గోదావరి-కావేరి అనుసంధానంలో 50 శాతం ఇవ్వాలి
కేంద్రమే ఇచ్చంపల్లిని నిర్మించాలి
ఏపీ లింక్ ప్రాజెక్టులను అంగీకరించం
గోదావరి నికర జలాల్లో 964 టీఎంసీలు,
వరద జలాల్లో 1950 టీఎంసీల వాటా మాదే
ఎన్‌డబ్ల్యూడీఏ భేటీలో తేల్చి చెప్పిన తెలంగాణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
గోదావరి-కావేరి నదుల అనుసంధానం నీటి తరలింపులో సగం వాటాను తమకు కేటాయించాలని తెలంగాణ సర్కారు నీటిపారుదల శాఖ జాతీయ నీటి అభివద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ)ను డిమాండ్ చేసింది. శుక్రవారం కేంద్ర జలసంఘం చైర్మెన్ అతుల్ జైన్ అధ్యక్షతన జాతీయ నీటి అభివద్ధి సంస్థ గోదావరి పరివాహక రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాల అధికారులతో జలసౌధలో నదుల అనుసంధానంపై సమావేశం జరిగింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అధికారులు ఈ సమావేశంలో వర్చువల్‌గా హాజరయ్యారు. సీడబ్ల్యూసీ చైర్మెన్ అతుల్‌జైన్ అధ్యక్షత వహించారు. గోదావరి కావేరి నదుల అనుసంధానంతో తరలించే 148 టీఎంసీల్లో 74 టీఎంసీల వాటా ఇవ్వాల్సిందేననితెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇచ్చంపల్లి బ్యారేజీని కేంద్రం నిధులతో నిర్మించి నీటిని తరలిస్తే అభ్యంతరం లేదనీ, సమ్మక్క బ్యారేజీ నుంచి అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. నదుల అనుసంధానంలో భాగంగా పోలవరం నుంచి బనకచర్ల నీటి తరలింపును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని మరోసారి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కావేరి అనుసంధానంలో తెలంగాణలో సుమారు మూడు వేల ఎకరాలు ముంపుకు గురయ్యే అవకాశాలున్న నేపథ్యంలో నష్టపరిహారంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు డిమాండ్ చేశారు. 33 శాతం నీటివాటా ఇచ్చేందుకు జాతీయ నీటి అభివద్ధి సంస్థ అంగీకారం చెప్పినప్పటికీ, తెలంగాణ ససేమిరా అంది. 50 శాతం నీటి వాటాకు అంగీకరిస్తూ విధానపరమైన నిర్ణయం తీసుకుంటేనే ఇచ్చంపల్లిలో బ్యారేజీ నిర్మాణానికి సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు.
సమ్మక్క బ్యారేజీ పైనుంచి…
ఈ సమావేశంలో సమ్మక్క బ్యారేజీ నుంచి నీటితరలింపు అంశాన్ని ఎన్‌డబ్ల్యూడీఏ అధికారులు ప్రస్తావించగా, తెలంగాణ అభ్యంతరం తెలిపింది. సమ్మక్క సాగర్ నుంచి నీటిని తరలించాల్సి వస్తే 83 నుంచి 87 మీటర్ల ఎత్తు పైనుంచి మాత్రమే అంగీకరిస్తామనీ, 83 మీటర్ల కింది నుంచి నీటిని తీసుకోరాదని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టం చేశారు. అయితే 83 మీటర్ల పైనుంచి నీటిని తరలిస్తే కేవలం 70 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంటాయని జాతీయ నీటి అభివద్ధి సంస్థ అధికారులు చర్చల్లో ప్రస్తావించారు. అయితే ఇచ్చంపల్లిలో కేంద్రం నిధులతో బ్యారేజీ నిర్మించి 148 టీఎంసీలు తరలిస్తే అభ్యంతరం లేదనీ, ఆ నీటిలో 74 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని కోరింది. గోదావరిలో నీటివాటా 964 టీఎంసీలు ఉన్నప్పటికీ వరద జలాల్లో 1950 టీఎంసీల హక్కు తెలంగాణకు ఉండటంతో ఆ వాటాలు తేల్చాలని పట్టుబట్టింది. ఈ వాటాలు తేల్చిన అనంతరమే బనకచర్లపై ఆలోచిస్తామని తెలిపారు. తెలంగాణ స్పష్టమైన వైఖరితో వాదనలు వినిపించడంతో పాటు గోదావరి-కావేరి అనుసంధానంలో సగం వాటా తెలంగాణకు చెందాలని చేసిన ప్రతిపాదనలపై మరోసారి సమావేశం నిర్వహించి విధానపరమైన నిర్ణయాలను ప్రకటిస్తామని జాతీయ నీటి అభివద్ధి సంస్థ అధికారులు తెలిపారు. తెలంగాణపై ఆర్ధిక భారం పడకుండా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని సీడబ్లూసీ చైర్మెన్ అతుల్ జైన్ హామీ ఇచ్చారు.
మాప్రతిపాదనలు అంగీకరిస్తేనే తదుపరి భేటీ- రాహుల్ బొజ్జా
గోదావరి-కావేరి నదుల అనుసంధానంలో 74 టీఎంసీల వాటాకు తగ్గేది లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. అలాగే ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఏపీ నాలుగు ఇంటర్ లింక్ ప్రాజెక్టులను నిర్మించాలని చేసిన ప్రతిపాదనలను ఆయన వ్యతిరేకించారు. తెలంగాణ నీటిని కావేరికి తరలించే క్రమంలో ఏపీలో ఇంటర్ లింకింగ్ ప్రాజెక్టులు నిర్మించి నీటిని నిల్వచేయాలనే ప్రతిపాదనలను అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను సమావేశంలో వివరించినట్టు చెప్పారు. బనకచర్ల లింక్ అంశాన్ని ఏపీ తీసుకువచ్చే ప్రయత్నం చేసిందనీ, దీన్ని అంగీకరించే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేయడంతో దానిపై చర్చ జరగలేదన్నారు. సమావేశంలో తెలంగాణ నుంచి ఈఎన్సీలు అంజద్ హుస్సేన్, శ్రీనివాస్, రమేష్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొనగా ఏపీ నుంచి ఈఎన్సీ నరసింహామూర్తి హాజరయ్యారు. ఈమేరకు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.
నీటి వాటా తేల్చాల్సిందే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES