తెలంగాణ మీడియా అకాడమి చైర్మెన్ కె శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ మీడియా అకాడమి కట్టుబడి ఉందని అకాడమి చైర్మెన్ కె శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని అకాడమి కార్యాలయంలో రెండో పాలకమండలి సమావేశాన్ని శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ లోని ఎనిమిది జిల్లాల జర్నలిస్టులకు శిక్షణా కార్యక్రమాలు, వివిధ అంశాలపై ఏడు వర్క్‌షాప్‌లు, 12 మంది సీనియర్ జర్నలిస్టులు చేసిన సేవలను రాబోయే తరాలకు తెలియపర్చాలనే ఉద్దేశ్యంతో వారి జీవితాలపై మోనోగ్రాఫ్స్ (చిరు పుస్తకాలు) ముద్రించినట్టు ఆయన తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమంలో భాగంగా విడతల వారీగా మరణించిన 120 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం, ఐదేండ్ల కాలపరిమితితో నెలకు రూ. మూడువేల పెన్షన్ సదుపాయం కల్పించినట్టు ఆయన వివరించారు.
అదే విధంగా అనారోగ్యం, ప్రమాదాలకు గురైన 19 మంది జర్నలిస్టులకు ఆర్థిక సహాయం చేశామన్నారు. అకాడమి భవన నిర్వహణలో భాగంగా 250 మంది సీటింగ్ కెపాసిటీ గల ఆడిటోరియం అద్దెకు ఇవ్వడానికి సమావేశంలో చర్చించగా కమిటీ సభ్యులు తమ ఆమోదం తెలుపడం పట్ల సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పాలక మండలి సమావేశంలో సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ సిహెచ్ ప్రియాంక, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ సతీష్ కుమార్ తల్లాడి, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ ఇన్‌చార్జి హెడ్ డాక్టర్ సునిల్ కుమార్ పోతన, దూరదర్శన్ కేంద్ర ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఎ. చాందిని, ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్. రమేశ్ సుంకసారి, స్పెషల్ గెస్ట్ వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం జర్నలిజం డిపార్ట్‌మెంట్ హెడ్ బి.వి. కృష్ణాజీరావు, తెలంగాణ మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.



