాటులో ఉన్న నీటిని గరిష్టంగా వినియోగించాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక పరిస్థితుల మేరకు నిర్ణయాలు తీసుకోవాలన్నారు. నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ పరిధిలో సాగులో ఉన్న 6.30 లక్షల ఎకరాల పంటలకు రబీ సీజన్‌లో ఇప్పటివరకు సాగునీటి సౌకర్యం కల్పించామనీ, కొన్ని చోట్ల చివరి దశలో ఉన్న పంటలకు నీరందించాలని ఆదేశించారు. ఈ సీజన్‌లో తాగునీటి అవసరాలను తీర్చడానికి అన్ని చెరువులను నింపాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

జూరాల ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 1.66 టీఎంసీల నీటి నిల్వ ఉందనీ, నారాయణపూర్‌ ద్వారా రావాల్సిన 0.5 టీఎంసీలు సకాలంలో రాకపోతే కొరత ఏర్పడే అవకాశం ఉందని అధికారులు మంత్రికి వివరించారు. గత సంవత్సరం కర్ణాటక నుంచి ఒక టీఎంసీ నీటిని సమకూర్చామని గుర్తు చేశారు. జూరాల రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, జలాశయాల్లో పూడికతీత సాధ్యాసాధ్యాల సమాచారంతో కూడిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తొలగించిన మట్టిని రైతులకు ఉచితంగా సరఫరా చేయాలన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల పునరుద్ధరణ కోసం సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ అప్పగించిన అధ్యయనాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్‌, టన్నెల్‌ ఇంజనీరింగ్‌ నిపుణుడు కల్నల్‌ పరిక్షిత్‌ మెహ్రా, నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (జనరల్‌) రమేష్‌ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -