– ఏదాదిలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు
– ఇందిరమ్మ ఇండ్లలో ఐదు శాతం రిజర్వేషన్లు
– పదేండ్ల పాలనలో వారిపై పూర్తి నిర్లక్ష్యం : విలేకర్ల సమావేశంలో ముత్తినేని వీరయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గత పదేండ్ల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వికలాంగుల పట్ల పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ ముత్తినేని వీరయ్య విమర్శించారు. చైర్మెన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వికలాంగుల సంక్షేమం అభివృద్ధిలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. ఉన్నత విద్యలో ఐదు శాతం రిజర్వేషన్‌లను అమలు చేస్తున్నట్టు తెలిపారు. రాజీవ్ యువ వికాసం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా ఐదు శాతం రిజర్వేషన్ వల్ల సుమారు రూ.300కోట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. 23వేల మంది వికలాంగులు స్వయం సమృద్ధి పొందుతారని చెప్పారు.
వారికి ఉచితంగా అందించే సహాయ ఉపకరణాలు (ట్రై మోటరైజడ్ స్కూటీలు)40శాతం బెంచ్ మార్క్ వైకల్యానికే అందించేలా చట్టం చేశామన్నారు. కార్పొరేషన్‌లో పని చేస్తున్న వికలాంగ ఉద్యోగులకు 2010, 2015, 2020 పీఆర్‌సీలు అందించేందుకు చట్టం చేసినట్టు గుర్తుచేశారు. ఇందిరమ్మ ఇండ్లలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పారు. క్రీడా విధానంలోనూ భారీ పారితోషకాలు అందిస్తున్నట్టు వివరించారు. వికలాంగులను వికలాంగులే పెండ్లి చేసుకుంటే కళ్యాణలక్ష్మితో పాటు అదనంగా రూ. లక్ష ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని చెప్పారు. వికలాంగులు స్వయం సమృద్ధి సాధించేలా 705 మందికి ఒక్కొక్కరికి రూ. 50 వేలచొప్పున రుణాలు అందించామన్నారు.
2,367 వికలాంగుల పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి ఒక్కో సంఘానికి రూ. 15వేల చొప్పున రూ. 3.55 కోట్లు విడుదల చేశామన్నారు. అంగవైకల్యం బారిన పడిన చిన్న పిల్లలను గుర్తించి వారికి అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తూ వైకల్యం నుంచి విముక్తి పొందేలా ”బాల భరోసా” కార్యక్రమం ప్రారంభిం చామన్నారు. గత పదేండ్లలో కార్పొరేషన్‌కి రూ.64 కోట్లు కేటాయిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రూ. 100 కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేసుకుని వికలాంగుల అభివృద్ధికి బాటలు వేశామని చెప్పారు.