Tuesday, April 7, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుహామీలు నెరవేరుస్తున్నాం

హామీలు నెరవేరుస్తున్నాం

- Advertisement -

– మేం పాలకులం కాదు..ప్రజా సేవకులం
– ఆదిలాబాద్‌ ప్రజల గుండెల నిండా అభిమానం
– ప్రతి రెండు నెలలకోసారి వస్తాం.. నిధులు ఇస్తాం
– బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధి
– తుమ్మిడిహెట్టి, ప్రాణహిత నిర్మాణానికి సర్వే : పిప్రి గ్రామ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
– రూ.225 కోట్లతో బాసర సరస్వతీ ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాలకులుగా కాకుండా ప్రజా సేవకులుగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన తీసుకురావడానికి చేసిన పోరాటంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సోమవారం సీఎం పర్యటనలో భాగంగా నిర్మల్‌ జిల్లా బాసరలో రూ.225 కోట్లతో జ్ఞాన సరస్వతి ఆలయం పునర్నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. మనుమడికి ఆలయంలో అక్షరభ్యాసం చేయించారు. అనంతరం రూ.1,250 కోట్లతో బోథ్‌ నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బజార్‌హత్నూర్‌ మండలం పిప్రి గ్రామంలో ‘ప్రజాపాలన-ప్రగతిబాట’ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.పోరాటయోధుడు కుమురంభీం స్ఫూర్తితో ప్రజాపాలన తీసుకురావడానికి పోరాటాల పురిటిగడ్డ ఇంద్రవెల్లి నుంచి టీపీసీసీ నాయకుడిగా యాత్ర ప్రారంభిస్తే సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క పిప్రి గ్రామం నుంచి పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర చేపట్టారని గుర్తు చేశారు. ఆనాడు ప్రజలకు ఇచ్చిన హామీలను నేడు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ప్రజల గుండెల నిండా అభిమానం ఉందని, మహబూబ్‌నగర్‌ను ఏ విధంగానైతే అభివృద్ధి చేస్తానో ఆదిలాబాద్‌ను కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. రాబోయే గోదావరి పుష్కరాలకు నిధులు కేటాయించడంతోపాటు బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధిలో భాగంగా మొట్టమొదటిగా గూడెం సత్య నారాయణ స్వామి ఆలయానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా త్వరలోనే గిరిజన యునివర్సిటీ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. జిల్లాలు పారిశ్రామికపరంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధిపర్చడమే కాకుండా 2034 నాటికి విద్యాకేంద్రంగా ఆదిలాబాద్‌ను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి వస్తానని, వచ్చిన ప్రతిసారీ నిధులు కేటాయిస్తానని చెప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన సీఎం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని, ఇందుకు రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.22,500 కోట్లతో 4.5లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని చెప్పారు. ఇప్పటివరకు రూ.5,400 కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ఎంపీ గొడెం నగేష్‌, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జుపటేల్‌, అనిల్‌జాదవ్‌, రామారావ్‌ పటేల్‌, మహేశ్వర్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావ్‌, కలెక్టర్లు రాజర్షి షా, అభిలాష అభినవ్‌, హరిత, కుమార్‌ దీపక్‌, ఎస్పీలు అఖిల్‌ మహాజన్‌, జానకి షర్మిల, ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -