– దేవుళ్లను దేవుళ్లుగానే చూడాలి
– లబ్ది కోసమే రాజకీయాల్లోకి దేవుళ్లను లాగుతున్న బీజేపీ : మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంంగాణ బ్యూరో – హైదరాబాద్
తాము కూడా హిందువులమేననీ, దేవుళ్లను దేవుళ్లుగానే చూడాలని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేవలం లబ్ది పొందేందుకే దేవుళ్లను బీజేపీ నాయకులు రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీలో 90 శాతం మంది హిందువులేననీ, తాము కూడా ఆ దేవుళ్లనే పూజిస్తున్నామని స్పష్టం చేశారు. హిందూ సెంటిమెంట్‌తో బీజేపీ ఎల్లకాలం ప్రజల మద్దతు పొందలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అవీనీతిమయమైన బీఆర్‌ఎస్‌కు భవిష్యత్ లేదనీ, బీజేపీకి రాష్ట్రంలో ప్రభావం చూపించే పరిస్థితి లేదన్నారు. మాజీ సీఎం కూతురుగా కల్వకుంట్ల చేస్తున్న ఆరోపణలకు బీఆర్‌ఎస్ నుంచి సమాధానం లేదని ఆయన గుర్తు చేశారు. ప్రజావసరాలకు తగ్గట్టు ప్రజా ప్రభుత్వ పాలన ఉందనీ, ఏ రాష్ట్రంలో లేనట్టు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు.
మంత్రుల శాఖల విషయంలో సీఎం జోక్యం లేదని మంత్రి కొమటి రెడ్డి స్పష్టం చేశారని గుర్తుచేశారు. చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట క్యాబినెట్ సమావేశం కావడం శుభ పరిణామని స్వాగతించారు. సినిమా రంగంలో తమకు అంతా సమానమేనని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ లేకుండా చూస్తామనీ, కాంగ్రెస్ పార్టీలో నేను అన్నపదానికి విలువ లేదని తేల్చి చెప్పారు. జిల్లాల విభజన బీఆర్‌ఎస్ అశాస్త్రీయంగా చేసిందని విమర్శించారు. శాస్త్రీయంగా మార్పులు చేర్పులు సీఎం భావిస్తున్నట్టు వెల్లడించారు. జిల్లాలను తీసేసే ఆలోచన తమకు లేదన్నారు. భూభారతిలో అవినీతి జరిగినట్టు ఆధారాలుంటే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కార్పొరేషన్ చైర్మెన్ పదవులు తక్కువగా, డిమాండ్ ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. నీటి వాటా విషయంలో రాజీ పడబోమన్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారి నుంచి పార్టీ నాయకులకు ఇబ్బంది లేకుండా చూస్తామని భరోసానిచ్చారు. కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలిగించే హక్కు ఎవ్వరికీ లేదనీ, మహిళా అధికారులపై అధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చెయ్యడం సరికాదన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
తెలుగు ప్రజలకు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల జీవితాల్లో వెలుగు, సంతోషం, శుభఫలితాలు నిండాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ అనేది రైతుల రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకొని వ్యవసాయ రంగ అభివృద్ధికి అనేక సంస్కరణలు అమలు చేస్తోందని, రైతులు ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకునేలా చర్యలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. రైతు భరోసా, సాగునీటి ప్రాజెక్టులు, పంటలకు గిట్టుబాటు ధరలు వంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. ఈ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా వేడుకలు జరుపుకుంటూ, సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
మేమూ హిందువులమే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



